
విభజనకు సహకరించండి: దేవీప్రసాద్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై ఏపీఎన్జీవోలు రెచ్చగొట్టేలా వ్యవహరించకుండా సుహృద్భావ వాతావరణంలో తెలంగాణ ఏర్పాటుకు సహకరించాలని టీఎన్జీవో రాష్ర్ట అధ్యక్షుడు దేవీప్రసాద్ విజ్ఞప్తిచేశారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే ఉద్యోగాల విభజన జరుగుతుందని, ఉద్యోగుల సర్తాసు, సీనియారిటీ ఇతర సమస్యలపై సీమాంధ్ర ఉద్యోగులకు ఇబ్బందులు క లుగకుండా చూడాల్సిన బాధ్యత టీఎన్జీవోలపై కూడా ఉందన్నారు. వచ్చే ఐదేళ్లలో ప్రస్తుతం ఉన్న 8 లక్షల ఉద్యోగులలో 5 లక్షల మంది రిటైరవుతారని, అప్పటి వరకు ఉమ్మడి రాజధానిలోనే పనిచేస్తారు కాబట్టి ఏ సమస్యా ఉండదన్నారు. దోమలగూడలో బుధవారం జరిగిన మీట్ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమానికి సరైన ప్రాతిపదికలేదని సీమాంధ్ర నాయకులు వ్యాఖ్యానించడాన్ని ఖండించారు.
తెలంగాణలో రూ.135 ఉన్న ఉద్యోగుల వేతనాన్ని మొదటి పీఆర్‌సీలోనే రూ.100కు తగ్గించిన చరిత్ర సమైక్యాంధ్రదని విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ, జైఆంధ్ర ఉద్యమాల సమయంలో పాలకులు సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్లే పరిస్థితి ఇంతవరకు వచ్చిందన్నారు. హైద రాబాద్ మనది అనండి కానీ, మాది అనే వెర్రి ప్రచారం తగదని హితవు చేశారు. తెలంగాణలో విద్యుత్ కొరతకు సీమాంధ్ర పాలకులే కారణమని విద్యుత్ ఇంజనీర్ల అసోసియేషన్ నాయకులు శివాజీ ఆరోపించారు. తెలంగాణలో 8 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్లాంట్లకు అనుమతి ఇవ్వాలని కోరితే ప్రభుత్వం స్పందించలేదన్నారు. లగడపాటి విద్యుత్ సంస్థలకు గ్యాస్ కేటాయించిన ప్రభుత్వం శంకర్‌పల్లి విద్యుత్ కేంద్రానికి కేటాయించకపోవడం తెలంగాణపై వివక్ష కాదా అని ప్రశ్నించారు.