విజయనగరం మున్సిపాలిటీ: వేసవి వచ్చేసింది. వాతావరణం రోజు రోజుకు వేడెక్కుతోంది. ఉష్ణోగ్రతలు 35–40 డిగ్రీల మార్కు మధ్య ఊగిసలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక వ్యాధులు ఉండి ఔషధాలు వాడుతున్నవారు, శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు, కార్మికులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
అటువంటి వాటితో ముప్పు
♦ ఆస్తమా, బ్రాంకైటీస్, ఇస్నోఫీలియా బాధితులు అప్రమత్తంగా ఉండాలి. బాగా చల్లని పదా ర్థాలు తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లోకి గాలిని తీసుకుపోయే ట్యూబ్‌లు పూర్తిగా మూసుకుపోయి శ్వాస తీసుకోవడం కష్టమవుతోంది. వీరు ఇంట్లో ఫ్రిజ్‌లో ఉన్న పదార్థాల జోలికి సైతం వెళ్లొద్దు.
♦ చిన్నపిల్లలు, వద్ధులు అదే పనిగా చల్లని ద్రవాలు, రోడ్డు పక్కన దొరికేవి తీసుకోవడం వల్ల బ్యాక్టీరియా, వైరస్ వ్యాధులకు కారణమవుతాయి. సరైన ఐస్‌ను ఉపయోగించకపోవడం ఒక కారణమైతే... వీటిని అమ్మే వారు శుభ్రత పాటించకపోవడం.. రోడ్లపై ఉండే దుమ్ము, ధూళి వీటిపై పడటం మరో కారణం.
♦ తొలుత గొంతు నొప్పితో సమస్య ప్రారంభమవుతుంది. తర్వాత గొంతు బొంగురుపోవడం, కఫం పట్టడం, దగ్గు, జలుబుతోపాటు తీవ్ర జ్వరం వస్తుంది. ఆస్తమా, అవయవ మార్పిడి చేయించుకున్నవారు.. కిడ్నీ, సుగర్, లివర్, సీవోపీడీ సమస్యలున్నవారిలో న్యూమెనియాకు దారి తీస్తుంది.
♦ చిన్నపిల్లల్లో దీర్ఘకాలిక దగ్గు, పొడిదగ్గు, ఆయాసం, కఫం పట్టడం, ఛాతి బిగుసుకుపోయి ఆస్తమా కింద మారుతుంది.
♦ ఏసీల ఫిల్టర్లను శుభ్రం చేసుకోవాలి.
దీర్ఘకాలిక రోగాలకు మందులువాడుతుంటే...
♦ అధిక రక్తపోటు, మధుమేహం, మానసిక సమస్యలకు వాడే మందుల కారణంగా చెమట తక్కువగా వస్తుంది. దీంతో శరీర ఉష్ణోగ్రతలో సమతుల్యత ఉండదు. ఫలితంగా ఎండలోకి వచ్చినప్పుడు త్వరగా వడదెబ్బ బారిన పడతారు.
♦ ఈ మందులు వాడే రోగులు వేసవిలో వైద్యులను సంప్రదించి డోసులు మార్చుకోవాలి. యూరిన్ ముదురు రంగులోకి మారితే శరీరంలో నీటి శాతం తగ్గినట్లు గుర్తించాలి. ఆ మేరకు భర్తీ చేస్తూ ఉండాలి.
♦ మధుమేహ వ్యాధిగ్రస్తులు తరచూ మూత్రానికి పోతుంటారు. దీంతో శరీరంలో సోడియం, పొటాషియం తగ్గిపోతుంటాయి. వేసవిలో ఇది మరింత ప్రమాదకరం. శరీరంలో నీరు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే వైద్యుల సలహా తీసుకోవాలి.
♦ అధిక రక్తపోటు ఉంటే ఉప్పు కలిపిన నీళ్లు అదే పనిగా తీసుకోవద్దు. శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు, యూరిన్ పసుపు పచ్చగా వచ్చినప్పుడు నీటిని తీసుకుంటూ ఉండాలి.
♦ వేసవిలో పిల్లల నుంచి పెద్దల వరకు నిద్ర అవసరం. పెద్దలు 6–7 గంటలు, పిల్లలు 9 గంటల పాటు నిద్రపోవాలి.
జాగ్రత్తగా ఉండాలి..
రోడ్ల పక్కన దొరికే నిమ్మరసం, ఐస్ క్రీమ్‌లు, పుచ్చకాయ ముక్కలు తీసుకునేముందు జాగ్రత్తలు తీసుకోవాలి. చల్లదనం కోసం చాలా మంది ఐస్ కలుపుతుంటారు. ఐస్ తయారీలో కంపెనీలు ప్రమాణాలు పాటించవు. స్వచ్ఛమైన నీటితో తయారుచేయవు.–పి. ఉదయ్‌కిరణ్, వైద్యులు, విజయనగరం
Comments
Please login to add a commentAdd a comment