ఎవరి కోసం ఈ తప్పుడు రాతలు? | Minister Kannababu Fires On Yellow Media | Sakshi
Sakshi News home page

ఎవరి కోసం ఈ తప్పుడు రాతలు?

Published Fri, Apr 24 2020 4:02 AM | Last Updated on Fri, Apr 24 2020 8:20 AM

Minister Kannababu Fires On Yellow Media - Sakshi

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కన్నబాబు

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ విస్తరించకుండా ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుంటే.. విపత్తు వేళ బాధ్యత మరచి తప్పుడు వార్తలతో ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్న ‘ఈనాడు’ దినపత్రికపై వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మండిపడ్డారు. గురువారం ఆయన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఏపీ వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డితో కలిసి విజయవాడ నగరంలోని కేదారేశ్వరపేట రైతుబజార్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడానికి కొన్ని పత్రికలు వాస్తవాలను వక్రీకరిస్తున్నాయని నిప్పులు చెరిగారు. పచ్చి అబద్ధాలు ప్రచురిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోబోదన్నారు. రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే భావన కలిగించేలా అసత్యాలను ప్రచారం చేసి ప్రజలను గందరగోళానికి గురిచేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇంకా ఏమన్నారంటే..

14వ తేదీ నాటి అరటి ఫొటోతో వక్రీకరణ
► ఈనాడు పత్రికలో ఈ రోజు (గురువారం) ‘అమ్మబోతే అడవి’ శీర్షికన బ్యానర్‌ స్టోరీని ప్రచురించారు. ఒకపక్క విజయవాడ కేదారేశ్వరపేటలో ఉన్న అరటి, మరోవైపు రైతు అమ్ముకోలేక వదిలేసిన కర్భుజ అని రెండు ఫొటోలు వేశారు. మొన్న.. పౌల్ట్ర్‌రీ చాలా కష్టాలలో ఉందని, మేత లేకపోతే టమాటాలు వేసి పెంచుతున్నారని జనం నవ్వుకునేలా రాసుకొచ్చారు. ఏం ప్రయోజనాలు ఆశించి ఇలాంటివి రాస్తున్నారని ప్రశ్నిస్తున్నాను.
► ఈ అవాస్తవ వార్తల నిగ్గు తేల్చాలని సీఎం ఆదేశాల మేరకు విజయవాడ కేదారేశ్వరపేట రైతు బజార్‌కు వచ్చాం. ఈనాడులో ప్రచురించిన ఫొటో.. ఈ నెల 14వ తేదీన కడప, అనంతపురం జిల్లాల నుంచి అరటిని ఇక్కడకు తీసుకువచ్చినప్పటిది. 
► రికార్డులు పరిశీలించాం. రైతుబజార్‌ అధికారులతో, స్థానికులతో మాట్లాడాం. 14వ తేదీన రైతుబజార్‌కు  అరటి వచ్చింది. క్రౌడ్‌గా ఉంటుందని కేదారేశ్వరపేట రైతుబజార్‌ను క్లోజ్‌ చేసి.. ఐదు రైతుబజార్లుగా వికేంద్రీకరించి వేర్వేరు ప్రాంతాలలో ఏర్పాటు చేశాం. ఆ అరటిని 15, 16, 17 తేదీలలో వికేంద్రీకరించిన రైతు బజార్లకు, మొబైల్‌ రైతు బజార్లకు సరఫరా చేశారు.
► 18వ తేదీన మళ్లీ అరటి వచ్చింది. వాటిని కూడా 18, 19, 20 తేదీలలో రైతుబజార్లకు పంపించేశారు. నేడు ఇక్కడ ఒక్క అరటి పండు కూడా లేదు. దురదృష్టం ఏమంటే ఈనాడులో ఈరోజు ఫ్రంట్‌ పేజీలో టాప్‌లో.. అరటి మగ్గిపోతుంటే కొనేవాడు లేడన్నట్లుగా వార్త ప్రచురించారు. ఇలా చేయడం అన్యాయం కాదా? వక్రీకరించడం కాదా? ఎందుకీ వక్రీకరణ అని అడుగుతున్నాం.

ఇది అన్యాయం కాదా?
► గుంటూరు జిల్లా ఈపూరు మండలానికి చెందిన రైతు వీరాంజనేయులు రొంపిచర్ల మండలం విప్పర్తిరెడ్డిపాలెంలో 12 ఎకరాలు కౌలుకు తీసుకుని కర్భుజ సాగు చేస్తే కొనేవాడు లేడని మస్కిమిలన్‌ (ఢిల్లీ దోస) ఫొటో వేశారు. అధికారులు ఆ రైతు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఇప్పటికే రెండు కోతలు  మంచి రేటుకు విక్రయించామని రైతు కుటుంబ సభ్యులు చెప్పారు. కాయ సైజు బాగా తగ్గిపోవడంతో కూలి కూడా రాదని మూడో కోత తీయలేదని చెప్పారు. ఈ ఫొటో కూడా నిన్న.. మొన్న తీసింది కాదు. పాత ఫొటో.
► హోల్‌సేల్‌ ఫ్రూట్‌ మార్కెట్‌కు వెళ్లాం. ఈ రోజు మస్కిమిలన్‌ కిలో ఎనిమిది రూపాయలకు కొంటున్నామని అక్కడి వారు చెప్పారు. ఇప్పుడు కూడా రోజుకు అదే రేటుకు 50 నుంచి 100 టన్నులు కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. ఇది వాస్తవ పరిస్థితి. ఈ విషయాన్ని చెప్పకుండా ‘ఈనాడు’ అలా వక్రీకరించి ప్రచురించడం అన్యాయం కాదా?

ఇవీ వాస్తవాలు
► నేను పంటను అమ్ముకోలేకపోతున్నానని ఓ టమాటా రైతు పెట్టిన వీడియోను చాలా మంది మీడియా మిత్రులు చూశారు. అది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. మార్కెటింగ్‌ అధికారి ఆ రైతుతో మాట్లాడి ఓ కార్పొరేట్‌ సంస్ధతో ఆ పంటను కొనిపించారు. 
► కరోనా వచ్చిన కొత్తలో చికెన్‌ తింటే, గుడ్డు తింటే కరోనా వస్తుందనే ప్రచారం జరిగినప్పుడు పౌల్ట్రీ పరిశ్రమ ఒడిదుడుకులకు లోనైంది. అప్పుడు నెక్‌ సంస్థతో మాట్లాడి వారికి కావాల్సిన సహాయం అందిస్తూ బయట రాష్ట్రాలకు వెళ్లడానికి, ఫీడ్‌కు అనుమతిచ్చాం.  
► చికెన్, గుడ్డు తినడం వల్ల కరోనా రాదని ప్రచారం చేయడం వల్ల ఈ రోజు వాటి రేటు స్థిరీకరణ జరిగింది. ఇవి వాస్తవాలు. దురదృష్టం ఏంటంటే ప్రభుత్వం ఒక మిషన్‌ లాగా వ్యవసాయాన్ని ఆదుకోవడానికి పని చేస్తుంటే దుష్ప్రచారం చేసి ప్రజలను తప్పుదారి పట్టించాలనే విధంగా ఆలోచిస్తున్నారు.

ఆ లెక్క ఎక్కడి నుంచి వచ్చింది?
► ఇదేరోజు (గురువారం) ఈనాడులో ‘జిల్లాల్లో ఉధృతి.. రాష్ట్రంలో కొత్తగా 60 మందికి కరోనా పాజిటివ్‌’ అని రాశారు. వారికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ సమాచారం? సూటిగా చెప్పాలి.
► ప్రభుత్వం బులెటిన్‌లో ఏం ప్రకటించింది? మీరేం రాస్తున్నారు? అనంతపురం కలెక్టర్‌ బులెటిన్‌ ఇచ్చారని రాస్తే ఆ విషయంపై సీఎంఓ అధికారులు అడిగితే ఎలాంటి బులెటిన్‌ రిలీజ్‌ చేయలేదని అక్కడి జిల్లా అధికారులు చెప్పారు.
► టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. పాజిటివ్‌ కేసులను తక్కువ చేసి చూపిస్తామన్నట్లుగా చెబుతున్నారు. అలా కేసులు తక్కువ చూపడం ఏం అవసరం? కరోనా ఏపీలో మాత్రమే ఉందా? ఇతర రాష్ట్రాలలో, దేశాలలో లేదా? ఏం ఆశించి మేం తక్కువ చూపిస్తాం? వాస్తవాలు పట్టించుకోకుండా మీ ఇష్టం వచ్చినట్లు రాస్తారా?

సీఎం ఆదేశాలతో ఇలా..
► నిల్వ ఉండని ఉత్పత్తులను మార్కెటింగ్‌ శాఖ ద్వారా కొంటున్నాం. అరటి, బత్తాయి, దోస, పుచ్చ, టమాటా.. ప్రతి ఒక్కటి కొంటున్నాం. ఆ భారాన్ని, రవాణాను భరించి మహిళా సంఘాల ద్వారా గ్రామాల వరకు పంపి విక్రయిస్తున్నాం. గతంలో ఏ ప్రభుత్వమైనా ఇలా చేసిందా?
► ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా నిలుపుదల చేశారు. అలా చేయడం వల్ల రైతులకు మేలు కలుగుతుంది.
► కరోనా రాకముందు 100 రైతు బజార్లు నడుస్తుంటే కరోనా వచ్చాక వికేంద్రీకరణ చేసి 240 రైతుబజార్లు అదనంగా ఏర్పాటు చేశాం. 530 మొబైల్‌ రైతు బజార్లు ఏర్పాటు చేశాం. 200 స్మాల్‌ అవుట్‌ లెట్స్‌ పని చేస్తున్నాయి.
► ఏ రైతు నష్టపోకూడదు.. గిట్టుబాటు ధర రావాల్సిందే.. ప్రతి రైతు పండించింది కొనుగోలు చేయాల్సిందే.. మనపై ఎంత భారం పడినా వెనకడుగు వేసే ప్రసక్తేలేదని వైఎస్‌ జగన్‌ చెబుతూనే ఉన్నారు. దానిని ఆచరణలో పెడుతున్నారు.

ధరలు అందుబాటులో ఉన్నాయా.. లేవా?
► ధరలు అందుబాటులో ఉన్నాయా లేవా.. అని వినియోగదారులను కూడా మేం అడుగుతున్నాం. నిత్యం రివ్యూలు చేయడం వల్లనే ఇది సాధ్యమైంది. ధరలు అందుబాటులో ఉంచేందుకు నిరంతరం టాస్క్‌ ఫోర్స్‌ పనిచేస్తుంది. మార్కెట్‌ ఇంటిలిజెన్స్‌ వ్యవస్థను తీసుకొచ్చింది. 
► బియ్యం దగ్గర నుంచి పిల్లల పాలపొడి వరకు 25 కమోడిటీస్‌ను ఉన్నత స్థాయిలో ప్రతి రోజు సమీక్షిస్తున్నారు. ఇవేమీ ఆ మీడియాకు కనిపించడం లేదు. ఈ సమయంలో మీడియా నైతిక ధర్మం పాటించాలని సుప్రీం కోర్టు చెప్పినా చెవికెక్కించుకోరా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement