సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రజల సహకారంతో ఈ విపత్తు నుంచి బయటపడతామని మంత్రుల బందం చైర్మన్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకష్ణ శ్రీనివాస్ (నాని) పేర్కొన్నారు. విజయవాడలోని రోడ్లు భవనాలశాఖ భవనంలో మంత్రులు బుగ్గన రాజేంధ్రనాథ్, బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, మోపిదేవి వెంకట రమణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, ఏపీఎంఐడీసీ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులతో కలసి కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై ఉన్నతాధికారులతో చర్చించారు. ముఖ్యమంత్రి జగన్ నిర్వహించిన ఉన్నత సమీక్షలోనూ మంత్రి ఆళ్ల నాని పాల్గొన్నారు. వేర్వేరు చోట్ల ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలివీ..
► కోవిడ్–19 నిర్ధారణ వ్యక్తులకు, అనుమానితులకు విడివిడిగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించాం. ఎక్కడైనా కరోనా సోకిన వ్యక్తులు, అనుమానితులను గుర్తిస్తే 104, 1092 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి.
► రాష్ట్రంలో 161 కరోనా పాజిటివ్ కేసులు (శుక్రవారం ఉదయం బులిటెన్ ప్రకారం) నమోదు కాగా వీరిలో 140 మంది ఢిల్లీ వెళ్లి వచ్చినవారే ఉన్నారు.
► వలస కూలీల కోసం క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదని, నాణ్యమైన భోజనం, వసతి కల్పించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.
► క్వారంటైన్, ఐసోలేషన్ కేంద్రాల వద్ద సమస్యలు పరిష్కరించి మౌలిక వసతులు కల్పించాలని సీఎం సూచించారు.
► లాక్‌డౌన్‌తో చిక్కుకుపోయిన ఉద్యోగులకు ఆయా సంస్థలు వసతులు కల్పించాలని, లేనిపక్షంలో ప్రభుత్వమే సదుపాయాలు కల్పించాలని సీఎం ఆదేశించారు.
► ఇతర ప్రాంతాల్లో ఉన్నవారికే అక్కడే రేషన్ అందిస్తాం. దుకాణాల వద్ద శాశ్వత మార్కింగ్‌లు ఏర్పాటు చేస్తాం. రేషన్ కార్డు ఉన్న వారికి, దరఖాస్తు చేసుకుని మంజూరైన వారికి కూడా రూ.వెయ్యి చొప్పున ఆర్థిక సాయం అందించాలని సీఎం ఆదేశించారు.
► రాష్ట్రంలో మొదటి మూడు రోజులు రేషన్ షాపుల వద్ద రద్దీ నెలకొంది. ప్రస్తుతం రద్దీ తగ్గింది.
► అరటిని గ్రామీణ ప్రాంతాల్లో విక్రయించేందుకు సెర్ప్ సహకారం తీసుకుంటాం.
► మంత్రుల బందం నిర్వహించిన సమావేశంలో ఉన్నతాధికారులు పూనం మాలకొండయ్య, పీవీ రమేష్, కేఎస్ జవహర్‌రెడ్డి, సతీష్‌చంద్ర, గిరిజాశంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఆక్వాను ఆదుకుంటాం : మత్స్యశాఖ మంత్రి మోపిదేవి
► కరోనాతో ఆక్వా రంగానికి ఇబ్బందులున్నాయి. ప్రాసెసింగ్ యూనిట్లకు కూలీలు రాలేని పరిస్థితి నెలకొంది. ఆక్వా రంగం దెబ్బతింటున్నందున ప్రజలు కట్టుబాట్లను కొంత సడలించుకోవాలి. మధ్యాహ్నం 1 గంట వరకు వ్యవసాయ కూలీలను గ్రామ పెద్దలు పనులకు అనుమతించాలి.
► ఆక్వా రైతులకు నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. చైనాకు ఎగుమతులు ప్రారంభమయ్యాయి. అమెరికా సహా ఇతర దేశాలు ఆక్వా ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు సంసిద్ధ్దత వ్యక్తం చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment