నమూనా చిత్రం
నగరంలో తీవ్రమవుతున్న చెత్త సమస్యను పరిష్కరించేందుకు జీహెచ్‌ఎంసీ కొత్త ఆలోచన చేస్తోంది. రోడ్డు పక్కన డంపర్ బిన్లు...వాటి చుట్టూ చెత్తాచెదారం నిండడం..దుర్వాసన వెదజల్లడం వంటి సమస్యలకు చెక్ చెప్పేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా అండర్ గ్రౌండ్ బిన్స్ ఏర్పాటు చేయనుంది. ప్రయోగాత్మకంగా జీహెచ్‌ఎంసీ సర్కిల్–10 (ఏ, బీ) పరిధిలో డంపర్‌బిన్స్ ఉండే చోట అండర్‌గ్రౌండ్ బిన్స్ నిర్మిస్తారు.
బంజారాహిల్స్: స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా ఇప్పటికే పలు కార్యక్రమాలకు సిద్ధమైన జీహెచ్‌ఎంసీ ..మరో కొత్త కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుట్టనుంది. రోడ్ల పక్కన చెత్తడబ్బాలు(డంపర్ బిన్లు) కనిపించకుండా ఉండేందుకు వీటిని భూగర్భంలో ఏర్పాటు చేసే కార్యక్రమానికి ప్రణాళికలు రూపొందించారు. లండన్, బ్రిస్సెల్స్, హాంబర్గ్‌లతో పాటు మన దేశంలోనూ కొన్ని నగరాల్లో పూర్తిగా లేదా పాక్షికంగా భూగర్భంలో ఉండే డంపర్ బిన్లున్నాయి. నగరంలోనూ కార్పొరేట్ సంస్థల నుంచి సీఎస్సార్(కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) ద్వారా అలాంటివి ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. భూగర్భంలోనే ఈ డంపర్‌బిన్లను ఏర్పాటు చేయడం వల్ల రహదారులపై చెత్త కనిపించదు.
దాంతో పరిసరాలు పరిశుభ్రంగా కనిపిస్తాయి. రోడ్లపై పయనించే వారికి దుర్గంధం రాదు. సెన్సర్ల సహాయంతో పనిచేసే ఈ చెత్త డబ్బాలు నిండగానే సంబంధిత అధికారుల మొబైల్‌ఫోన్లకు సమాచారం అందేలా సాంకేతిక ఏర్పాట్లుంటాయి. దాంతో చెత్త నిండినట్లు తెలియగానే వెంటనే తరలిస్తారు. చెత్త ట్రక్‌లో వేసేందుకు సైతం ప్రత్యేక ఏర్పాట్లుంటాయి. ట్రక్‌లో ఉండే క్రేన్ డంపర్‌బిన్‌ను పైకి లేపుతుంది. డంపర్‌బిన్ నుంచి చెత్త మాత్రం ట్రక్‌లో పడుతుంది. తొలిదశలో ఎంపిక చేసిన వాణిజ్య ప్రాంతాల్లో 50 డబ్బాలను ఏర్పాటుచేయాలనుకున్నారు. ఇందుకుగాను దాదాపు రూ. 2.5 కోట్లు ఖర్చు కాగలదని అంచనా. వీటి వల్ల మానవ శ్రమ చాలా వరకు తగ్గుతుంది.తొలి దశలో సెంట్రల్‌జోన్ పరిధిలోని ఖైరతాబాద్ నియోజకవర్గంలో వీటిని ఏర్పాటు చేయాలని భావించిన అధికారులు బుధవారం జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద స్థలాన్ని పరిశీలించారు. సర్కిల్ 10–బి ఏఎంఓహెచ్, ట్రాన్స్‌పోర్ట్ ఇంజినీర్లు, అర్బన్ గ్రీన్‌సిటీ సంస్థకు చెందిన ప్రతినిధులు స్థలాన్ని పరిశీలించిన వారిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment