ఫైలు కదలాలంటే .. పైసలివ్వాల్సిందే! | Corruption In Kurnool RDO Office | Sakshi
Sakshi News home page

ఫైలు కదలాలంటే .. పైసలివ్వాల్సిందే!

Published Thu, May 17 2018 12:06 PM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM

Corruption In Kurnool RDO Office - Sakshi

కర్నూలు ఆర్డీఓ కార్యాలయం

కోడుమూరు పట్టణంలోని ఒక రేషన్‌ షాప్‌నకు  బీసీ–డీ రిజర్వేషన్‌ వచ్చింది. దానికి బీసీ–ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పోటీపడ్డాడు. ఇందుకోసం ఏకంగా కర్నూలు ఆర్డీఓ కార్యాలయం నుంచి బీసీ–డీ సర్టిఫికెట్‌ తెచ్చుకున్నాడు. కార్యాలయంలో రూ.25 వేలు లంచం తీసుకుని సర్టిఫికెట్‌ ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. ఆర్డీఓ కార్యాలయంలో లంచాల బాగోతానికిఇదొక నిదర్శనం మాత్రమే.

కర్నూలు సీక్యాంప్‌ : కర్నూలు రెవెన్యూ డివిజనల్‌ అధికారి (ఆర్డీఓ) కార్యాలయం అవినీతికి కేరాఫ్‌ అడ్రెస్‌గా మారింది. ఇక్కడ పైసలివ్వందే ఏ పనీ జరగడం లేదని ప్రజలు, రైతులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. బల్ల కింద చేయిపెడితేనే బల్ల మీద ఫైలు ముందుకు కదులుతుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాధితుడు రోగి అయినా, దివ్యాంగుడైనా, చివరకు ఎన్ని కష్టాల్లో ఉన్నా.. కార్యాలయ సిబ్బంది కనికరం చూపడం లేదు. ‘మీ ఇబ్బందులతో మాకేంటి?! మాకివ్వాల్సింది ఇస్తేనే పని అవుతుంద’ని తెగేసి చెబుతున్నారు.  ఈ ఏడాది ఫిబ్రవరిలో గోనెగండ్ల మండలానికి చెందిన ఒక మహిళా డీలర్‌ చనిపోయారు. డీలర్‌షిప్‌ను ఆమె భర్త పేరుపై మార్చాలని కోరగా.. కార్యాలయంలోని ఓ అధికారి రూ.30 వేలు డిమాండ్‌ చేశారు. తనకు పక్షవాతం ఉందని, ఇబ్బందుల్లో ఉన్నానని సదరు వ్యక్తి వేడుకున్నా.. ఆ అధికారి కరుణ చూపలేదు. ‘నీకు ఎన్ని రోగాలు ఉన్నా మాకు అనవసరం. అడిగిన మొత్తం ఇస్తేనే నీ పేరుమీద మారుస్తా’ అంటూ తెగేసి చెప్పినట్లు సమాచారం. బాధితుడు దాదాపు ఆరు నెలల పాటు కార్యాలయం చుట్టూ తిరిగినా పని కాలేదు. కనీసం నడవలేని స్థితిలో ఉన్న ఆ వ్యక్తి చివరకు అప్పుచేసి అడిగింది సమర్పించుకున్నాడు.

ఆ వెంటనే పని పూర్తయ్యింది. ఈ ఏడాది మార్చిలో మీ–సేవ కేంద్రం కోసం కర్నూలు నగరానికి చెందిన ఓ దివ్యాంగుడు దరఖాస్తు చేసుకున్నాడు. వైకల్యం ఉండడంతో త్వరగానే అనుమతి వచ్చింది. అయితే.. ఆ సర్టిఫికెట్‌ ఇచ్చేందుకు ఆర్డీఓ కార్యాలయంలో రూ.40 వేలు లంచం అడిగారు. నానా అగచాట్లు పడి ఆ మొత్తాన్ని ఇచ్చుకోవాల్సి వచ్చింది. రేషన్‌ షాప్‌ పనులకు రూ.20 వేల నుంచి రూ.25 వేలు, బర్త్‌ సర్టిఫికెట్‌కు రూ.5 వేలు, మీ–సేవ కేంద్రానికి రూ.40 వేలు, ప్రార్థనా మందిరాలకు అనుమతి ఇవ్వడానికి రూ.15 వేలు.. ఇలా ప్రతి పనికీ ఓ రేటు పెట్టి జనాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కర్నూలు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 20 మండలాలు ఉన్నాయి. ఈ మండలాల నుంచి వివిధ పనుల నిమిత్తం ప్రజలు, రైతులు నిత్యం కార్యాలయానికి వస్తుంటారు. వీరిని మామూళ్ల కోసం పీడిస్తుండడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. పైగా ఏడాదికేడాది ‘రేటు’ మారిపోతోంది. తక్కువ మామూళ్లు ఇచ్చేందుకు వస్తే.. ‘అది కిందటి ఏడాది రేటు. ఇప్పుడు పెరిగిపోయింది’ అంటూ నిర్మోహమాటంగా చెబుతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. పైగా తాము లంచం అడిగినట్లు బయట చెబితే శాశ్వతంగా పని ఆపేస్తామని బెదిరిస్తున్నారని వాపోతున్నారు. వారు అడిగింది ఇచ్చుకోలేక, బయట చెప్పుకోలేక బాధితులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు.  

సబ్‌డివిజన్‌ జాప్యం చేస్తున్నారు: కర్నూలు మండలం రుద్రవరం గ్రామ సర్వే నంబర్‌– 507లో నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. సబ్‌డివిజన్‌ చేయమని  2012 నుంచి అడుగుతున్నా.. ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది పట్టించుకోవడంలేదు. రూ.20 వేలు అవుతుందని చెప్పడంతో కంగుతిన్నా. మా పొలంలో హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలు వెళ్లాయి. దీంతో ప్రభుత్వం నాకు రూ.90 వేలు ఇస్తుంది. అయితే.. నా పొలం సబ్‌డివిజన్‌ చేయకపోవడంతో ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు ఆగిపోయాయి.  -నారాయణ నాయక్, రుద్రవరం
 
నా దృష్టికి తెస్తే చర్యలు:   మా కార్యాలయంలో లంచం తీసుకోవడం లాంటి పనులు సిబ్బంది చేయరు. ఒకవేళ లంచం అడిగితే నా దృష్టికి తీసుకురండి. వారిపై వెంటనే చర్యలు తీసుకుంటాం.- హుసేన్‌ సాహెబ్, ఆర్డీఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement