ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనా వైరస్‌కు మందు లేదు. ప్రస్తుతం నివారణ ఒక్కటే మనకు ఉన్న మార్గం. సామాజిక దూరంతోనే అది సాధ్యం. ఐతే ఇప్పటికే వ్యాధి బారినపడి వారిలో చాలా మంది కోలుకుంటున్నారు. మందు లేనప్పటికీ వీరంతా ఎలా కోలుకుంటున్నారంటే.. వారిలో ఉన్న రోగ నిరోధక శక్తే కారణం. అందుకే కరోనా అనుమానితులు, కరోనా రోగుల్లో రోగ నిరోధక శక్తి పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా క్వారంటైన్ సెంటర్లు, ఆస్పత్రుల్లో ఉన్న వారికి ఇమ్యూనిటీ పెంచే మందులతో పాటు బలవర్థక ఆహారం అందజేస్తున్నారు వైద్యాధికారులు.
సాక్షి, లబ్బీపేట(విజయవాడతూర్పు): పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకుంటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో ఎలాంటి వ్యాధుల నుంచైనా విముక్తి పొందవచ్చు. ఒకవేళ సోకినా వారిపై పెద్దగా ప్రభావం చూపదు. ఇప్పుడు కరోనా వైరస్ సోకిన రోగులకు పాటు, క్వారంటైన్‌లో ఉన్న అనుమానితుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపడుతుంది. వారికి నాణ్యమైన, పోషక విలువలు కలిగిన ఆహారం అందించడంలో ఏ మాత్రం వెనుకంజ వేయడం లేదు.
- ఐసోలేషన్ వార్డుల్లో, క్వారంటైన్‌లో ఉన్న వారికి ఒక్కొక్కరికీ భోజనానికి రోజుకు రూ.500ల చొప్పున కేటాయిస్తుంది. దీంతో వారికి మూడు పూటల నాణ్యమైన వైద్యం అందించడంతో రోగులు త్వరగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతున్నారు.
- కరోనా వైరస్ సోకి చిన ఆవుటుపల్లిలోని పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రి, ఆయుష్ ఆస్పత్రిల్లో చికిత్సపొందుతున్న వారితో పాటు, జిల్లాలోని వివిధ క్వారంటైన్‌లో ఉన్న సుమారు 824ల మందికి పోషక విలువలు కలిగిన ఆహారం అందజేస్తున్నారు.
- అలాగే సిద్ధార్థ వైద్య కళాశాలలోని వైరల్ ల్యాబ్‌లో పనిచేస్తున్న 50 మందికి నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నారు.
- ఈ బాధ్యతను ప్రభుత్వం విజయమేరి, ప్రణీత మహిళా పొదుపు సంఘాల వారికి అప్పగించింది.
- విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి అక్కడి డైట్ కాంట్రాక్టర్ భోజనాన్ని అందిస్తున్నారు.
ఇదీ మెనూ..
ఉదయం: ఇడ్లీ 2+గారె 2, గోధుమరవ్వ ఉప్మా+మైసూర్ బజ్జీ 2, తెల్లరవ్వ ఉప్మా+పూరీ 2, టమాటా బాత్+పునుగు 2.. రోజు విడిచి రోజూ ఈ మెనూ అందిస్తున్నారు.
మధ్యాహ్నం: బాయిల్డ్ గుడ్డు, స్వీట్, ఫ్లేవర్ రైస్, పప్పు, గుజ్జుకూర, వేపుడు కూర, పచ్చడి, వైట్‌రైస్‌తో పాటు, సాంబారు అన్నం(ప్రత్యేక ప్యాకింగ్) పెరుగు అన్నం (ప్రత్యేక ప్యాకింగ్) అందజేస్తున్నారు.
సాయంత్రం: రోజుకో పండు, బాదంపప్పు, జీడిపప్పు, పిస్తాపప్పు, కిస్‌మిస్ 100 గ్రాముల ఇస్తారు. వీటితో పాటు చెకోడీ లేదా బూందీ ఇస్తున్నారు.
రాత్రి భోజనం: పప్పు, గుజ్జుకూర, వేపుడుకూర, సాంబారు, రసం, వైట్‌రైస్ ఇస్తున్నారు.
సకల సౌకర్యాలు..
ఐసోలేషన్‌లో ఉన్న వారికి నాణ్యమైన భోజనం పెట్టడమే కాకుండా.. ఒక టవల్, ఒక బక్కెట్, మగ్గుతో పాటు, సబ్బులు, పేస్ట్‌లు వంటి పరికరాలు ఇస్తున్నారు. పురుషులైతే షేవింగ్ చేసుకునేందుకు సైతం పరికరాలు అందజేస్తున్నారు. అంతేకాదు డిశ్చార్జి సమయంలో ఒక షర్ట్, రూ.2 వేలు నగదు అందజేస్తున్నారు. ప్రభుత్వం తమకు అందిస్తున్న సేవలపై ప్రతి ఒక్కరూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment