అమరావతి రాజధాని అంశం ఏమోగానీ అన్ని విపక్ష పార్టీల రంగులనూ కలుపుతోంది; వారి అసలు రంగులను బహిర్గతం చేస్తోంది. గతంలో కత్తులు దూసుకున్నవారు ఇప్పుడు కౌగిలించుకుంటున్నారు. సిద్ధాంత విభేదాలు అన్నవారు కలిసి చేతులు పైకెత్తుతున్నారు. లక్ష కోట్లు ఒకే దగ్గర ఎలా పెట్టుబడిగా పెడతారని ప్రశ్నించినవారు లక్ష్యం విడిచి మాట్లాడుతున్నారు. రాయలసీమను రెండో రాజధాని చేయాలని డిక్లరేషన్ ఇచ్చినవారు రెండు రకాలుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో ఎవరి స్వార్థ ప్రయోజనాలు ఇమిడివున్నాయో, ఏ పార్టీ వ్యూహంలో వీళ్లు పావులుగా మారుతున్నారో ప్రజలు గమనిస్తున్నారు. అభివృద్ధిని వికేంద్రీకరించాలనీ, శ్రీబాగ్ ఒప్పందానికి కట్టుబడి ఉండాలనీ తపన పడుతున్న ప్రభుత్వ వైఖరిని కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు.
జై అమరావతి పేరుతో తిరుపతిలో బహి రంగ సభ జరిపి విపక్షాలు ఏమి సాధిం చాయి? కాకపోతే కొన్ని చిత్ర, విచిత్ర విన్యాసాలు జరిగాయి. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ పూర్వ అధ్య క్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఒకే వేదిక పంచుకోవడం ఆసక్తికర పరిణామం. ఇదే లక్ష్మీనారాయణ గతంలో కాంగ్రెస్‌లో మంత్రిగా ఉన్న ప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుతో ఎన్నోసార్లు గొడవపడ్డారు.
గత ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీని టీడీపీ నేతలు ఎంతగా అవమానించింది, చివరికి ఆయన భార్య గురించి ప్రస్తా వించి ఎలా అవమానించింది, హోంమంత్రి అమిత్ షా పార్టీ అధ్య క్షుడిగా ఉన్నప్పుడు తిరుపతిలో టీడీపీ కార్యకర్తలు రాళ్లు వేసింది... ఇవన్నీ తెలిసీ బీజేపీ నేతలు చంద్రబాబుతో వేదిక పంచుకోవడం చూడదగిన ముచ్చటే. రాయలసీమ డిక్లరేషన్ పేరుతో హైకోర్టు కర్నూలులో ఉండాలని, రెండో రాజధాని ఏర్పాటు చేయాలని, సచివాలయం, గవర్నర్, సీఎం క్యాంప్ ఆఫీస్ నెలకొల్పాలని డిమాండ్ చేసిన బీజేపీ ఆ డిక్లరేషన్‌కు తిలోదకాలు ఇచ్చిందని అనుకోవాలి.
రాయలసీమ బీజేపీ నేతలు ఎక్కువ మందికి ఆ డిమాండ్లు నెరవే రాలని ఉంది. అందుకేనేమో గుంటూరు జిల్లాకు చెందిన కన్నా లక్ష్మీ నారాయణ, రావెల కిషోర్‌బాబు, పాతూరి నాగభూషణం, నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి బీజేపీ పక్షాన మాట్లాడారు. కన్నా కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరితే, వాకాటి, రావెల, పాతూరి టీడీపీ నుంచి బీజేపీలో చేరారు.
సాధారణంగా బీజేపీతో వామపక్షాలు ఒకే వేదిక మీద ఉండటా నికి ఇష్టపడవు. సీపీఎం పక్షం ఈ విషయాన్ని స్పష్టం చేసి సభకు దూరంగా ఉంది. సీపీఎం కార్యదర్శి మధు కూడా హైకోర్టు కర్నూలులో ఉండాలన్నది న్యాయమైన డిమాండ్ అని గతంలో వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. సీపీఐ నేతలు నారాయణ, రామకృష్ణ మాత్రం బీజేపీతో కలిసి వేదిక ఎక్కారు. చేతులు పైకెత్తారు. రామకృష్ణ గతంలో అమరావతి రాజధాని పేరుతో అభివృద్ధి అంతా ఒకే చోట జరిగితే ఎలా అంటూ ప్రశ్నించిన వీడియో ప్రాచుర్యంలోకి వచ్చింది. తులసి రెడ్డి కాంగ్రెస్ పక్షాన సభలో ప్రసం గించారు. జనసేన తరపున రాందాస్ చౌదరి మాట్లాడారు.
బీజేపీ ఎట్టి పరిస్థితిలోను చంద్రబాబుతో కలవబోమని అంటుం టుంది. ఇక్కడ మాత్రం చంద్రబాబుకు స్నేహ హస్తం చాచింది. ఈ సభ తర్వాత కూడా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. అలాంట ప్పుడు హైకోర్టుతో సహా అన్నీ అమరావతి గ్రామాలలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసే టీడీపీతో కలిసి బీజేపీ ఎలా ఆందోళనలో పాలుపంచుకుంటుంది అన్న దానికి సమాధానం ఇవ్వాలి కదా! జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంలో అమరావతి కేవలం టీడీపీ వారికి చెందిందనీ; ఉత్తరాంధ్ర, రాయలసీమ నుంచి వచ్చేవారు ఇక్కడ ఎలా ఉండగలరనీ ప్రశ్నించారు.
తనతో మంగళగిరి వద్ద ఉన్న అటవీ భూమి రెండువేల ఎకరాలలో రాజధాని పెడతానని చెప్పిన చంద్రబాబు, ఆ తర్వాత వేల ఎకరాలు సమీకరించడం దేనికని కూడా పవన్ ప్రశ్నించారు. విశాఖ, కర్నూలు వెళ్లినప్పుడు వాటినే రాజధానులుగా భావిస్తున్నట్లు చెప్పిన ఆయన ప్రస్తుతం అమరా వతే రాజధాని అంటు న్నారు. వీరందరినీ చంద్ర బాబు ఎలా ఆకట్టుకున్నారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. లేదా ముఖ్య మంత్రి జగన్‌పై విద్వేషంతో వీరంతా చంద్రబాబుతో చేతులు కలిపి ఉండాలి.
ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో ముప్పైవేల ఎకరాలు రాజ ధానికి కావాలని అన్నారని చంద్రబాబు మరోసారి ప్రస్తావించారు. జగన్ ప్రసంగాన్ని వక్రీకరించారా లేదా అన్నది సంబంధిత వీడియో చూస్తే అర్థం అవుతుంది. 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉండాలని జగన్ అప్పట్లో అన్నారు. పూలింగ్ విధానం ద్వారా నయా జమీం దార్లు తయారు అవుతారని, రియల్ ఎస్టేట్ వ్యాపారులకే లాభం అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. వాటి గురించి చంద్రబాబు మాట్లా డరు. హైదరాబాద్, చెన్నై కన్నా గట్టినేల అమరావతిలో ఉందని నిపుణులు చెప్పారని చంద్రబాబు అంటున్నారు.
అది నిజమే అయితే అమరావతి ప్రాంతంలో పునాది ఇబ్బందులను అధిగమించడానికి రాప్ట్ టెక్నాలజీని చంద్రబాబు ప్రభుత్వం వాడుతోందని, ఇది గొప్ప విషయం అని అప్పట్లో తెలుగుదేశం మీడియా ప్రచారం చేసింది అవాస్తవమా? పదివేల కోట్లు ఖర్చు పెట్టినా రాజధానిలో పది శాతం కూడా ఎందుకు పూర్తి చేయలేకపోయారు? కేవలం తాత్కాలిక భవనాలు నిర్మించింది ఎందుకు? ఇన్‌సైడర్ ట్రేడింగ్ చట్టంలో లేదని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని ఆయన అంటున్నారు. చట్టంలో లేనంత మాత్రాన ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరగలేదని కోర్టులు చెప్పలేదు కదా! కేవలం సాంకేతిక అంశాల ఆధారంగా కోర్టులు తీర్పు ఇచ్చాయి. ఇవే కోర్టులు గతంలో క్విడ్ ప్రో కో అన్న పదం ఏ చట్టంలో ఉందని కొందరిపై కేసులు పెట్టడానికి ఆమోదం తెలిపాయి?
సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అని, దీనికి అసలు ఖర్చు పెట్టనవసరం లేదని చంద్రబాబు అంటున్నారు. మరి ఇదే నేత గతంలో నాలుగైదు లక్షల కోట్లు లేనిదే రాజధాని ఎక్కడ అవుతుందని అన్నారా, లేదా? ప్రస్తుత ఏపీ ప్రభుత్వం ఇక్కడ భూములు ఏమైనా విక్రయించి కొంత అభివృద్ధి చేయవచ్చా అని పరిశీలించగానే ఇదే టీడీపీ, ఆ పార్టీకి వత్తాసు పలికే మీడియా... భూములు అమ్ముతారా అంటూ గగ్గోలు చేసింది. ఈ ప్రాజెక్టులో ప్రభుత్వానికి మిగిలే భూమి ఏమీ ఉండదని గతంలో మంత్రి నారాయణ పలుమార్లు అన్నారే! పేదవాడు అక్కడ ఉండే అవకాశం ఉందా? కేవలం ధనవంతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే రాజధానా అన్న విమర్శలను ఇవే పక్షాలు అప్పట్లో చేశాయి కదా? భూములు అమ్మితే లక్షల కోట్లు వస్తాయని చంద్రబాబు అంటున్నారు.
ఆ పని చేసి ఆయన ఎందుకు రాజధాని భవనాలు నిర్మించలేదు? పైగా బాండ్ల పేరుతో అప్పులు చేశారే! అమరావతి రైతులు త్యాగం చేశారని ప్రచారం చేస్తున్నారు. లక్షన్నర రూపాయల వరకు రుణ మాఫీ చేసి, ప్రతి సంవత్సరం ఎకరాకు నిర్దిష్ట కౌలు ఇస్తూ, ప్యాకేజీని పొందుతున్న రైతులు త్యాగజీవులు అయితే, ఎలాంటి ప్యాకేజీ లేకుండా ప్రాజెక్టుల కింద భూములు ఇచ్చినవారు ఏమి అవుతారు?
మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రస్తావన తెచ్చింది. విశాఖ నగరం అయితే సులువుగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని ప్రస్తుత ప్రభుత్వ భావన. శ్రీబాగ్ ఒప్పందం అమలు చేయడం కోసం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని, గుంటూరును శాసన రాజధానిగా ఉంచాలని సంకల్పించారు. అన్నిటినీ మించి మరో విషయం చెప్పాలి. అమరావతి రైతుల పేరుతో పాదయాత్ర చేశారు. అంతవరకూ తప్పు పట్టనక్కర్లేదు. కానీ రాయలసీమ ప్రజలను రెచ్చగొట్టే విధంగా తిరుపతిలో సభ పెట్టవలసిన అవసరం ఉందా? ఏదో విధంగా అక్కడి ప్రజలను రెచ్చగొట్టి గొడవలు సృష్టించాలన్న ఆలోచనతో ఏమైనా చేశారా అన్న అనుమానం ఉంది. అయినా పోలీసులు సమర్థంగా వ్యవహరించి ప్రశాంతంగా సభ పూర్తి అయ్యేలా చూశారు.
రాయలసీమ వాసులు సంయమనంగా ఉన్నారు కాబట్టి సరిపోయింది. లేకుంటే ఎన్ని సమస్యలు వచ్చేవి! ఇదే రాయలసీమ వారు అమరావతి ప్రాంతంలో సభ పెట్టి ఉంటే ఎంత గందరగోళం చేసేవారో? గతంలో నగరి ఎమ్మెల్యే రోజా, మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిలను అమరావతి ప్రాంతంలో అడ్డుకుని ఎంత ఇబ్బంది పెట్టింది గుర్తు చేసుకోవాలి. అమరావతికి పోటీగా తిరుపతిలో వికేంద్రీకరణ సభ జరిగింది. అక్కడ జనం పెద్ద ఎత్తున వచ్చినా టీడీపీ మీడియాకు అది మహోద్యమంగా కనిపించలేదు. రియల్ ఎస్టేట్ ప్రయోజనాలను పరిరక్షించుకోవడంతో పాటు, ఏదో రకంగా టీడీపీ ఉనికిని నిలబెట్టుకోవడానికి చంద్రబాబు గేమ్ ప్లాన్ ఇదంతా అని తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు.
-కొమ్మినేని శ్రీనివాసరావు
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment