సాక్షి, కాకినాడ : చీకటి పడినంత మాత్రాన గోదావరి తన నడక ఆపబోదు. మబ్బులు కమ్ముకున్నంత మాత్రాన సూర్యుడు జ్వలించక మానడు. తెలుగుజాతిని నిలువునా చీల్చే ప్రక్రియను కేంద్రం కొనసాగిస్తూనే ఉన్నా.. ‘సమైక్యత ఒక్కటే తెలుగుజాతి శ్రేయస్సుకూ, యశస్సుకూ, ఉషస్సుకూ శ్రీరామరక్ష’ అన్న ప్రగాఢ విశ్వాసంతో జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో సమైక్యాంధ్ర పరిరక్షణ పోరు మొక్కవోని సంకల్పంతో, మడమ తిప్పని స్థైర్యంతో సాగుతూనే ఉంది. రాష్ర్ట విభజన బిల్లును శాసనసభకు పంపిన తీరును నిరసిస్తూ ఆయన ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ శ్రేణులు, సమైక్యవాదులు జిల్లావ్యాప్తంగా చేపట్టిన సమైక్యదీక్షలు బుధవారం రెండో రోజుకు చేరుకున్నాయి.
పార్టీ శ్రేణులు దీక్షలు కొనసాగిస్తూనే మానవహారాలు, రాస్తారోకోలు, ‘గడపగడపకూ వైఎస్సార్ సీపీ సమైక్య నినాదం’ పాదయాత్రలు కొనసాగించారు.రాజమండ్రి రూరల్ మండలం కొంతమూరు, కడియంలలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలను రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ప్రారంభించారు. పి.గన్నవరం కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో మామిడికుదురులో పార్టీ కార్యకర్తలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. రైతు విభాగం రాష్ట కమిటీ సభ్యుడు జక్కంపూడి తాతాజీ దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. తునిలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట పార్టీ కోఆర్డినేటర్ దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు రిలే దీక్షలు చేపట్టారు.
అనపర్తి దేవీచౌక్‌లోని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలను నియోజకవర్గ కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ప్రారంభించారు. తొలుత వందలాది మంది పార్టీ శ్రేణులు సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు సత్తి వీర్రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ యూత్ సభ్యులు తాడి సూరారెడ్డి, కర్రి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెద్దాపురంలో పట్టణ కన్వీనర్ పేర్నీడి ఈశ్వరరావు, సామర్లకోటలో పట్టణ కన్వీనర్ గుణ్ణం రాజబ్బాయిల ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి. పిఠాపురం రామా టాకీస్ సెంటర్‌లో రెండవ రోజు దీక్షలో కొత్తపల్లికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు కూర్చున్నారు. మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆదేశాల మేరకు ఏలేశ్వరంలో రెండవ రోజు దీక్షలో ఉత్తరకంచి, రౌతుపాలెం గ్రామాలకు చెందిన పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
ఆజాద్‌చౌక్‌లో మానవహారం..
రాజమండ్రి ఆజాద్‌చౌక్‌లో నగర నియోజకవర్గ కో ఆర్డినేటర్ బొమ్మన రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. సమైక్య నినాదాలతో చౌక్ దద్దరిల్లింది. ఈ కార్యక్రమంలో పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ర్ట కార్యదర్శి టీకే విశ్వేశ్వరరెడ్డి, సేవాదళ్ రాష్ర్ట కార్యదర్శి సుంకర చిన్ని తదితరులు పాల్గొన్నారు. కో ఆర్డినేటర్ గుత్తుల సాయి ఆధ్వర్యంలో ముమ్మిడివరంలోని పార్టీ కార్యాలయం ఎదుట 216 జాతీయ రహదారిపై పార్టీ శ్రేణులు మానవహారంగా ఏర్పడి రాస్తారోకో చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. కోరుకొండ మండలం మునగాల గ్రామంలో పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ‘గడపగడపకూ వైఎస్సార్ సీపీ సమైక్య నినాదం’ పాదయాత్ర నిర్వహించారు. రాజమండ్రి రూరల్ మండలం హుకుంపేటలో కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో ‘గడపగడపకూ వైఎస్సార్ సీపీ సమైక్య నినాదం’ పాదయాత్ర జరిగింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన ఆవశ్యకతను, సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ సీపీ చేస్తున్న పోరాటాన్ని వివరించే కరపత్రాలను ప్రజలకు పంచారు.
మడమ తిప్పని సమరం
Published Thu, Jan 9 2014 2:21 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
Advertisement
Advertisement