ఇద్దరికి గాయాలు
అమలాపురంలో బెడిసికొట్టిన రింగ్
అమలాపురం టౌన్ : తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో కాంట్రాక్టర్ల మధ్య తలెత్తిన ఘర్షణతో కొట్లాటకు దిగారు. కుర్చీలు విసురుకుని... పిడిగుద్దులతో బాహాబాహీకి దిగడంతో కార్యాలయ ఆవరణ మంగళవారం సాయంత్రం ఉద్రిక్తంగా మారింది. పాత ఇనుము వేలం పాట సందర్భంగా రాష్ట్రంలో వివిధ జిల్లాలకు చెందిన కాంట్రాక్టర్ల సమక్షంలో కొందరు కాంట్రాక్టర్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో ఎదురుగా ఉన్న పట్టణ పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. ఈ కొట్లాటలో ఇద్దరు కాంట్రాక్టర్లు గాయపడి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు.
మున్సిపల్ కార్యాలయ ఆవరణలో పూర్తిగా పాడై మూలన పడ్డ తొట్టె ఆటో, ట్రాక్టరు, వాటర్ ట్యాంకర్, ఇతర పాత ఇనప సామగ్రికి వేలం పాట నిర్వహిస్తున్నట్టు మున్సిపల్ అధికారులు పత్రికల్లో నోటిఫికేషన్ ప్రచురించారు. మున్సిపాలిటీలో దాదాపు 20 టన్నులకు పైగా ఉన్న ఆ పాత ఇనుప సామగ్రికి ఇంజనీరింగ్ అధికారులు మంగళవారం సాయంత్రం కార్యాలయ ఆవరణలో వేలంపాట నిర్వహించారు. ఈ పాటలకు గుంటూరు జిల్లాతో పాటు ఉభయ గోదావరి జిల్లాల నుంచి దాదాపు 70 మంది కాంట్రాక్టర్లు హాజరయ్యారు. మున్సిపాలిటీ కిలో పాత ఇనుము ధర రూ.13 కనీస ధరగా ప్రకటించి వేలం మొదలు పెట్టింది. అప్పటికే కొందరు కాంట్రాక్టర్లు రింగై కిలో ఇనుము ధర రూ. 6 నుంచి మొదలు పెట్టాలని పట్టుపట్టారు. దానికి అధికారులు ససేమిరా అన్నారు. దీంతో వేలం పాటలో సిండికేట్ కావడం ద్వారా మొత్తం ఇనుమును తక్కువ ధరకే దక్కించుకునేలా పథకం పన్నారు. ఇంతలో ఒక కాంట్రాక్టరు కిలో ఇనుము రూ.11కే పాట పాడేందుకు ముందుకు వచ్చారు. ఈ పరిణామం అప్పటికే రింగైన కాంట్రాక్టర్లకు చిర్రెత్తింది. రింగ్‌ను కాదని ఒప్పందంలో లేని ధరతో పాట పాడటాన్ని రింగ్‌దారులు జీర్జించుకోలేక ఘర్షణకు దిగారు. అక్కడే కుర్చీని విసిరడంతో అమలాపురానికి చెందిన ఓ కాంట్రాక్టరు చేతికి గాయమైంది. పిడిగుద్దులు, తోపులాటతో కొట్టాటకు దిగటంతో ఘర్షణ వాతారణం చోటుచేసుకుంది. మరో కాంట్రాక్టర్‌కు వీపునకు గాయమైంది. ఇంతలో అమలాపురానికి చెందిన కొందరు కాంట్రాక్టర్లు మా ఊరు వచ్చి...మా మున్సిపాలిటీకి వచ్చి మాపైనే దాడులకు దిగుతారంటూ వారూ వీరంగం చేశారు.
రాజమహేంద్రవరానికి చెందిన ఇద్దరు కాంట్రాక్టరు మద్యం సేవించి తమపై దాడి చేశారని... ఇద్దరు గాయపడ్డారని అమలాపురానికి చెందిన కాంట్రాక్టర్ల తరపున కాంట్రాక్టర్ అల్లాడి రమణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే రాజమహేంద్రవరానికి చెందిన కాంట్రాక్టర్లు తమపై అమలాపురం కాంట్రాక్టర్లు దాడి చేశారంటూ వారూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణ సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ మున్సిపల్ కార్యాలయ ఆవరణను సందర్శించి కాంట్రాక్టర్లను విచారించారు. కమిషనర్ సీహెచ్.శ్రీనివాస్, డీఈఈ ప్రసాద్‌తో కాంట్రాక్టర్ల వివాదం గురించి ఆరా తీశారు. మున్సిపల్ డీఈఈ ప్రసాద్ మాట్లాడుతూ కార్యాలయ ఆవరణలో కాంట్రాక్టర్లు గొడవ పడ్డారని. .. అది తమ కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు.