నేను లాక్‌డౌన్ విధించిన నాటి నుంచి ఒక్క రోజు కూడా బయటకు వెళ్లలేదు. ఇంట్లోనే ఉంటున్నాను. మా ఇంటి పక్కన పిల్లలు వచ్చి ఆడుకుంటుంటారు. అంతేకానీ, ఎవరూ ఇంటికి కూడా రాలేదు. నాకు కరోనా పాజిటివ్ ఎలా వచ్చిందో అర్ధం కావడం లేదు అంటూ మాచవరం కారి్మకనగర్‌కు చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు వైద్యుల వద్ద వాపోయిన వైనం..
మేము లాక్‌డౌన్ విధించిన నాటి నుంచి బయటకు వెళ్లలేదు. కూరగాయల కోసం రైతు బజారుకి మాత్రమే వెళ్లాం. కానీ మాకు కరోనా సోకింది. ఎలా సోకిందో అంతుబట్టడం లేదంటూ కార్మికనగర్‌లోని ఓకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు వైద్య ఆరోగ్య సిబ్బంది వద్ద తమ ఆవేదన వ్యక్తం చేశారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): లాక్‌డౌన్ విధించిన నాటి నుంచి ఇంట్లోనే ఉన్నాం. బయటకు ఎక్కడి వెళ్లలేదు. మాకు కరోనా పాజిటివ్ ఎలా వచ్చిందో అర్ధం కావడం లేదంటూ ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్న పాటిజివ్ రోగులు వైద్యులతో చెబుతున్నట్లు తెలుస్తోంది. విజయవాడ నగరంలో ఒక్కసారిగా కేసులు పెరగడం, కాంటాక్ట్‌లు ఎవరో తెలియక పోవడంతో ప్రజలతో పాటు, వైద్య వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తం కాకుంటే నగరం అంతా కరోనా కోరల్లో చిక్కుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
లక్షణాలు గుర్తించే సరికే...
కరోనా వైరస్ ఒక వ్యక్తిలోకి ప్రవేశించిన ఐదు నుంచి పదిహేను రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం వంటి లక్షణాలు ఉంటాయి. కానీ ప్రస్తుతం నగరంలో నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో లక్షణాలు కనిపించని వారు ఉంటున్నారు. అలాంటి వారితోనే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా ఇంట్లో ఒకరికి పాజిటివ్ వచ్చినప్పుడు ఆ ఇంట్లో వారందరినీ తీసుకు వస్తే, వారిలో కొందరికి పాజిటివ్ వస్తుందని, కానీ లక్షణాలు ఉండటం లేదన్నారు. ఇలా ఒక్కో ఇంట్లో ముగ్గురు, నలుగురు కూడా ఉంటున్నారు. కరోనా పాజిటివ్ ఉన్న లక్షణాలు లేక పోవడంతో ఇతరులతో ఫ్రీగా తిరగడం వలన మరింత మందికి వ్యాప్తి చెందుతున్నట్లు చెపుతున్నారు.
జాగ్రత్తలు తప్పనిసరి
కరోనా నివారణకు ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుంది. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ, అధికారులు 24 గంటలు పనిచేస్తున్నారు ప్రజలు సైతం తగు జాగ్రత్తలు పాటించాలి. అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలి. వచ్చిన వారు కూడా మాస్క్ ధరించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం చేయాలి. కూరగాయలు కొనుగోలు చేసే సమయంలో కూడా భౌతిక దూరం పాటించాలి. ప్రభుత్వం చేపట్టే చర్యలతో పాటు, ప్రజలు సైతం అవగాహనతో మెలిగితేనే కరోనాను కట్టడి చేయగలం.
– డాక్టర్ డి.షాలినీదేవి, చీఫ్ మెడికల్ ఆఫీసర్, నగర పాలక సంస్థ, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment