ఉద్యోగాల భర్తీకి రెడీ.. ఏపీపీఎస్సీ ద్వారా 3,946 పోస్టులు భర్తీ  | 3946 posts replaced by APPSC in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఉద్యోగాల భర్తీకి రెడీ.. ఏపీపీఎస్సీ ద్వారా 3,946 పోస్టులు భర్తీ 

Published Thu, Feb 10 2022 3:19 AM | Last Updated on Thu, Feb 10 2022 5:07 PM

3946 posts replaced by APPSC in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరుస్తూ అందుబాటులో ఉన్న అన్ని ఖాళీ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రధానంగా గ్రూప్‌–1, గ్రూప్‌–2 పోస్టులను సాధ్యమైనంత ఎక్కువగా భర్తీ చేసేలా కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేసిన పోస్టులకు సంబంధించి ఏపీపీఎస్సీ ద్వారా త్వరగా పరీక్షలు నిర్వహించి నియామకాలు పూర్తి చేయనున్నారు. మరిన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలకూ ఏపీపీఎస్సీ సన్నాహాలు ప్రారంభించింది. 

6 లక్షలకుపైగా పోస్టుల భర్తీతో సరికొత్త చరిత్ర
దేశ చరిత్రలో ఎక్కడా, ఏ ప్రభుత్వమూ చేయని రీతిలో సీఎం జగన్‌ నిరుద్యోగ అభ్యర్థులకు మేలు చేకూరుస్తున్నారు. రెగ్యులర్‌ పోస్టులతో పాటు కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ తదితర మార్గాల్లో యువతకు ప్రయోజనం కల్పిస్తున్నారు. 2019 నుంచి ఇప్పటివరకు మొత్తం 6,03,756 పోస్టులను భర్తీ చేశారు. ఇందులో రెగ్యులర్‌ పోస్టులు 1,84,264 ఉండగా కాంట్రాక్టు పోస్టులు 19,701, అవుట్‌ సోర్సింగ్‌ పోస్టులు 3,99,791 ఉన్నాయి. వీటిలో ప్రధానంగా సచివాలయ వ్యవస్థ ద్వారా 1,21,518 మందికి ఉద్యోగాలు కల్పించడం గమనార్హం.

నాడు నోటిఫికేషన్లతో సరి.. నేడు పోస్టులన్నీ భర్తీ
గత సర్కారు హయాంలో ఎన్నికల ముందు వరకు పట్టించుకోకుండా ఆరు నెలల ముందు 2018 చివరిలో హడావుడిగా నోటిఫికేషన్లు జారీ చేశారు. కేవలం యువతను మభ్యపెట్టేలా నోటిఫికేషన్లు ఇవ్వడమే కానీ పోస్టులు భర్తీ చేయలేదు. కొన్ని న్యాయవివాదాలతో నిలిచిపోయాయి. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొత్తం 3,946 పోస్టులకు సంబంధించిన న్యాయ వివాదాలను పరిష్కరించేందుకు  చర్యలు తీసుకుంది. రెండున్నరేళ్లలో దాదాపు రెండేళ్లు కరోనాతో ఇబ్బందులు ఎదురైనా పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించి మొత్తం పోస్టులు భర్తీ చేసింది.

కొత్తగా 1,237 పోస్టులకు నోటిఫికేషన్లు 
వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం కొత్తగా 1,237 పోస్టులకు నోటిఫికేషన్లు జారీచేయడంతో పాటు పరీక్షల నిర్వహణకు ఏపీపీఎస్సీ ద్వారా ఏర్పాట్లు చేసింది. ఇవేకాకుండా త్వరలో మరో 458 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేయనుంది. వీటిలో గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 పోస్టుల సంఖ్య తక్కువగా ఉండడంతో వాటి సంఖ్యను పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల మేరకు గ్రూప్‌ 1లో 31, గ్రూప్‌ 2 సర్వీస్‌లో 30 పోస్టులను గుర్తించారు. ఈ సంఖ్య మరింత పెరగనుంది.

వైద్యశాఖలో 39 వేల పోస్టుల భర్తీ
వైద్య ఆరోగ్య శాఖలో డాక్టర్లు, ఇతర సిబ్బంది నియామకానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. ఇప్పటికే 27 వేల మంది నియామకాలు పూర్తి కాగా మొత్తం 39 వేల 
పోస్టులు భర్తీ చేయనున్నారు. జిల్లా బోధనాసుపత్రినుంచి విలేజ్‌ క్లినిక్‌ వరకు అన్ని చోట్లా పూర్తిస్థాయిలో సిబ్బంది ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

2 వేల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ
రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల్లో 2 వేల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వ హయాంలో 1,110 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చి ఏపీపీఎస్సీ ద్వారా ప్రిలిమ్స్‌ పరీక్షలు నిర్వహించినా న్యాయవివాదాలతో ప్రక్రియ నిలిచిపోయింది. రేషనలైజేషన్‌ పేరుతో పోస్టులను టీడీపీ నేతలు ఇష్టానుసారంగా మార్చేశారు.

వీటన్నిటినీ సరిదిద్దడంతో పాటు పోస్టుల సంఖ్యను 2 వేలకు పెంచి న్యాయవివాదాలకు తావులేని విధంగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉన్నత విద్యామండలి ద్వారా చర్యలు చేపట్టింది. న్యాయవివాదాలను పరిష్కరించి త్వరలోనే ప్రకటన విడుదల చేయనున్నారు. 10,143 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గతంలో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేశారు. అయితే నిరుద్యోగులకు మేలు చేస్తూ పోస్టుల సంఖ్య మరింత పెరిగేలా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 పోస్టుల సంఖ్యను పెంచడంతో పాటు పోలీసు విభాగంలో ఏటా 6,500 పోస్టుల భర్తీకి ఇటీవల పోలీసు విభాగానికి ఆదేశాలు జారీ చేశారు.

డీఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్ధులకు న్యాయం
ఎన్నికలకు ముందు గత సర్కారు నోటిఫికేషన్‌ ఇచ్చి చేతులు దులుపుకొన్న 2018 డీఎస్సీకి సంబంధించి వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే పూర్తి చేసి వారందరికీ ఉద్యోగాలు కల్పించింది. మొత్తం 7,902 మందికి ఇలా ఉద్యోగాలు వచ్చాయి. ఇదే కాకుండా దశాబ్దాల తరబడి కోర్టుల చుట్టూ తిరిగి అలసిపోయిన 2008 డీఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్ధులకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి న్యాయం చేశారు. ఆ డీఎస్సీలో 2,192 మందికి ఉద్యోగాలు కల్పించి మినిమం టైమ్‌స్కేలును అమలు చేస్తున్నారు. అలాగే కేజీబీవీల్లో 958 పోస్టులను, మోడల్‌ స్కూళ్లలో 164 టీచింగ్‌ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement