సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీగా జరుగుతున్న నిర్మాణాలకు అవసరమైన సిమెంట్‌ను నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా అందించాలని సిమెంట్ కంపెనీలకు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేశ్ సూచించారు. ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ప్రభుత్వానికి తగిన సహకారం అందించాలని కోరారు. మంగళవారం సిమెంట్ కంపెనీల ప్రతినిధులతో మంత్రులిద్దరూ సమావేశమయ్యారు. నిర్దేశించిన మొత్తంలో 30 శాతం సిమెంట్ కూడా కొన్ని కంపెనీలు అందించలేకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.
పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా సీఎం జగన్ లక్షలాది మందికి ఇళ్ల స్థలాలిచ్చారని, మొదటి దశలో దాదాపు 16 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోందని వివరించారు. ప్రతి గ్రామంలోనూ సచివాలయాలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, బల్క్ మిల్క్ సెంటర్లు, డిజిటల్ లైబ్రరీలు సహా ప్రభుత్వ విభాగాలకు పక్కా భవనాల నిర్మాణం చేపట్టామన్నారు. నాడు–నేడు కింద స్కూళ్లు, ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. వీటన్నింటినీ వేగంగా పూర్తి చేసేందుకు సహకారం అందించాలని సూచించారు.
ఏమైనా సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సిమెంట్ కంపెనీల ప్రతినిధులకు సూచించారు. వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. సిమెంట్ కంపెనీల ప్రతినిధులు స్పందిస్తూ.. నిర్దిష్ట కాలవ్యవధిలో సిమెంట్ సరఫరాను పెంచుతామని హామీ ఇచ్చారు. సమావేశంలో గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, గృహ నిర్మాణ సంస్థ ఎండీ నారాయణ్ భరత్ గుప్తా, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన, గనుల శాఖ సంచాలకుడు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు
నిర్దేశిత లక్ష్యం మేరకు సిమెంట్ అందించండి
Published Wed, Apr 20 2022 4:04 AM | Last Updated on Wed, Apr 20 2022 4:04 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment