సాక్షి ప్రతినిధి, కర్నూలు : ఇంటింటికీ పంపిణీ చేయాల్సిన చెత్త బుట్టల కొనుగోళ్లు సైతం అవినీతి వ్యవహారాలకు అడ్డాగా మారాయి. రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను సేకరించేందుకు రెండు చెత్త బుట్టల చొప్పున సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, రెండు చెత్త బుట్టలు బహిరంగ మార్కెట్‌లో రూ.70కే లభిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రూ.135 ధర పెట్టి కొనుగోలు చేస్తోంది. అంటే జత చెత్త బుట్టలపై రూ.65 అదనంగా ఖర్చు చేస్తోందన్న మాట! రాష్ట్రంలో 1.70 కోట్ల కుటుంబాలు ఉండగా, ఒక్కో కుటుంబానికి రెండు చెత్త బుట్టలు ఇస్తారు. ఈ లెక్కన రూ.110.50 కోట్లు అదనంగా చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ఖర్చంతా స్థానిక సంస్థలు భరించాల్సిందే.
స్థానిక సంస్థలపైనే భారం
రాష్ట్రంలో మొదటి విడతలో పంచాయతీలకు చెత్త బుట్టల సరఫరాను ప్రారంభించారు. తర్వాత పురపాలక సంఘాల్లో సరఫరా చేయనున్నారు. చెత్తబుట్టల ఖర్చంతా పంచాయతీలు, మున్సిపాలిటీలే భరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే సరఫరా చేసిన చెత్త బుట్టలకు సంబంధించి రూ.135 చొప్పున ఎస్‌బీఐ ఖాతా సంఖ్య 52096005308లో నగదు జమ చేయాలని పేర్కొంది. చెత్తబుట్టల పేరిట పంచాయతీలు, మున్సిపాలిటీలపై అదనపు భారం మోపడం ద్వారా ఆర్థిక సంఘం నిధుల నుంచి వసూలు చేసే రూ.110.50 కోట్లు ప్రభుత్వ పెద్దల జేబుల్లోకే వెళుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
డబ్బులు కట్టకుంటే నిధులు బంద్
పంచాయతీలు, మున్సిపాలిటీల నుంచి కనీసం అనుమతి తీసుకోకుండానే చెత్త బుట్టలను సరఫరా చేస్తున్నారు. మరోవైపు ఈ సొమ్మును వసూలు చేసేందుకు ప్రభుత్వం బెదిరింపులకు దిగుతోంది. 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి వెంటనే నగదు జమ చేయాలని లేదంటే మిగతా నిధులను అడ్డుకుంటామని సర్పంచ్‌లను పంచాయతీరాజ్ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆర్థిక సంఘం నుంచి వచ్చే కొద్దిపాటి నిధులు కరెంటు బిల్లులకే సరిపోతున్నాయని ఇప్పుడిలా బలవంతంగా చెత్త బుట్టలు అంటగడితే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేమని సర్పంచ్‌లు వాపోతున్నారు.
ప్రతి పంచాయతీపై రూ.4 లక్షల అదనపు భారం
కర్నూలు జిల్లా కోడుమూరు పంచాయతీలో 6,200 కుటుంబాలు ఉన్నాయి. ఒక్కో కుటుంబానికి రెండు చెత్తబుట్టల చొప్పున మొత్తం 12,400 బుట్టలను ప్రభుత్వం సరఫరా చేసింది. జత చెత్తబుట్టలు బహిరంగ మార్కెట్‌లో రూ.70కే దొరుకుతున్నాయి. ఈ లెక్కన 6,200 కుటుంబాలకు 12,400 చెత్త బుట్టలను సరఫరా చేసేందుకు రూ.4,34,000 ఖర్చవుతుంది. అయితే, జత చెత్తబుట్టలకు ప్రభుత్వం రూ.135 వసూలు చేస్తున్నందు వల్ల ఈ మొత్తం రూ.8,37,000 అవుతుంది. అంటే కోడుమూరు పంచాయతీపై రూ.4,03,000 అదనపు భారం పడిందన్నమాట. రాష్ట్రం అంతటా పరిస్థితి ఇదే.
Comments
Please login to add a commentAdd a comment