సాక్షి, అమరావతి: కరోనాతో విపత్కర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసేలా వార్తలు రాసినా, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినా కేసులు తప్పవని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు హెచ్చరించారు. విపత్తుల నిర్వహణ చట్టం, సైబర్ క్రైం చట్టాల కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. వేరే పార్టీపై అభిమానంతోనో, ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయాలనే ధోరణితో తప్పుడు సమాచారాన్ని వ్యాపింపచేసి ప్రజల్ని భయకంపితుల్ని చేయవద్దని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్, వైఎస్సార్ రైతు భరోసా, జనతా బజార్ల ఏర్పాటుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో సమీక్ష అనంతరం శుక్రవారం సాయంత్రం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు.
పనిగట్టుకుని తప్పుడు వార్తల్ని రాయడం సబబా?
► రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ రాష్ట్రంలో పండించే ప్రతి గింజనూ కొనుగోలు చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో మార్కెటింగ్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నాం. ధరల స్థిరీకరణ నిధి ద్వారా ప్రభుత్వమే అరటి, బత్తాయి, పసుపు లాంటి వాటిని కొనుగోలు చేస్తుంటే ఈనాడు లాంటి దినపత్రిక పనిగట్టుకుని తప్పుడు వార్తల్ని రాయడం సబబా?
► ఈనాడు పత్రిక వార్తల్ని వక్రీకరించి రాస్తోంది. నిన్నటి ఫోటోను ఇవాళ మళ్లీ తీస్తే డిజిటల్‌లో ఈరోజు తేదీ ఉండక నిన్నటిది ఉంటుందా? ఇలా తప్పుడు వార్తల్ని వండి వార్చాల్సిన అవసరం ఏముంది? విపత్తుల సమయంలో సంయమనం పాటించాలన్న సుప్రీంకోర్టు, కేంద్రం ఆదేశాలు కూడా ఆలకించరా?
► రూ.కోట్లు ఖర్చు చేసి పంట ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేస్తుండటం వాస్తవమని తెలిసి కూడా తప్పుడు వార్తలు రాస్తారా? ఇదేం తీరు? ఇప్పటికైనా సమీక్షించుకోవాలి.
► ధరల స్ధిరీకరణ కింద 40 వేల టన్నుల కందులు, 1.02 లక్షల టన్నుల శనగలు, 22 వేల టన్నుల మొక్కజొన్న, 10 లక్షల టన్నుల అరటి కొనుగోలు చేశాం. 4.50 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాం. పసుపు కొనుగోలు కేంద్రాలు తెరిచాం. ఇవన్నీ ఈనాడుకు కనిపించడం లేదా?
► రైతుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వార్తలు రాయవద్దు.
ఏ ప్రభుత్వమూ చేయని విధంగా మద్దతు ధర ఇస్తున్నాం..
► 350 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు, 1,300లకు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఏ ప్రభుత్వమూ చేయని విధంగా మద్దతు ధర ప్రకటించి అరటి, బత్తాయి, టమాటా కొనుగోలు చేస్తున్నాం
► గ్రామస్థాయిలోనే ధాన్యాన్ని సేకరించేందుకు శనివారం నుంచి రైతులకు కూపన్లు ఇస్తున్నాం. గ్రామ సహాయకుల వద్ద పేర్లను నమోదు చేసుకుంటే.. ధాన్యం కేంద్రం వాళ్లు వెంటనే వచ్చి కొనుగోలు చేస్తారు. ఈలోగా ఎవరైనా వ్యాపారి ఎక్కువ ధర ఇస్తామంటే అమ్ముకోవచ్చు.
► ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా కట్టడి చేసి రాష్ట్ర రైతులకు మంచి ధర వచ్చేలా చూస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దీనిపై చాలా పట్టుదలతో ఉన్నారు
► మొక్కజొన్న క్వింటాల్‌కు రూ.1,760 మద్దతు ధర ప్రకటించడంతో ప్రైవేట్ వ్యాపారులు కూడా దిగివస్తున్నారు.
► తడిసిన శనగల్నీ కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలు ఇచ్చారు.
► ఇంత విపత్కర పరిస్థితుల్లోనూ మే 15 నుంచి రైతు భరోసా కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించి తీరాల్సిందేనని సీఎం జగన్ ఆదేశించారు. అర్హులై ఉండి గతంలో రానివారు కూడా మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాం.
► రైతు భరోసా, మత్స్యకార భరోసా లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయాల వద్ద ప్రదర్శించి సోషల్ ఆడిట్ చేస్తాం.
► జనతా బజార్లపై సీఎం సమీక్ష జరిపారు. మార్కెటింగ్ వ్యవస్థను పటిష్టం చేయాలని సూచించారు. వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధర రావాలంటే నాణ్యత ఉండాలి. అందుకోసం ప్రతి గ్రామంలో గ్రేడింగ్, ప్యాకింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు
► కరోనా సమయంలోనే కాకుండా తర్వాత కూడా రైతుల ఉత్పత్తులకు మంచి ధరలు లభించేలా శాశ్వత మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నది ముఖ్యమంత్రి ఉద్దేశం. దీనికనుగుణంగానే రైతు బజార్ల సంఖ్యను వంద నుంచి 1070కి పెంచాం.
► రెడ్‌జోన్ ప్రాంతాల్లో కంటైన్‌మెంట్ ఏరియా ప్రారంభంలోనే నిత్యావసర సరకుల్ని అందుబాటులో ఉంచి ప్రతి ఇంటికి ఒక పాస్ ఇస్తాం. కంటైన్‌మెంట్ ప్రాంత వాసులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం.
ఇదేనా మీ బాధ్యత?
► కరోనా బులెటిన్లు ఇచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్లు సాయంత్రం ఇచ్చిన లెక్కలతో వార్తలు రాస్తున్నామని ఈనాడు చెప్పడం అవాస్తవం. ఏ జిల్లా కలెక్టర్ ఇచ్చిన లెక్కల ఆధారంగా కరోనా మృతుల సంఖ్యను పెంచి రాశారో వెల్లడించాలి.
► కరోనా కేసుల్ని దాచాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. 9 ల్యాబ్‌లలో పరీక్షలు జరుగుతున్నాయి. వేల కేసుల్ని పెండింగ్‌లో పెడుతున్నట్లు ప్రజల్ని ఎందుకు తప్పుదోవపట్టిస్తున్నారు? మీడియా సంస్థగా మీ బాధ్యత ఇదేనా?
► వ్యవసాయ ఉత్పత్తుల్ని కొనేవారు లేరు, కరోనా కేసుల్ని దాచిపెడుతున్నారని రాస్తుంటే రైతులు, ప్రజలు ఎంత ఆందోళన చెందుతారో మీకు తెలియదా?
Comments
Please login to add a commentAdd a comment