
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తామని కురసాల కన్నబాబు అన్నారు. రైతుబజార్, మాల్స్ వద్ద జనసమూహం పెరుగకుండా నియంత్రించేందుకు చర్యలు చేపట్టామన్నారు. కరోనావైరస్ నియంత్రణకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ కమిటీ ఉన్నత స్థాయి టాస్క్‌ఫోర్స్ శనివారం సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రులు ఆళ్లనాని, బొత్స సత్యనారాయణ, సుచరిత, బుగ్గన రాజేంద్రనాథ్, కురసాల కన్నబాబు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, అదనపు సీఎస్ పీవీ రమేష్, వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి పాల్గొన్నారు. సమావేశానంతరం కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. లాక్‌డౌన్ నేపథ్యంలో నిరాశ్రయులకు భోజన వసతి కల్పిస్తామని చెప్పారు. ఆక్వా రైతులను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించామన్నారు. వ్యవసాయపనులకు ఆటంకం లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, పౌరసరఫరాలకు సంబంధించిన అంశాలపై భేటీలో చర్చించినట్లు తెలిపారు. ఈ రోజు సాయంత్రం మరోసారి టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశమైన మరిన్ని అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment