గోడౌన్ల వద్ద సంచరిస్తున్న కోతులు
మచిలీపట్నంలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ గిడ్డంగుల్లో అవినీతి కోతులుపడ్డాయి. ఏటా కోటి రూపాయల విలువైన బియ్యాన్ని భుజిస్తున్నాయి. గిడ్డంగుల మరమ్మతులకు ఏటా విడుదలవుతున్న లక్షల రూపాయలను స్వాహా చేస్తున్నాయి. గిడ్డంగులను ఉన్నతాధికారులు తనిఖీ చేసి రికార్డులను పరిశీలించకపోవడంతో అవినీతి కోతుల బియ్యం మేతకు అంతే లేకుండా పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
మచిలీపట్నం సబర్బన్ (మచిలీపట్నం): మనుషులే కాదు కోతులు సైతం బియ్యం తింటాయని నిరూపించారు మచిలీపట్నంలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ గిడ్డంగుల అధికారులు. ఏడాదికి పదో ఇరవయ్యో మూటలు తింటున్నాయంటే నమ్మోచ్చు. ఏకంగా ఏడాదికి కోటి రూపాయల బియ్యం తింటున్నాయంటూ రికార్డుల్లో రాసి, ఆ మొత్తాన్ని వారే భుజిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ తంతుకు ఉన్నతాధికారుల అండదండలు పుష్కలంగా ఉండటంతో అక్రమ వ్యవహారం మూడు మూటలు. ఆరు లారీల చందంగా మారింది.
ఏం జరుగుతోందంటే..!
మచిలీపట్నం శివారు చిలకలపూడి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న సీడబ్ల్యూసీలో మొత్తం 10 బియ్యం గిడ్డంగులు ఉన్నాయి. పౌరసరఫరాల, ఎఫ్‌సీఐ శాఖలు మిల్లర్ల నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని లారీల్లో తీసుకొచ్చి ఇక్కడ నిల్వ చేస్తాయి. 90 శాతం నిల్వలు పౌరసరఫరాల శాఖ, మిగిలిన పది శాతం ఎఫ్‌సీఐ నిల్వ ఉంచుతున్నాయి. ఈ బియ్యాన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండానే ఆయా శాఖలు ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు, జిల్లాలోని ఎంఎల్‌ఎస్ పాయింట్‌లకు సరఫరా చేస్తారు. అక్కడి నుంచి ఇదే బియ్యం చౌక దుకాణాల ద్వారా సబ్సిడీపై ప్రజలకు చేరుతోంది.
స్వాహా పర్వం ఇలా..
49,030 టన్నుల సామర్థ్యం గల ఈ గిడ్డంగుల్లో పౌరసరఫరాల శాఖ ఏడాదికి సుమారు 55 వేల టన్నులు, ఎఫ్‌సీఐ 25 వేల టన్నుల బియ్యం నిల్వ ఉంచుతాయి. 50 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ గిడ్డంగులు మరమ్మతులకు గురయ్యాయి. ఫ్లోర్లింగ్, తలుపులు, శ్లాబ్ రేకులు, వెంటిలేటర్ మెస్‌లు పూర్తిగా దెబ్బతిన్నాయి. మరమ్మతులకు గత ఏడాది సంబంధిత కార్పొరేషన్ రూ.15 లక్షలు, ఈ ఏడాది రూ.6 లక్షలు చేసిందని అధికారులు తెలిపారు. అయితే మరమ్మతులు చేసిన దృశ్యాలు కనిపించకపోవడం సిబ్బంది అక్రమాలను బహిర్గతం చేస్తోంది.
కోతుల పేరిట మేత
పట్టణ శివారున ఉన్న ఈ గిడ్డంగుల వద్ద కోతులు సంచరిస్తుంటాయి. సుమారు 100 కోతులు ఉన్నట్లు అక్కడ సిబ్బంది చెబుతున్నారు. శ్లాబ్ రేకులు, డోర్‌లు, వెంటిలేటర్‌లకు మరమ్మతులు చేయకపోవడంతో వాటిల్లో నుంచి గిడ్డంగుల్లోకి కోతులు ప్రవేశించి బియ్యాన్ని భుజిస్తుంటాయి. ఈ కోతులే ప్రస్తుతం అధికారులకు ఆదాయన వనరుగా మారాయి. ఈ కోతులే లేకపోతే బియ్యం తరుగు చూపడం కష్టమవుతుందని భావించిన సిబ్బంది గిడ్డంగులకు మరమ్మతులు చేయడం లేదనే అరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో కోతి 50 కిలోల సంచి నుంచి రోజూ కిలో బియ్యం తింటున్నట్లు అధికారులు లెక్కలు చూపిస్తున్నారని విశ్వశనీయ సమాచారం. వంద కోతులు ఉన్నాయని చెబుతున్న అధికారులు రోజు క్వింటా చొప్పున తింటున్నట్లు లెక్కలు రాస్తుండటం గమనార్హం.
ఈ గిడ్డంగుల్లో సుమారు ఏడాదికి 16 లక్షల బస్తాల(50 కిలోలు) దిగుమతి, ఎగుమతి జరుగుతోంది. నిత్యం అందులో 40 శాతం నిల్వలు ఉంటాయి. ప్రభుత్వం పేదలకు రేషన్ డిపోల ద్వారా కేజీ బియ్యాన్ని ఒక రూపాయికే ఇస్తుంది. అయితే ప్రభుత్వం ఇదే బియ్యాన్ని మిల్లర్‌ల నుంచి రూ.23లకు కొని సబ్సిడీపై రూపాయికి అందజేస్తుంది. గిడ్డంగుల సిబ్బంది అక్రమాల శృతిమించడంతో ప్రభుత్వానికి ప్రతి ఏడాది రూ.కోట్లలో నష్టం వాటిల్లుతోందని అక్కడ పని చేసే సిబ్బందే చెబుతున్నారు. ఈ గిడ్డగుల్లోని రికార్డులను, గిడ్డంగులను ఉన్నతాధికారులు తనిఖీలు చేయకపోవడం వల్లే అవినీతి పెరిగిపోతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
కోతులు తింటున్న మాట వాస్తవమే
కోతులు బియ్యం తింటున్న మాట వాస్తవమే. వాటి వల్ల తీరని నష్టం జరుగుతోంది. అయితే నష్టాన్ని అంచానా వేయలేదు. నష్టానికి సంబంధించి రికార్డుల్లో ఎంత రాస్తున్నారో నాకు తెలియదు. రోజూ ఒక్కో కోతి అర కేజీ నుంచి కేజీ వరకు తింటోంది. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చాం. గతంలో కొన్ని మరమ్మతులు చేశారు. మిగిలిన గిడ్డంగుల మరమ్మతులకు నిధులు మంజూరయ్యాయి. త్వరలో గిడ్డంగులకు మరమ్మతులు చేయిస్తాం. –నాగేశ్వరరావు, మేనేజర్, సీడబ్ల్యూసీ గిడ్డంగులు
Comments
Please login to add a commentAdd a comment