సాక్షి, అమరావతి: అసలే అంతంత మాత్రంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక స్థితిపై కరోనా వైరస్ వ్యాప్తి తీవ్ర ప్రభావం చూపిస్తోంది. లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. మరో పక్క కోవిడ్–19 నియంత్రణతో పాటు ఇతర అత్యవసర వ్యయానికి నిధులు అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర రాజకీయ పదవుల్లోని వారికి, స్థానిక ప్రజా ప్రతినిధులకు, కార్పొరేషన్ల చైర్మన్లకు మార్చి నెల వేతనాలను చెల్లించకుండా వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్ మంగళవారం ఉత్తర్వులిచ్చారు.
– అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ లాంటి అధికారులందరి మార్చి వేతనాల్లో 40 శాతం చెల్లించనున్నారు. మిగతా 60 శాతం వాయిదా వేయనున్నారు.
– రాష్ట్ర ప్రభుత్వ మిగతా ఉద్యోగులకు మార్చి నెల వేతనాల్లో 50 శాతం చెల్లింపు, మిగతా 50 శాతం వాయిదా.
– నాలుగవ తరగతి, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు 90 శాతం వేతనాలు చెల్లింపు. మిగతా 10 శాతం వేతనం వాయిదా.
– అన్ని రకాల పింఛన్లు పొందుతున్న రిటైర్డ్ ఉద్యోగులకు 50 శాతం పెన్షన్‌ను వాయిదా వేశారు.
– అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ గ్రాంట్లు పొందుతున్న సంస్థల ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే వేతనాలను వాయిదా వేశారు. వాయిదా వేసిన వేతనాలను పరిస్థితి కుదుట పడగానే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
– రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యారాయణ మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్ రెడ్డిని కలిశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ నెల సగం జీతం ఇస్తామని, పరిస్థితి సర్దుబాటు అయ్యాక మిగతా సగం చెల్లిస్తామన్న సీఎం ప్రతిపాదనకు అంగీకరించామని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment