సాక్షి, తిరుమల: కరోనా లాక్‌డౌన్ తిరుమల తిరుపతి దేవస్థానంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నెల రోజులుగా శ్రీవారి దర్శనం నిలిపివేయడంతో దాదాపు రూ.300 కోట్లకు పైగా ఆదాయం కోల్పోయింది. దీంతో 2020–21వ సంవత్సర బడ్జెట్ అంచనాలు తల్లకిందులవుతాయని టీటీడీ ఆర్థిక విభాగం అధికారులు ఆందోళన చెందుతున్నారు. గత నెల 19వ తేదీ నుంచి టీటీడీ ఘాట్ రోడ్లను మూసివేయడంతో పాటు 20వ తేదీ మధ్యాహ్నం నుంచి శ్రీవారి దర్శనానికి భక్తులను నిలిపివేయడం విదితమే. ప్రధానంగా వివిధ ఆర్జితసేవా టిక్కెట్లు, ప్రసాదాలు, వసతి గదుల కేటాయింపు ద్వారా వచ్చే ఆదాయాన్ని టీటీడీ కోల్పోయింది. (పుణ్యక్షేత్రాలకు కరోనా ఎఫెక్టు)
అలాగే తలనీలాల ద్వారా వచ్చే ఆదాయం, దుకాణాలు, హోటళ్ల ద్వారా వచ్చే బాడుగల రాబడులు కూడా ఆగిపోయాయి. టీటీడీ ఆదాయ వనరుల్లో శ్రీవారి హుండీ ఆదాయం ప్రధానమైంది. నెలకు పైగా దర్శనాలు నిలిపివేయడంతో దాదాపు రూ.100కోట్ల పైగా ఆదాయం కోల్పోయింది. ఇలా మొత్తంగా దాదాపు రూ.300కోట్లకు పైగా టీటీడీ ఆదాయానికి గండిపడినట్లైంది. మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్ కొనసాగనుండడం.. ఆ తర్వాత పరిస్థితి ఏమిటో తెలియని పరిస్థితులలో మరింత ఆదాయం కోల్పోక తప్పదు. (కరోనా ఎఫెక్ట్ : టీటీడీ సంచలన నిర్ణయం)
Comments
Please login to add a commentAdd a comment