వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నేత సలాంబాబు, విద్యార్థి నాయకులను అరెస్టు చేస్తున్న పోలీసులు
విజయవాడ సిటీ: రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులపై మరోసారి ఉక్కుపాదం మోపింది. నిరుద్యోగుల డిమాండ్లను కూడా వినకుండానే వారి గొంతును నొక్కేసింది. ఉద్యోగాలు భర్తీ చేయాలని ఏపీపీఎస్సీ అధికారులను డిమాండ్ చేయడానికి వెళ్తున్న వైఎస్సార్ విద్యార్థి విభాగం నేతలను, నిరుద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే అణచివేసింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.12 లక్షల పోస్టులకు వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాంబాబు, కృష్ణా జిల్లా అధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (ఏపీపీఎస్సీ) కార్యాలయం వద్ద శుక్రవారం నిరుద్యోగ యువతతో కలసి ధర్నా చేసి నిరసన తెలపాలని నిర్ణయించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా బందరురోడ్డులోని ఏపీపీఎస్సీ కార్యాలయానికి వెళ్తున్న క్రమంలో విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద నుంచి బయటకు రాకుండా నిలువరించారు. దీంతో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. వెంటనే పోలీసులు వారిని అరెస్ట్ చేసి నగరానికి 40 కి.మీ దూరంలోని ఉంగుటూరు పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ సమయంలో ప్రభుత్వంపై నిరుద్యోగులు, విద్యార్థి నాయకులు ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘నిరుద్యోగులను నట్టేట ముంచిన చంద్రబాబు డౌన్ డౌన్. నాలుగేళ్లుగా నిరుద్యోగ భృతి ఇవ్వని సీఎం డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. సలాంబాబు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం అప్పటి ఔట్‌సోర్సింగ్/కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు.
ఇప్పటి వరకు తొలిగించిన ఔట్ సోర్సింగ్/కాంట్రాక్టు ఉద్యోగులకు న్యాయం చేయాలన్నారు. గ్రూపు–2ని గ్రూపు–1లోకి విలీనం చేయాలనే ప్రతిపాదనను విరమించుకోవాలన్నారు. జిల్లా అ«ధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో కమల్‌నాథన్ కమిషన్ నివేదిక మేరకు 1.42 లక్షల పోస్టులు ఉంటే చంద్రబాబు ప్రభుత్వం వాటిని 77,737కి కుదించడం దారుణమన్నారు. అందులోనూ కేవలం 20 వేల పోస్టులు మాత్రమే రెగ్యులర్, మిగిలినవన్నీ ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేస్తామని చెప్పి చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగులను తీవ్రంగా వంచించిందని మండిపడ్డారు. అరెస్టు చేసిన విద్యార్థులను రాత్రి ఎనిమిది గంటల సమయంలో వ్యక్తిగత పూచీకత్తుపై విడిచిపెట్టారు. నిరసన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు తాళ్లూరి రాజేష్, ప్రధాన కార్యదర్శులు అర్జున్, శ్యామ్, నాగిరెడ్డి, పవన్, ప్రతాప్, అశోక్, సాయి, గణేష్, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment