సాక్షి, కాకినాడ : ‘గ్యాస్’ బండ సామాన్యులకే కాదు..చిన్నారులకు పౌష్టికాహారం అందించే అంగన్‌వాడీ కేంద్రాలకు సైతం గుదిబండగా తయారైంది. అస్తవ్యస్తంగా తయారైన ఆధార్ అనుసంధాన ప్రక్రియతో ఇప్పటికే సామాన్యులు నరకం చూస్తుంటే ఇప్పుడు ఆ వరసలో అంగన్‌వాడీ కేంద్రాలూ చేరాయి. అంతేకాదు.. కేంద్రాలకు సరఫరా చేసే గ్యాస్‌కు సబ్సిడీ లేకపోవడంతో మార్కెట్ రేటే చెల్లించక తప్పదు.
జిల్లాలో మధ్యాహ్న భోజనం అమలవుతున్న అంగన్‌వాడీ కేంద్రాలకు రాష్ర్ట ప్రభుత్వం కొత్తగా 890 గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసింది. కట్టెల పొయ్యిలతో ఇక్కట్ల పాలవుతున్నప్పటికీ గ్యాస్ కనెక్షన్లు తీసుకునేందుకు అంగన్‌వాడీ కార్యకర్తలు ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. జిల్లాలో 24 ప్రాజెక్టుల పరిధిలో 5,300 కేంద్రాలున్నాయి. ఒక్కో కేంద్రంలో 30 మంది చిన్నారులు, 20 మంది వరకు గర్భిణులు, బాలింతలుంటారు.
గర్భిణులు, బాలింతలకు ప్రతి నెలా మూడు కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, అరకిలో నూనె సరఫరా చేస్తారు. ప్రతి చిన్నారికీ రోజుకు 75 గ్రాముల బియ్యం, 15 గ్రాముల పప్పు, 5 గ్రాముల ఆయిల్ సరఫరా చేస్తారు. వారానికి నాలుగు గుడ్లు ఇస్తారు. పప్పులో కలుపు కూర వేసేందుకు ఒక్కో చిన్నారికి 20 పైసల చొప్పున చెల్లిస్తారు. వీటిని వండేందుకు పుల్లల ఖర్చు కింద గతంలో రూ.150 ఇచ్చే వారు. ప్రస్తుతం రూ.210 చెల్లిస్తున్నారు.
బండరేటు రూ.1100.. ఇచ్చేది రూ.210
నవంబర్ ఒకటి నుంచి పాఠశాలల మాదిరిగానే ఈ కేంద్రాలు కూడా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటలవరకు పనిచేసేలా వేళలను మార్చారు. అలాగే ఈ కేంద్రాలకు కూడా మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నారు. గతంలో 17 ప్రాజెక్టులు మాత్రమే ఉండేవి. వీటి పరిధిలో ఉండే కేంద్రాలకు నెలనెలా పుల్లల ఖర్చు ఇచ్చేవారు. 2002లో మంజూరైన కొత్త కేంద్రాలకు అప్పట్లో గ్యాస్‌కనెక్షన్లు మంజూరు చేశారు. 2006లో ‘రెడీ టు ఈట్ స్కీమ్’ రావడంతో మొత్తం కేంద్రాలకు గ్యాస్ సరఫరాను నిలిపివేశారు. మళ్లీ 2010లో మూడవ వంతు కేంద్రాలకు గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశారు. ఈలోగా ఆధార్ అనుసంధానం అమలులోకి రావడంతో అంగన్‌వాడీ కార్యకర్తలు తమ ఆధార్‌నే ఈ కనెక్షన్లకు అనుసంధానం చేశారు.
దీంతో వ్యక్తిగతంగా వారి పేరిట ఉండే గ్యాస్ కనెక్షన్లు పూర్తిగా లాక్ అయ్యాయి. కేంద్రాల్లో ఉన్న కనెక్షన్లకు తమ ఆధార్ నంబర్‌తో అనుసంధానించడం వలన ప్రస్తుతం ఇంట్లో కనెక్షన్ లేక ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడిందని అంగన్‌వాడీలు ఐసీడీఎస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేక పోయింది. ఇటీవల అమలు లోకి వచ్చిన మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ వారికి భారంగా తయారైంది. బయట కట్టెల పొయ్యిలపై వండించి కేంద్రాలకు తీసుకొచ్చి చిన్నారులకు పెడుతున్నారు. ఈ తరుణంలో మంజూరైన గ్యాస్ కనెక్షన్లు వీరికి కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. నాన్‌సబ్సిడీ కోటాలో ఇస్తున్న ఈ గ్యాస్ సిలిండర్‌కు మార్కెట్ రేటు ప్రకారం రూ.1100 పైగా చెల్లించాల్సి వస్తుంది.
కానీరూ.210 మాత్రమే పుల్లల ఖర్చు కింద చెల్లిస్తామని, మిగిలిన మొత్తాన్ని అంగన్‌వాడీ కార్యకర్తలే భరించాలని ప్రభుత్వం అంటోంది. దీనికితోడు ఆధార్ నంబర్ లేకుండా ఈ కనెక్షన్ మంజూరు చేసే పరిస్థితి లేదు. ఎవరి ఆధార్ నంబర్ ఇవ్వాలో తెలియని అయోమయ పరిస్థితిలో అంగన్‌వాడీ కార్యకర్తలున్నారు. ఎలా చూసినా గ్యాస్ కనెక్షన్ గుదిబండగానే తయారైంది. దాంతో అంగన్‌వాడీ కార్యకర్తలు మాకొద్దీ కనెక్షన్లంటూ మొర పెట్టుకుంటున్నారు. అలా కాకపోతే.. ఆధార్‌తో లింకు పెట్టకుండా సబ్సిడీ ధరకే తమ కేంద్రాలకు గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ బండకో దండం!
Published Mon, Dec 30 2013 12:51 AM | Last Updated on Sat, Jun 2 2018 8:36 PM
Advertisement
Advertisement