సాక్షి, విజయవాడ : కరోనా కట్టడికి దేశంలో ఎక్కడా లేని విధంగా టెక్నాలజిని ఉపయోగించి హౌస్ క్వారంటైన్ యాప్‌ను ఏపీ పోలీస్ రూపొందించిందని డిఐజీ రాజశేఖర్ బాబు పేర్కొన్నారు. సాక్షి టీవీకి ఇచ్చిన ఇంటర్య్వూలో రాజశేఖర్ మాట్లాడుతూ.. హౌస్ క్వారంటైన్ యాప్ ద్వారా కరోనా లక్షణాలతో ఉన్నవారిని ఆన్‌లైన్ రిజిస్టర్ ద్వారా అనుసంధానిస్తారని తెలిపారు. దీనికి జియో ఫెన్సింగ్ టెక్నాలజితో ఎప్పటికప్పుడు నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు. ఒకవేళ ఎవరైన క్వారంటైన్ నుంచి బయటికి వెళ్లాలని చూస్తే యాప్ ద్వారా తక్షణమే కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు సంకేతాలు వెలువడుతాయన్నారు. ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చిన 20,625 మందిని ఈ యాప్‌కు అనుసంధానించామన్నారు. వీరిలో 11234 మందికి 28 రోజుల హౌస్ క్వారెంటైన్ పూర్తయిందన్నారు. క్వారెంటైన్ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినందుకు రెండు కేసులు నమోదయ్యాయన్నారు.
కాగా పదిహేడు రోజుల్లో 2896 మంది హౌస్ క్వారెంటైన్ నిబంధన ఉల్లఘించారన్నారు. మరోసారి తప్పుచేస్తే వారిపై 188 సెక్షన్ కింద కేసు నమోదు చేస్తామన్నారు. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లివచ్చి క్వారెంటైన్‌లో ఉన్న మిగతావారిని కూడా ఈ యాప్ కిందకి తెస్తున్నామన్నారు. హౌస్ క్వారెంటైన్ యాప్ పై ఇరవై నాలుగు గంటలూ పర్యవేక్షణ ఉంటుందన్నారు. క్వారెంటైన్ నుంచి బయటకు వచ్చిన వ్యక్తులు ఎవరితోనైనా కాంటాక్ట్ అయితే వారిని కూడా ఐసొలేషన్‌లో ఉంచుతామని రాజశేఖర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment