సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్–2 పరీక్షల్లో జరిగిన అక్రమాలపై తాము చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని గ్రూప్–2 పరీక్ష రాసిన అభ్యర్థులు కోరారు. అక్రమాల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఎంతమాత్రం స్పందించడం లేదని వారు ఆవేదన వెలిబుచ్చారు. గ్రూప్–2 అభ్యర్థులు వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం లోటస్‌పాండ్‌లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను కలసి వినతిపత్రాన్ని అందజేశారు. ప్రిలిమినరీ పరీక్షకు 5 లక్షల మంది హాజరవ్వగా.. వారిలో మెయిన్స్‌కు 49,100 మంది ఎంపికయ్యారని, వీరికి ఆన్‌లైన్ ద్వారా జూలై 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు.
అయితే పరీక్ష పత్రం లీకయినట్టు పరీక్ష జరిగిన మూడు రోజులకు సామాజిక మాథ్యమాల్లో వార్తలు రావడం తమను ఆందోళనకు గురిచేస్తోందని, ప్రముఖ దినపత్రికలో స్క్రీన్ షాట్ కూడా రావడంతో తాము అయోమయంలో పడ్డామని జగన్ దృష్టికి తెచ్చారు. ఈ విషయాన్ని ఏపీపీఎస్సీ దృష్టికి తీసుకెళ్లామని, రాష్ట్ర వ్యాప్తంగా 172 సెంటర్లలో మాస్ కాపీయింగ్ జరిగినట్టు వేల సంఖ్యలో ఫిర్యాదులొచ్చినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విధిలేని పరిస్థితుల్లో ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాల్సి వచ్చిందని, తదుపరి నియామక ప్రక్రియను నిలిపివేయాలని ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. తాము చేస్తున్న పోరాటానికి చేయూత నివ్వాలని అభ్యర్థులు కోరారు. దీనికి జగన్ సానుకూలంగా స్పందించారని, ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారని వారు తెలిపారు. జగన్‌ను కలిసిన వారిలో వైఎస్సార్ సీపీ అనుబంధ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.సలామ్‌బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాంతారావు తదితరులున్నారు.
Published Sat, Sep 30 2017 1:54 AM | Last Updated on Wed, Jul 25 2018 4:50 PM
Advertisement
Advertisement