అభివృద్ధికి సహకరించండి
అపాచీ జీఎంను కోరిన ఎమ్మెల్యే కిలివేటి
తడ: సామాజిక కార్యక్రమాల్లో భాగంగా ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మాంబట్టులోని పరిశ్రమల ప్రతినిధులను సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కోరారు. శనివారం ఆయన మాంబట్టులోని అపాచీ కంపెనీ జీఎం ఆండ్రూ ఫిలిప్‌చెన్‌తో భేటీ అయ్యారు. నియోజకవర్గ పరిధిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. సూళ్లూరుపేట ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో అధ్వాన స్థితిలో ఉన్న మార్చురీ గది స్థానంలో నూతన భవనం చేపట్టాలన్నారు.
మృతదేహాలను భద్రపరిచేందుకు ఫ్రీజర్లు సమకూర్చాలని కోరారు. రోగుల కోసం ఆస్పత్రిలో కొన్ని పడకలను కూడా సమకూర్చాలని ప్రతిపాదించారు. అపాచీ జీఎం స్పందిస్తూ ఈ ప్రతిపాదనలను తమ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వసతుల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్మికుల కోసం ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణం కోసం ప్రయత్నించాలని సూచించారు. ఈ విషయాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, ఆస్పత్రి నిర్మాణానికి నిధులు త్వరగా మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటానని కిలివేటి చెప్పారు.
ఇరకందీవి వాసుల కోసం కలెక్టర్ శ్రీకాంత్ ఇటీవల మంజూరు చేసిన రెండు బోట్లకు మోటార్లు ఏర్పాటు కోసం రూ.1.25 లక్షలకు ప్రతిపాదనలు పంపాలని అపాచీ కంపెనీ ప్రతినిధులు సూచించారన్నారు. అనపగుంట మార్గంలోని కస్తూరిబా విద్యాలయంలో 25 లైట్లు, 25 ఫ్యాన్లు పనిచేసేలా ఇన్వర్టర్ ఏర్పాటు చేసేందుకు కూడా అపాచీ ముందుకొచ్చిందని ఎమ్మెల్యే కిలివేటి వెల్లడించారు.
ఇన్వర్టర్‌కు సోలార్ అనుసంధానం చేసేందుకు అవసరమైన ప్యానళ్లను అందించేందుకు తడకు చెందిన ఓ దాత ముందుకొచ్చారని వివరించారు. ఈ సమావేశంలో ఆపాచీ పీఆర్‌ఓ సుధీర్, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు మారంరెడ్డి వెంకటకృష్ణారెడ్డి, నాయకులు గండవరం సురేష్‌రెడ్డి, తిరుమూరు రవిరెడ్డి, కామిరెడ్డి నందారెడ్డి, కోట నరేంద్రరెడ్డి, గండవరం జగదీష్‌రెడ్డి, సీహెచ్ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.