
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లు కావస్తున్నా రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం రియల్ ఎస్టేట్ వ్యాపారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇప్పటివరకు రాజధాని డిజైన్లు కూడా ఖరారు కాకపోవడంతో మొదలు పెట్టిన ప్రాజెక్టుల్లో అమ్మకాలు లేకపోవడంతో పాటు కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి ఎవ్వరూ ముందుకు రావడంలేదు. దీంతో అమరావతి పరిధిలో రూ.10,000 కోట్ల విలువైన 3 కోట్లకు పైగా చదరపు అడుగుల నిర్మాణాల పరిస్థితి గందరగోళంగా తయారైంది.
రాజధాని నిర్మాణం మొదలు కాకపోవడంతో కొనుగోలుదారులు ముందుకు రావడంలేదని, వచ్చే ఎన్నికల తర్వాత కొనుగోలు చేద్దామనే ఉద్దేశ్యంతో వాయిదా వేస్తున్నారని క్రెడాయ్ మాజీ జాతీయ అధ్యక్షుడు సి. శేఖర్‌రెడ్డి వివరించారు. బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదన్నారు. విభజన తర్వాత ఎన్నారైలతో సహా చాలామంది సొంత ప్రాంతంలో ఇళ్లు, స్థలాలు కొనుగోలుకు మొగ్గు చూపుతున్నట్లు శేఖర్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 20,000 ఫ్లాట్లు విక్రయానికి సిద్ధంగా ఉండగా ఈ మధ్యనే కొత్తగా 6,000 ఫ్లాట్ల నిర్మాణ పనులు మొదలు పెట్టినట్లు క్రెడాయ్ ప్రతినిధులు తెలిపారు.
పెరుగుతున్న ధరలు
పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ తర్వాత కుదేలైన రియల్ ఎస్టేట్ రంగాన్ని ఇప్పుడు పెరుగుతున్న ముడి సరుకుల ధరలు మరింత కలవరపరుస్తున్నాయి. గత కొద్ది రోజులుగా స్టీల్, సిమెంట్ ధరలు పెరగడంతో పాటు ఇసుక లభ్యత తగ్గడం పరిశ్రమను తీవ్ర ఇక్కట్లకు గురి చేస్తోందని క్రెడాయ్ ఏపీ చాప్టర్ అధ్యక్షుడు శివారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. టన్ను స్టీల్ ధర రూ.35,000 నుంచి 50,000కు చేరిందన్నారు. సిమెంట్ ధరలు, కూలీ రేట్లు కూడా పెరగడంతో పాటు తగినంత ఇసుక సరఫరా లేకపోవడంతో అడుగుకు రూ.150 – రూ.200 వరకు ధరలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment