హైదరాబాద్‌లో ఉమ్మడి ఏపీ రాజధాని ఉన్నప్పుడు అన్ని ఆఫీసులు కలిపి 235 ఎకరాల భూమిలో ఉన్నాయి. మరి అమరావతి పేరుతో వేల ఎకరాలు సేకరించవలసిన అవసరం ఏమొచ్చింది? ప్రైవేటు వ్యక్తుల రియల్ ఎస్టేట్ కోసం ప్రభుత్వం వేల కోట్లు వ్యయం చేయడం సమంజసమేనా? భూములు ఇచ్చి త్యాగం చేశారని చెప్పే రైతులకు ఏటా కౌలు రూపంలో కోట్లు చెల్లించవలసిన అవసరం ఎందుకొచ్చింది? ఇదంతా గత ప్రభుత్వం చేసిన తప్పిదం. టీడీపీ ఫెయిల్యూర్ స్టోరీని సక్సెస్ స్టోరీగా చూపించడానికి దానికి మద్దతిచ్చే మీడియా విశ్వయత్నం చేస్తోంది. రైతులు ఎవరికైనా అన్యాయం జరిగితే దాని గురించి ఎవరైనా అడగవచ్చు. కానీ ఆ ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారుల లక్ష్యాల కోసం పనిచేయడం సరికాదు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని సమస్య కొరకరాని కొయ్యగా మారింది. విపక్ష టీడీపీ, ఆ పార్టీకి మద్దతిచ్చే మీడియా నిరంతరం ప్రభుత్వ ప్రతిపాదనలకు అడ్డు తగలడంతో పాటు, న్యాయ వ్యవస్థ నుంచి వచ్చిన ఆచరణ సాధ్యం కాని తీర్పులు కూడా ఇందుకు కారణంగా కనిపిస్తాయి. వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానులను హైకోర్టు తోసి పుచ్చి, మూడు నెలల్లో రాజధాని నిర్మాణం చేసేయాలని ఆదేశించింది. ఏ వ్యూహం అనుసరించాలని అనుకున్నదో గానీ, ఏపీ ప్రభుత్వం ఈ తీర్పులపై అప్పీల్‌కు వెళ్లలేదు. ప్రభుత్వం తాను భావించినట్లు మూడు రాజధానులపై ముందుకు కదలడం కష్టంగా ఉంది. అమరావతి రాజధానిగా పిలిచే గ్రామాలలో అభివృద్ధి పనులు చేయడానికి అవసరమైన వనరులు సమకూర్చుకోవడం కూడా సమస్యగానే ఉంది. ప్రభుత్వం వద్ద డబ్బు లేదు కనుక, అక్కడ ఉన్న భూములు కొన్నిటిని అమ్మి పనులు చేపడదామని అనుకున్నా, టీడీపీ మీడియా దానిని వ్యతిరేకిస్తూ గందరగోళం సృష్టించే యత్నం చేస్తోంది.
రాజధాని గ్రామాలలో ఉన్న ప్రభుత్వ భూమి పదిహేను ఎక రాలు అమ్మడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోగానే... ఇంకేముంది రాజధాని భూములు అమ్మేస్తున్నారని ప్రచారం మొదలైంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అమరావతిలో ఒక్క ఇటుక పెట్టని ప్రభుత్వానికి భూములు అమ్మే హక్కు లేదని తేల్చేశారు. విచిత్రం ఏమిటంటే, ఆయన ప్రభుత్వమే ఇటుకలు పెట్టడానికి ముందే భూముల విక్రయానికీ, తనఖాకూ సంబంధించిన జీవోను విడుదల చేసింది. కాగా హైకోర్టువారు తమ తీర్పులో రాజధానిలో ప్రభుత్వ వాటాకు వచ్చే భూమిని కొంత వాడుకుని డబ్బు సమకూర్చవచ్చని ప్రస్తావించింది. ఆ ప్రకారం చేసినా వచ్చేది చాలా తక్కువ డబ్బే. దానికి కూడా ఈ శక్తులు విఘాతం కలిగిస్తున్నాయి.
మొత్తం పదిహేను ఎకరాలను ప్రభుత్వం నిర్ణయించిన ఎకరా పదికోట్లకు అమ్ముడుపోయినా 150 కోట్లే వస్తుంది. నిజంగానే ఆ డబ్బు వస్తే, మరికొన్ని భూములను అదేరీతిలో అమ్మే అవకాశం ఉంటుంది. తద్వారా రాజధానిలో వివిధ పనులు చేపట్టవచ్చు. రాజ ధాని రైతుల పేరుతో కోర్టులో పడిన వ్యాజ్యాలలో ఎకరా పది కోట్లు ఉంటుందనీ, దానిని అమ్ముకుని ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టవచ్చనీ పేర్కొన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు అసలు రాజధాని స్వయంసిద్ధ నగరమనీ, బయట నుంచి ఒక్క పైసా పెట్టనవసరం లేదనీ ప్రచారం చేస్తున్నారు. అది నిజమే అయితే కేంద్రం అర్జెంట్‌గా లక్షకోట్లు పంపించాలనీ, లేకుంటే రాజధాని ముందుకు సాగదనీ ప్రధాని మోదీకి, ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎందుకు లేఖ రాశారో చెప్పరు. కేవలం ఒక దశ మౌలిక వసతులకే 54 వేల కోట్లు అవుతుందని ఎలా అంచనా వేశారో ఎన్నడూ వివరించరు.
నిజంగానే ప్రభుత్వం లక్ష కోట్లు ఖర్చు చేయగలిగే పరిస్థితి ఉందా? ఒకవేళ చేయాలని అనుకున్నా, రాష్ట్ర ప్రజలందరినుంచి వసూలు చేసిన పన్నుల సొమ్ము కేవలం 29 గ్రామాలలో వ్యయం చేయడం సరైనదేనా? అంటే 29 గ్రామాలలో ముందుగానే భూములు కొనుగోలు చేసిన రాజకీయ నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంపద పెరగడం కోసం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు తమ సంపదను త్యాగం చేయాలన్నమాట!
తాజాగా ప్రభుత్వం చేస్తున్న భూ విక్రయం సజావుగా సాగక పోతే ఏంచేయాలి? అప్పుడు హైకోర్టువారు ఆర్థిక వనరులపై ఏమైనా కొత్త సలహాలు ఇచ్చే అవకాశం ఉంటుందా? నిజానికి రాయపూర్, గాంధీనగర్ వంటి చోట్ల రాజధానులు విడిగా ఏర్పాటు చేసుకున్నా, అక్కడేమీ ప్రత్యేక అభివృద్ధి జరగలేదు. ప్రపంచవ్యాప్తంగా అక్కడ క్కడ కొత్త నగరాల నిర్మాణానికి చేసిన ప్రయత్నాలు విఫల మయ్యాయి. ఆ దేశాలు అప్పుల పాలయ్యాయి.
అలా కాకుండా ప్రభు త్వానికి అవసరమయ్యే భవనాల కోసం భూములు తీసుకుని నిర్మాణం చేస్తే, మిగిలిన భూములలో ప్రైవేటు వ్యక్తులు ఎవరికి వారు అభివృద్ధి చేసుకుంటారు. వారు ఇచ్చే పన్ను లతో ప్రభుత్వాలు వారికి మరిన్ని మౌలిక వసతులు పెంచవచ్చు. అలాకాకుండా చంద్రబాబు రివర్స్‌లో వెళ్లడంతో ఏపీ అంతా సంక్షోభంలో పడింది. విశాఖ నగరా నికి ఈ సమస్య లేదు.
కొన్ని భవనాలు నిర్మించుకుంటే సరిపోతుంది. పైగా అది ఏపీలోనే అభివృద్ధి చెందిన నగరం కనుక ప్రపంచం దృష్టిని త్వరగా ఆకర్షించగలుగుతుంది. అలాకాకుండా అమరావతిలో 2018 లోనే ఒలింపిక్స్ పెడతామని ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే అది ఎంత బోగస్ వ్యవహారమో, ఇప్పుడు అమరావతి రాజ ధాని కూడా పైసా ఖర్చు లేకుండా నిర్మిస్తామని అనడం కూడా అంతే బోగస్ వ్యవహారం అవుతుంది. అటు విశాఖలో గానీ, ఇటు అమరావ తిలో గానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా అడ్డుకోవడం వరకు టీడీపీ, దానికి మద్దతిచ్చే మీడియా సక్సెస్ అయ్యాయి.
మరో సంగతి కూడా చెప్పుకోవాలి.
రాజధాని ఉద్యమం 900వ రోజుకు చేరుకుందంటూ ఇటీవల ఒక సదస్సు పెట్టారు. అందులో ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే, ఉమ్మడి ఏపీ విభజనకు కారకు లైనవారిని పిలిచి మాట్లాడించడం! వారు ఏపీ ప్రభుత్వానికి సుద్దులు చెప్పడం! రిటైర్డ్ జడ్జి గోపాలగౌడ అయితే మరీ విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. లక్షన్నర కోట్లు అప్పులు చేసి రాజధాని నిర్మించాలని ఆయన అన్నారు. గతంలో భూసమీకరణ తీరును వ్యతిరేకించిన ఈయన ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం మాట్లాడట ఏమిటో తెలియదు. వేరే రాష్ట్రానికి చెందిన వీరికి శ్రీబాగ్ ఒడంబడిక, వికేంద్రీకరణ తదితర అంశాల గురించి తెలిసి ఉండకపోవచ్చు. శివరామకృష్ణన్ కమిటీ మూడు పంటలు పండే భూములలో రాజధాని పెట్టవద్దని చెప్పిన సంగతినీ ఎవరూ చెప్పకపోయి ఉండవచ్చు. హరగోపాల్ విజయవాడ వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారుల సరసన కూర్చుని మాట్లాడతారని ఎవరూ ఊహించలేం. ఆయనను ఎవరు మాయ చేసి తీసుకు వచ్చారో తెలియదు కానీ పూర్తిగా పేదల ప్రయోజనాలను ఆయన విస్మరించడం విస్తుపరుస్తుంది.
హరగోపాల్ వంటివారిని కూడా అప్రతిష్ఠపాలు చేయగల తెలివైన రాజకీయనేతలు ఏపీలో ఉండటం విశేషమే. మరో మేధావి, తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రవారిని ఉద్యమకారులు కొందరు దూషిస్తున్న సమయంలో ఎన్నడైనా వారించారా? ఇప్పుడు సడన్‌గా ఏపీపై అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? దానికి కారణం టీడీపీ అధినేత చంద్ర బాబుతో ఏర్పడిన సన్నిహిత సంబంధాలేనా? గత ఎన్నికల సమయంలో టీడీపీ, కాంగ్రెస్, సీపీఐలతో కలిసి పోటీచేసిన కోదండ రామ్ పార్టీకి మెజార్టీ చోట్ల డిపాజిట్లు దక్కకపోయి ఉండవచ్చు! అయినా ఆనాడు కోదండరామ్ పార్టీకి అవసరమైన వనరులన్నీ టీడీపీ నాయకత్వం సమకూర్చిందన్న కృతజ్ఞతతోనే వారు విజయవాడ వరకు వెళ్లి, అమరావతికి మద్దతు ఇచ్చి వచ్చారా? ఒక టెంట్ కింద కూర్చుని, టీడీపీ మీడియాతో మాట్లాడి వెళ్లిపోయేవారు మహో ద్యమం చేసినట్లుగా వీరంతా గుర్తించారన్నమాట!
రాజధాని రైతుల భూములు పోయాయట. మరి వారు తీసు కుంటున్న పరిహారం మాటేమిటి? నిజాయితీ ఉంటే, రియల్ ఎస్టేట్ వారికి నష్టం కలుగుతుంటే ఆ విషయాన్ని ధైర్యంగా చెప్పి ప్రభు త్వాన్ని పరిష్కారం కోరవచ్చు. అలా చేయకుండా రైతుల పేరుతో డ్రామాలు నడుపుతున్నారు. ఇన్‌సైడ్ ట్రేడింగ్ గురించి అందరికీ తెలిసినా, అసలు ఏమీ జరగనట్లు నటిస్తున్నారు. వేల ఎకరాల భూములు ఎలా చేతులు మారాయో తెలియదా? ఇలాంటి వాటికి హరగోపాల్, కోదండరామ్, గోపాలగౌడ వంటివారు మద్దతు ఇవ్వ డమా? హవ్వ! ఇదేనేమో కాలమహిమ!
-కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment