ఆంక్షల పరిధి తక్కువే
కేంద్రం తాజా మార్గదర్శకాల మేరకు ఆయా రాష్ట్రాల పరిస్థితులను బట్టి కేసులు ఉన్న ప్రాంతాలను క్లస్టర్లుగా విభజించుకోవచ్చు. ఈ నేపథ్యంలో పాజిటివ్ కేసు నమోదైతే.. గ్రామీణ ప్రాంతాల్లో 7 కిలోమీటర్ల మేర, పట్టణ, నగర ప్రాంతంలో అయితే 5 కిలోమీటర్ల మేర కంటైన్‌మెంట్ జోన్/క్లస్టర్‌గా గుర్తించారు. ఇలాంటి క్లస్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా 238 ఉన్నాయి. వీటిలోనే రెడ్, ఆరెంజ్ జోన్లు ఉన్నాయి. కేవలం ఈ పరిధిలోనే ఆంక్షలు అమలవుతాయి. ఇవి మినహా రాష్ట్రంలో మిగతా ప్రాంతమంతా గ్రీన్ జోన్ కిందికే వస్తుంది. ఈ 238 క్లస్టర్లలో కూడా ఆరెంజ్ జోన్లు అధికంగా ఉన్నాయి. కనుక ఆ ప్రాంతాల్లో మినహాయింపులు ఎక్కువే. రెడ్ జోన్లలో కూడా కొన్ని సడలింపులను కేంద్రం సూచించింది. ఈ లెక్కన రాష్ట్రంలో చాలా తక్కువ ప్రాంతాల్లోనే ఆంక్షలు ఉంటాయి. అంటే రాష్ట్రంలో ఆంక్షల పరిధి 20 శాతం కూడా మించి ఉండదని స్పష్టమవుతోంది.
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ రెడ్ జోన్లు తగ్గాయి. గత వారం కేంద్ర ఆరోగ్య శాఖ 11 జిల్లాలను రెడ్ జోన్లుగా ప్రకటించగా.. తాజాగా ఐదు జిల్లాలను మాత్రమే వెల్లడించింది. మిగిలిన 8 జిల్లాల్లో ఏడు ఆరెంజ్ జోన్‌లో, ఒకటి గ్రీన్ జోన్‌లో ఉన్నాయి. తాజా వర్గీకరణ మే 3వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. దేశ వ్యాప్తంగా 130 జిల్లాలను రెడ్ జోన్‌లో, 284 జిల్లాలు ఆరెంజ్ జోన్‌లో, 319 జిల్లాలు గ్రీన్ జోన్‌లో ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఆరోగ్య శాఖ కార్యదర్శులతో కేంద్ర కేబినెట్ సెక్రటరీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన అనంతరం కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుదాన్ జోన్ల వర్గీకరణపై తాజా ఉత్తర్వులను రాష్ట్రాలకు పంపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
మారిన ప్రాతిపదిక
► గత వారం కేవలం కేసుల (క్యుములేటివ్) సంఖ్య, కేసులు రెట్టింపు అయ్యేందుకు పడుతున్న కాలాన్ని బట్టి జోన్లను వర్గీకరించారు.
► అయితే తాజాగా పాజిటివ్ కేసుల నుంచి కోలుకున్న వారి సంఖ్య పెరగడంతో ఆ ప్రాతిపదికను మరింత విస్తృతం చేసినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేసుల సంఖ్య, డబ్లింగ్ రేటు, టెస్టుల పరిధి వంటి అంశాల ప్రాతిపదికన జిల్లాలను వర్గీకరించినట్లు తెలిపింది.
► ఇప్పటి వరకు కేసులు లేని వాటిని, గడిచిన 21 రోజుల్లో కోవిడ్ పాజిటివ్ కేసులు నిర్ధారణ కాని జిల్లాలను గ్రీన్‌జోన్‌లోకి తీసుకుంటారు.
వారం వారం మారుతుంది..
► కొన్ని జిల్లాలను రెడ్ జోన్‌లోకి చేర్చడాన్ని పలు రాష్ట్రాలు ప్రశ్నించాయని, అయితే.. వారం వారం ఈ జాబితా మారుతుందని ఆరోగ్య శాఖ కార్యదర్శి ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
► క్షేత్ర స్థాయి ఫీడ్ బ్యాక్ ఆధారంగా, రాష్ట్ర స్థాయిలో అదనపు విశ్లేషణ ఆధారంగా, రాష్ట్రాలు మరిన్ని రెడ్, ఆరెంజ్ జోన్లను నిర్దేశించవచ్చు.
► కేంద్రం ఇచ్చిన రెడ్, ఆరెంజ్ జోన్ జిల్లాల జోనల్ వర్గీకరణలో రాష్ట్రాలు సడలింపు చేయరాదని పేర్కొన్నారు. జిల్లాల్లో ఒకటి కంటే ఎక్కువగా మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నప్పుడు కార్పొరేషన్లను, జిల్లాలోని మిగిలిన ప్రాంతాన్ని వేర్వేరు యూనిట్లుగా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఒక యూనిట్‌లో 21 రోజుల పాటు కేసులు లేనిపక్షంలో ఆ యూనిట్ వరకు జోన్ వర్గీకరణను మార్చవచ్చు.
ఏపీలో జిల్లాలు ఇలా..
రెడ్‌జోన్‌లో కర్నూలు, గుంటూరు, కృష్ణా, చిత్తూరు, నెల్లూరు ఉన్నాయి.
ఆరెంజ్ జోన్‌లో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, వైఎస్సార్, అనంతపురం, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఉన్నాయి.
గ్రీన్‌జోన్‌లో విజయనగరం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment