అంతా చెత్తమయం | Greater cities stored more dust all over areas | Sakshi
Sakshi News home page

అంతా చెత్తమయం

Published Thu, Jul 9 2015 1:46 AM | Last Updated on Tue, Oct 16 2018 7:36 PM

అంతా చెత్తమయం - Sakshi

అంతా చెత్తమయం

* రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మె ఉధృతం
* పట్టణాల్లో పేరుకుపోతున్న టన్నుల కొద్దీ చెత్త
* చెత్తకుండీలు నిండి రోడ్లపాలవుతున్న వ్యర్థాలు
* మంత్రులు, కార్మిక నేతల రెండో దఫా చర్చలూ విఫలం
* సమ్మె కొనసాగిస్తామని కార్మిక నేతల ఉద్ఘాటన

 
రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్‌ను చెత్త ముంచెత్తింది. ‘గ్రేటర్’ వరంగల్ చెత్తమయమైంది. చిన్నాపెద్ద నగరాలు, పట్టణాలు మురికి కూపాలయ్యాయి. అంతటా టన్నుల కొద్దీ చెత్త పేరుకుపోయింది. చెత్త కుండీలు, డంపర్ బిన్‌లు నిండి వ్యర్థాలు రోడ్లు, వీధులను ఆక్రమిస్తున్నాయి. పారిశుద్ధ్య పరిరక్షణ కోసం రాత్రింబవళ్లు చెమటోడ్చే కార్మికులు చేపట్టిన సమ్మెతో రెండు రోజుల్లోనే పట్టణ పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. మరోవైపు సమె విరమణ కోసం ప్రభుత్వ ప్రయత్నాలు మళ్లీ విఫలమయ్యాయి. దీంతో సమ్మెను విరమించే ప్రసక్తే లేదని, ఆందోళనలను ఉధృతం చేస్తామని కార్మిక ఐక్య సంఘాలు పునరుద్ఘాటించాయి.
 
 సాక్షి, హైదరాబాద్: కనీస వేతనాల పెంపుతోపాటు 16 డిమాండ్ల సాధన కోసం మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులు చేపట్టిన సమ్మె మంగళవారంతో మూడో రోజుకు చేరుకుంది. ఫలితంగా జీహెచ్‌ఎంసీతోపాటు రాష్ట్రంలోని 67 నగర, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలపై సమ్మె ప్రభావం తీవ్రంగా పడింది. రెండు రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు విధులను బహిష్కరించడంతో పట్టణాల్లో కుప్పలుతెప్పలుగా చెత్త పేరుకుపోతోంది. కార్మికులతో సమ్మె విరమింపజేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో ప్రతిష్టంభన తొలగిపోలేదు. రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి మంగళవారం మధ్యాహ్నం సచివాలయంలో కార్మిక సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులతో జరిపిన రెండో దఫా చర్చలూ విఫలమయ్యాయి. కార్మికుల డిమాండ్లపై చర్చ లేకుండానే ఈ భేటీ ముగిసింది.
 
 సమ్మెను విరమించి వస్తే చర్చలు జరుపుతామని మంత్రులు పేర్కొనగా అందుకు కార్మిక నేతలు ససేమిరా అన్నారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మెను విరమించే ప్రసక్తే లేదని చర్చల అనంతరం కార్మిక నేతలు ఉద్ఘాటించారు. ‘మా చేతుల్లో ఏమీ లేదు. మేము చర్చించలేం, సీఎం వస్తేనే మాట్లాడతామని మంత్రులు పేర్కొన్నారు. డిమాండ్ల పరిష్కారంపై మంత్రులు ఏ ప్రతిపాదన చేయలేదు. సమ్మె విరమిస్తేనే చర్చలు జరుపుతామన్నారు. దీనిని మేము అంగీకరించం’ అని చెప్పారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోనే ఉన్నప్పటికీ ఆయన అందుబాటులో లేరని కాలయాపన చేయడం తగదన్నారు. సమ్మెను ఉధృతం చేసేందుకు బుధవారం నుంచి జిల్లా, డివిజన్ స్థాయిల్లో ఆందోళనలు చేపడుతామన్నారు.
 
 సమ్మెలో టీఆర్‌ఎస్‌కేవీ...
 అధికార పార్టీ టీఆర్‌ఎస్ అనుంబంధ కార్మిక సంఘం టీఆర్‌ఎస్‌కేవీ సైతం బుధవారం నుంచి మున్సిపల్ కార్మికుల సమ్మెలో పాల్గొననుంది. టీఆర్‌ఎస్‌కేవీ-జీహెచ్‌ఎంఈయూ నేతలు మంగళవారం ఈ మేరకు ప్రకటన చేశారు. గత రెండు రోజులుగా సమ్మెలో పాల్గొంటున్న సీఐటీయూ, ఏఐటీయూసీ, బీఎంఎస్, హెచ్‌ఎంఎస్, ఐఎఫ్‌టీయూ, ఏఐయూటీయూసీ, టీఎన్‌టీయూసీల నేతృత్వంలోని జేఏసీ కార్మికుల కనీస వేతనాన్ని రూ. 14,170కు పెంచాలని డిమాండ్ చేస్తుండగా టీఆర్‌ఎస్‌కేవీ మాత్రం ఆ మొత్తాన్ని రూ.16,500కు పెంచాలని డిమాండ్ చేస్తోంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement