dustbins
-
ప్రజలకు ఎమ్మెల్యే రోజా వినతి
-
విజయవాడలో కరోనా డస్ట్బిన్ల ఏర్పాటు
-
డస్ట్బిన్ల కోసం ఆ సీఎం సంచలన నిర్ణయం
అగర్తలా: త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేవ్ ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 1,100 గ్రామాలలో మార్కెట్లలో డస్ట్బిన్లను ఏర్పాటు చేసినందుకు తన ఆరు నెలల జీతాన్ని విరాళంగా ఇస్తానని ప్రకటించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా చెత్త, ప్లాస్టిక్ రహిత త్రిపుర కోసం ప్రచారం ప్రారంభించాలని అన్ని గ్రామ ప్రధాన్‌లను కోరినట్లు దేబ్ చెప్పారు. సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజు సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లోని బీజేపీ యూనిట్లు సెప్టెంబర్ 14 నుండి వారం రోజుల పాటు 'సేవా సప్తాహ్' లేదా సర్వీస్ వీక్ నిర్వహించాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 1,100 గ్రామాలలోని మార్కెట్లలో డస్ట్బిన్లను ఏర్పాటు చేసినందుకు తన ఆరు నెలల జీతం విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నానని త్రిపుర సీఎం వెల్లడించారు. అలాగే 'సేవా సప్తాహ్'లో భాగంగా పార్టీ కార్యకర్తలు రాష్ట్రంలోని వివిధ ప్రదేశాలలో రక్తదానం, ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా అయిన దేవ్ తెలిపారు. -
చెత్త బుట్ట.. అవినీతి పుట్ట!
సాక్షి ప్రతినిధి, కర్నూలు : ఇంటింటికీ పంపిణీ చేయాల్సిన చెత్త బుట్టల కొనుగోళ్లు సైతం అవినీతి వ్యవహారాలకు అడ్డాగా మారాయి. రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను సేకరించేందుకు రెండు చెత్త బుట్టల చొప్పున సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, రెండు చెత్త బుట్టలు బహిరంగ మార్కెట్లో రూ.70కే లభిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రూ.135 ధర పెట్టి కొనుగోలు చేస్తోంది. అంటే జత చెత్త బుట్టలపై రూ.65 అదనంగా ఖర్చు చేస్తోందన్న మాట! రాష్ట్రంలో 1.70 కోట్ల కుటుంబాలు ఉండగా, ఒక్కో కుటుంబానికి రెండు చెత్త బుట్టలు ఇస్తారు. ఈ లెక్కన రూ.110.50 కోట్లు అదనంగా చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ఖర్చంతా స్థానిక సంస్థలు భరించాల్సిందే. స్థానిక సంస్థలపైనే భారం రాష్ట్రంలో మొదటి విడతలో పంచాయతీలకు చెత్త బుట్టల సరఫరాను ప్రారంభించారు. తర్వాత పురపాలక సంఘాల్లో సరఫరా చేయనున్నారు. చెత్తబుట్టల ఖర్చంతా పంచాయతీలు, మున్సిపాలిటీలే భరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే సరఫరా చేసిన చెత్త బుట్టలకు సంబంధించి రూ.135 చొప్పున ఎస్బీఐ ఖాతా సంఖ్య 52096005308లో నగదు జమ చేయాలని పేర్కొంది. చెత్తబుట్టల పేరిట పంచాయతీలు, మున్సిపాలిటీలపై అదనపు భారం మోపడం ద్వారా ఆర్థిక సంఘం నిధుల నుంచి వసూలు చేసే రూ.110.50 కోట్లు ప్రభుత్వ పెద్దల జేబుల్లోకే వెళుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. డబ్బులు కట్టకుంటే నిధులు బంద్ పంచాయతీలు, మున్సిపాలిటీల నుంచి కనీసం అనుమతి తీసుకోకుండానే చెత్త బుట్టలను సరఫరా చేస్తున్నారు. మరోవైపు ఈ సొమ్మును వసూలు చేసేందుకు ప్రభుత్వం బెదిరింపులకు దిగుతోంది. 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి వెంటనే నగదు జమ చేయాలని లేదంటే మిగతా నిధులను అడ్డుకుంటామని సర్పంచ్‌లను పంచాయతీరాజ్ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆర్థిక సంఘం నుంచి వచ్చే కొద్దిపాటి నిధులు కరెంటు బిల్లులకే సరిపోతున్నాయని ఇప్పుడిలా బలవంతంగా చెత్త బుట్టలు అంటగడితే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేమని సర్పంచ్‌లు వాపోతున్నారు. ప్రతి పంచాయతీపై రూ.4 లక్షల అదనపు భారం కర్నూలు జిల్లా కోడుమూరు పంచాయతీలో 6,200 కుటుంబాలు ఉన్నాయి. ఒక్కో కుటుంబానికి రెండు చెత్తబుట్టల చొప్పున మొత్తం 12,400 బుట్టలను ప్రభుత్వం సరఫరా చేసింది. జత చెత్తబుట్టలు బహిరంగ మార్కెట్లో రూ.70కే దొరుకుతున్నాయి. ఈ లెక్కన 6,200 కుటుంబాలకు 12,400 చెత్త బుట్టలను సరఫరా చేసేందుకు రూ.4,34,000 ఖర్చవుతుంది. అయితే, జత చెత్తబుట్టలకు ప్రభుత్వం రూ.135 వసూలు చేస్తున్నందు వల్ల ఈ మొత్తం రూ.8,37,000 అవుతుంది. అంటే కోడుమూరు పంచాయతీపై రూ.4,03,000 అదనపు భారం పడిందన్నమాట. రాష్ట్రం అంతటా పరిస్థితి ఇదే. -
ఇక అండర్‌గ్రౌండ్ డస్ట్ బిన్స్
నగరంలో తీవ్రమవుతున్న చెత్త సమస్యను పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీ కొత్త ఆలోచన చేస్తోంది. రోడ్డు పక్కన డంపర్ బిన్లు...వాటి చుట్టూ చెత్తాచెదారం నిండడం..దుర్వాసన వెదజల్లడం వంటి సమస్యలకు చెక్ చెప్పేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా అండర్ గ్రౌండ్ బిన్స్ ఏర్పాటు చేయనుంది. ప్రయోగాత్మకంగా జీహెచ్ఎంసీ సర్కిల్–10 (ఏ, బీ) పరిధిలో డంపర్‌బిన్స్ ఉండే చోట అండర్‌గ్రౌండ్ బిన్స్ నిర్మిస్తారు. బంజారాహిల్స్: స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా ఇప్పటికే పలు కార్యక్రమాలకు సిద్ధమైన జీహెచ్ఎంసీ ..మరో కొత్త కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుట్టనుంది. రోడ్ల పక్కన చెత్తడబ్బాలు(డంపర్ బిన్లు) కనిపించకుండా ఉండేందుకు వీటిని భూగర్భంలో ఏర్పాటు చేసే కార్యక్రమానికి ప్రణాళికలు రూపొందించారు. లండన్, బ్రిస్సెల్స్, హాంబర్గ్లతో పాటు మన దేశంలోనూ కొన్ని నగరాల్లో పూర్తిగా లేదా పాక్షికంగా భూగర్భంలో ఉండే డంపర్ బిన్లున్నాయి. నగరంలోనూ కార్పొరేట్ సంస్థల నుంచి సీఎస్సార్(కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) ద్వారా అలాంటివి ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. భూగర్భంలోనే ఈ డంపర్బిన్లను ఏర్పాటు చేయడం వల్ల రహదారులపై చెత్త కనిపించదు. దాంతో పరిసరాలు పరిశుభ్రంగా కనిపిస్తాయి. రోడ్లపై పయనించే వారికి దుర్గంధం రాదు. సెన్సర్ల సహాయంతో పనిచేసే ఈ చెత్త డబ్బాలు నిండగానే సంబంధిత అధికారుల మొబైల్ఫోన్లకు సమాచారం అందేలా సాంకేతిక ఏర్పాట్లుంటాయి. దాంతో చెత్త నిండినట్లు తెలియగానే వెంటనే తరలిస్తారు. చెత్త ట్రక్‌లో వేసేందుకు సైతం ప్రత్యేక ఏర్పాట్లుంటాయి. ట్రక్‌లో ఉండే క్రేన్ డంపర్‌బిన్‌ను పైకి లేపుతుంది. డంపర్‌బిన్ నుంచి చెత్త మాత్రం ట్రక్‌లో పడుతుంది. తొలిదశలో ఎంపిక చేసిన వాణిజ్య ప్రాంతాల్లో 50 డబ్బాలను ఏర్పాటుచేయాలనుకున్నారు. ఇందుకుగాను దాదాపు రూ. 2.5 కోట్లు ఖర్చు కాగలదని అంచనా. వీటి వల్ల మానవ శ్రమ చాలా వరకు తగ్గుతుంది.తొలి దశలో సెంట్రల్‌జోన్ పరిధిలోని ఖైరతాబాద్ నియోజకవర్గంలో వీటిని ఏర్పాటు చేయాలని భావించిన అధికారులు బుధవారం జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద స్థలాన్ని పరిశీలించారు. సర్కిల్ 10–బి ఏఎంఓహెచ్, ట్రాన్స్పోర్ట్ ఇంజినీర్లు, అర్బన్ గ్రీన్‌సిటీ సంస్థకు చెందిన ప్రతినిధులు స్థలాన్ని పరిశీలించిన వారిలో ఉన్నారు. -
అంతా చెత్తమయం
* రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మె ఉధృతం * పట్టణాల్లో పేరుకుపోతున్న టన్నుల కొద్దీ చెత్త * చెత్తకుండీలు నిండి రోడ్లపాలవుతున్న వ్యర్థాలు * మంత్రులు, కార్మిక నేతల రెండో దఫా చర్చలూ విఫలం * సమ్మె కొనసాగిస్తామని కార్మిక నేతల ఉద్ఘాటన రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్‌ను చెత్త ముంచెత్తింది. ‘గ్రేటర్’ వరంగల్ చెత్తమయమైంది. చిన్నాపెద్ద నగరాలు, పట్టణాలు మురికి కూపాలయ్యాయి. అంతటా టన్నుల కొద్దీ చెత్త పేరుకుపోయింది. చెత్త కుండీలు, డంపర్ బిన్లు నిండి వ్యర్థాలు రోడ్లు, వీధులను ఆక్రమిస్తున్నాయి. పారిశుద్ధ్య పరిరక్షణ కోసం రాత్రింబవళ్లు చెమటోడ్చే కార్మికులు చేపట్టిన సమ్మెతో రెండు రోజుల్లోనే పట్టణ పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. మరోవైపు సమె విరమణ కోసం ప్రభుత్వ ప్రయత్నాలు మళ్లీ విఫలమయ్యాయి. దీంతో సమ్మెను విరమించే ప్రసక్తే లేదని, ఆందోళనలను ఉధృతం చేస్తామని కార్మిక ఐక్య సంఘాలు పునరుద్ఘాటించాయి. సాక్షి, హైదరాబాద్: కనీస వేతనాల పెంపుతోపాటు 16 డిమాండ్ల సాధన కోసం మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులు చేపట్టిన సమ్మె మంగళవారంతో మూడో రోజుకు చేరుకుంది. ఫలితంగా జీహెచ్ఎంసీతోపాటు రాష్ట్రంలోని 67 నగర, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలపై సమ్మె ప్రభావం తీవ్రంగా పడింది. రెండు రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు విధులను బహిష్కరించడంతో పట్టణాల్లో కుప్పలుతెప్పలుగా చెత్త పేరుకుపోతోంది. కార్మికులతో సమ్మె విరమింపజేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో ప్రతిష్టంభన తొలగిపోలేదు. రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి మంగళవారం మధ్యాహ్నం సచివాలయంలో కార్మిక సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులతో జరిపిన రెండో దఫా చర్చలూ విఫలమయ్యాయి. కార్మికుల డిమాండ్లపై చర్చ లేకుండానే ఈ భేటీ ముగిసింది. సమ్మెను విరమించి వస్తే చర్చలు జరుపుతామని మంత్రులు పేర్కొనగా అందుకు కార్మిక నేతలు ససేమిరా అన్నారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మెను విరమించే ప్రసక్తే లేదని చర్చల అనంతరం కార్మిక నేతలు ఉద్ఘాటించారు. ‘మా చేతుల్లో ఏమీ లేదు. మేము చర్చించలేం, సీఎం వస్తేనే మాట్లాడతామని మంత్రులు పేర్కొన్నారు. డిమాండ్ల పరిష్కారంపై మంత్రులు ఏ ప్రతిపాదన చేయలేదు. సమ్మె విరమిస్తేనే చర్చలు జరుపుతామన్నారు. దీనిని మేము అంగీకరించం’ అని చెప్పారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోనే ఉన్నప్పటికీ ఆయన అందుబాటులో లేరని కాలయాపన చేయడం తగదన్నారు. సమ్మెను ఉధృతం చేసేందుకు బుధవారం నుంచి జిల్లా, డివిజన్ స్థాయిల్లో ఆందోళనలు చేపడుతామన్నారు. సమ్మెలో టీఆర్ఎస్కేవీ... అధికార పార్టీ టీఆర్ఎస్ అనుంబంధ కార్మిక సంఘం టీఆర్ఎస్కేవీ సైతం బుధవారం నుంచి మున్సిపల్ కార్మికుల సమ్మెలో పాల్గొననుంది. టీఆర్ఎస్కేవీ-జీహెచ్ఎంఈయూ నేతలు మంగళవారం ఈ మేరకు ప్రకటన చేశారు. గత రెండు రోజులుగా సమ్మెలో పాల్గొంటున్న సీఐటీయూ, ఏఐటీయూసీ, బీఎంఎస్, హెచ్ఎంఎస్, ఐఎఫ్టీయూ, ఏఐయూటీయూసీ, టీఎన్‌టీయూసీల నేతృత్వంలోని జేఏసీ కార్మికుల కనీస వేతనాన్ని రూ. 14,170కు పెంచాలని డిమాండ్ చేస్తుండగా టీఆర్ఎస్కేవీ మాత్రం ఆ మొత్తాన్ని రూ.16,500కు పెంచాలని డిమాండ్ చేస్తోంది. -
పదివేల చెత్తబుట్టలు!
కురచ దుస్తుల్లో కనిపించడానికి ఏమాత్రం మొహమాటపడని రాఖీ సావంత్, అడపా దడపా బోల్డ్ స్టేట్మెంట్స్ కూడా ఇస్తుంటారు. ఒక్కోసారి వింత చర్యలు కూడా చేస్తుంటారు. కానీ, ఇటీవల మాత్రం ఓ వివేకవంతమైన పని చేశారు ఈ హాట్‌గాళ్. మురికివాడల్లో నివసించేవారికి మహిళా దినోత్సవం సందర్భంగా శుభ్రత-పరిశుభ్రత గురించి తెలియజేయాలనుకున్నారు. పదివేల చెత్తబుట్టలు, కొన్ని బహుమతులు, తినుబండారాలు కొనుక్కుని మురికివాడలకు వెళ్లారు రాఖీ. అక్కడున్నవారికి అవి పంచారు. డస్ట్‌బిన్స్ పంచుతున్నప్పుడు అందరూ అందులోనే చెత్త వేయాలని, తద్వారా పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంటాయని, దానివల్ల రోగాల బారినపడే అవకాశం తక్కువగా ఉంటుందని ఓ లెక్చర్ కూడా ఇచ్చారు రాఖీ. ఇన్నాళ్లు గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్న ఆమెకు రాజకీయాల్లో చేరాలని ఉందట. అందులో భాగంగానే ఇదంతా చేశారన్నది కొంతమంది ఊహ. ఏదేమైనా రాఖీ చేసింది మంచి పనే కాబట్టి కొంతమంది మెచ్చుకుంటున్నారు కూడా.