వికలాంగుల పరికరాలకు కాళ్లొచ్చాయ్..! | corruption in handicapped instrument distribution | Sakshi
Sakshi News home page

వికలాంగుల పరికరాలకు కాళ్లొచ్చాయ్..!

Published Wed, Jan 28 2015 9:00 AM | Last Updated on Sat, Sep 2 2017 8:25 PM

corruption in handicapped instrument distribution

వికలాంగులకు ఉపయోగపడాల్సిన ఉపకరణాలకు కాళ్లొచ్చాయి. లబ్థిదారులకు అందాల్సిన పరికరాలు అందకుండా పోతున్నాయి. ఇలా పక్కదారి పట్టినవాటి విలువ సుమారు రూ.33 లక్షల వరకూ ఉండవచ్చని అంచనా. వీటికి సంబంధించి అధికారులు స్పష్టమైన సమాచారం ఇవ్వకపోవడంతో వికలాంగులే సమాచార హక్కు చట్టం ద్వారా సంబంధిత వివరాలు తీసుకోవడంతో అసలు విషయం వెలుగుచూసింది.

వెలుగులోకి ఇలా...
జిల్లాలో  నాలుగు నియోజకవర్గాల్లో ఉపకరణాల కోసం ఎంపిక శిబిరాలు నిర్వహించి సంబంధిత వికలాంగులకు ఆయా శిబిరాల్లోనే పంపిణీ చేయాలి. ఈ నిబంధనలేవీ పాటించకుండానే పంపిణీ చేస్తుండడంతో లబ్థిదారుల్లో అయోమయ పరిస్థితి నెలకుంది. జిల్లాలో 2012లో వికలాంగులకు ఉపకరణాల నిమిత్తం ‘ఆర్టిఫిషియల్ లింబ్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ (ఆలింకో), ఆంధ్రప్రదేశ్ వికలాంగుల సహకార సంస్థ (ఎపివిసిసి) ఆధ్వర్యంలో చీరాల, అద్దంకి, పర్చూరు, సంతనూతలపాడు నియెజకవర్గాల్లో ఎంపిక శిబిరాలను నిర్వహించారు. ఆ శిభిరాల్లో గుర్తించిన వికలాంగుల కోసం 2013 డిసెంబర్ 14వ తేదీన 1021 ఉపకరణాలను 523 మంది లబ్థిదారులకు అందజేయాల్సిందిగా అలిమ్ కో సంస్థ జిల్లా వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖకు  సరఫరా చేసింది. వీటిలో మూడు చక్రాల సైకిళ్లు 211, వీల్‌చైర్లు 32, చంక కర్రలు 25, చేతి కర్రలు 4, వినికిడి యంత్రాలు 471, వీటికి సంబంధించిన బ్యాటరీలు 237, కృత్రిమ అవయవాలు 41 ఉన్నాయి. అయితే జిల్లా వికలాంగుల సహాయ సంచాలకుని కార్యాలయం మాత్రం 286 మంది లబ్థిదారులను గుర్తించింది. అనంతరం వికలాంగుల సహకార సంస్థ మూడు చక్రాల సైకిళ్లు 202, వీల్ చైర్లు 29, వినికిడి యంత్రాలు 45 వికలాంగులకు పంపిణీ చేసింది.

అవినీతి ఇలా...
అలింకో నుంచి  వికలాంగుల సంస్థకు వచ్చిన, పంపిణీ చేసిన పరికరాలను పరిశీలిస్తే పలు ఉపకరణాలు ఏమయ్యాయో కూడా అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఇవన్నీ అడ్డదారిన బయటకు వెళ్ళినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వీటికి సంబంధించిన వివరాలు కూడా సంబంధితాధికారుల వద్ద కూడా లేకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఆలింకో సంస్థ సరఫరా చేసిన 1021 ఉపకరణాలను, గుర్తించిన 523 మంది లబ్థిదారులకు పంపిణీ చేసినట్టుగా వికలాంగుల సంక్షేమ శాఖ చెబుతుండగా సమాచార హక్కు చట్టం కింద సేకరించిన వివరాల ప్రకారం వికలాంగు సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు, ఎ.పి.వి.సి.సి. ప్రతినిధులు 286 మందిని గుర్తించి 276 ఉపకరణాలను పంపిణీ చేసినట్లు చెబుతున్నారు.

దీనిప్రకారంఆలింకో సరఫరా చేసిన ఉపకరణాల సంఖ్యకు, వికలాంగుల సహకార సంస్థ పంఫిణీ చేసిన సంఖ్యకు మధ్య వ్యత్యాసం కనిపిస్తోంది. ఆలింకో సంస్థ 2013, డిసెంబర్ 14న అద్దంకిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అప్పటి ఎం.పి.పనబాక లక్ష్మీ ఆధ్వర్యంలో ఉపకరణాల పంపిణీని ప్రారంభించి కొన్నింటిని వికలాంగులకు పంపిణీ చేసి, మిగిలిన పరికరాలను సహకార సంస్థకు అప్పజెప్పింది. ఈ విషయాన్ని కుడా సమాచార హక్కు చట్టం కింద ధ్రువీకరించారు. అద్దంకిలోని మార్కెట్ యార్డు గౌడౌన్‌లో భారీ సంఖ్యలో మూడు చక్రాల సైకిళ్లు తుప్పుపట్టాయి. ఈ విషయాన్ని అదే నెలలో 'సాక్షి' వెలుగులోకి తేవడంతో అధికారులు వాటిని అక్కడ నుంచి తరలించారు గానీ పంపిణీకి శ్రీకారం చుట్టలేదు. మిగిలిన పరికరాలు ఏమయ్యాయో కూడా అర్థం కాని పరిస్థితి. ఈ విషయంపై సంబంధితాధికారులను ప్రశ్నించినా మౌనమే సమాధానంగా వస్తోంది.

Advertisement
Advertisement