ఆస్పత్రిలోని గైనిక్ వార్డులో ఉన్న బాలింతలు
సాక్షి, అనంతపురం న్యూసిటీ: సర్వజనాస్పత్రిలో కొందరు సిబ్బంది.. సేవలకు రేటు కట్టారు. ఒక్కోసేవకు రేటు ఫిక్స్ చేసి ఇక్కడికొచ్చేవారి జేబులు ఖాళీ చేస్తున్నారు. పేదలమని డబ్బులివ్వకపోతే...నోటికి పని చెబుతారు. అందరిముందే దుర్భాషలాడుతూ పరుపుతీస్తారు. అందుకే ధర్మాస్పత్రికి వచ్చేందుకే జనం జంకుతున్నారు.
సిబ్బందితోనే... ఇబ్బంది
సర్వజనాస్పత్రిలోని గైనిక్, లేబర్ వార్డు సిబ్బంది (వైద్యులు, స్టాఫ్‌నర్సులు కాదు) తీరుతో ఇక్కడికి ప్రసవాలకు వచ్చే మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిబ్బంది అడిగినంత ఇవ్వకపోతే పురిటి నొప్పుల కంటే ఇక్కడి సిబ్బంది పెట్టే టార్చరే ఎక్కువగా ఉంటుందని గర్భిణీలు, బాలింతలు వాపోతున్నారు. బాలింతలకు ‘జనని సురక్ష యోజన’ కింద ప్రభుత్వం ఇచ్చే డబ్బు కన్నా ముందే సిబ్బందికి రూ.1,500 వరకు ముట్టజెప్పాల్సి వస్తోందంటున్నారు.
రూ.500 సరిపోదమ్మా
‘‘సిజేరియన్ చేసిన వెంటనే బాబును శుభ్రం చేశాం. మరీ రూ.500 ఇస్తే ఏం సరిపోతుంది. మేము చాలా మందిమి ఉన్నాం...’’ అని వైద్యసిబ్బంది డిమాండ్ చేస్తున్నారని రాప్తాడు మండలం గొందిరెడ్డి పల్లికి చెందిన బాలింత సునీత వాపోయింది. ఆమెకు జూన్ 25న ఆస్పత్రిలోని లేబర్ వార్డులో సిజేరియన్ చేయగా...ఇక్కడి సిబ్బంది డబ్బుకోసం ఇబ్బంది పెట్టారని చెబుతోంది. ఇక స్ట్రెచ్చర్ నుంచి గైనిక్ వార్డుకి తీసుకొచ్చినందుకు రూ 100, చీర మార్చినందుకు రూ 100, కుట్లు శుభ్రం చేస్తున్నందుకూ రూ.50 తీసుకుంటున్నారని సునీత తల్లి సుశీల చెబుతున్నారు.
ప్రసవం అయ్యాక శిశువును శుభ్రం చేయాలంటే.. రూ.500
బాలింతను స్ట్రెచ్చర్‌పై గైనిక్ వార్డుకు తీసుకొస్తే.. రూ 100
చీర మార్చినందుకు.. రూ 100
కుట్లు శుభ్రం చేస్తున్నందుకు.. రూ.50
కుట్లు విప్పేందుకు.. రూ. 200
వీల్‌చైర్‌లో అంబులెన్స్ వరకూ తీసుకెళ్తే.. రూ.100
ఇదేదో కార్పొరేట్ ఆస్పత్రుల్లో సేవలకు చేసే చార్జ్ కాదు.. మన సర్వజనాస్పత్రిలోనే రోగుల నుంచి సిబ్బంది ముక్కు పిండి వసూలు చేస్తున్న మొత్తం. అడిగినంత ఇవ్వకపోతే ఇక బూతులే.
డబ్బులివ్వకపోతే నరకమే!
సర్వజనాస్పత్రికి వచ్చే వారంతా నిరుపేదలే. అందకూ కూలినాలి పనులు చేసుకునేవారే. అలాంటి వారినీ ఆస్పత్రిలోని లేబర్, గైనిక్ విభాగంలోని సిబ్బంది పీడిస్తున్నారు. ఆస్పత్రిలోని లేబర్‌వార్డులో రోజూ 30 నుంచి 40 ప్రసవాలు జరుగుతుండగా... వీటితో 10 నుంచి 12 సిజేరియన్లు ఉంటాయి. సిజేరియన్ అయిన వారి నుంచి సిబ్బంది భారీగా వసూలు చేస్తున్నారు. పైగా ఆమాత్రం ఇవ్వలేనోళ్లు కడుపెందుకు తెచ్చుకోవాలని నీచంగా మాట్లాడుతున్నట్లు గర్భిణులు వాపోతున్నారు.
చీర మారిస్తే రూ.50
ప్రతి దానికి యాభైలు, వందలు. మేము యాడనుంచి తీసుకురావాలి. మా కోడలు అశ్వినికి పొద్దున్నే డ్రస్ మార్చాలంటే రూ.50 ఇస్తేనే చేస్తామంటారు. ఆ డబ్బుల్లేకనే గదా గవర్నమెంట్ ఆస్పత్రికి వచ్చింది. ఉన్నోళ్లుంటారు.. పూట గడవనోళ్లు ఉంటారు... లేనోళ్లను ఇబ్బంది పెట్టకండయ్యా. మీకు దండం పెడతాం.
– ఆదెమ్మ, దంతలూరు, బీకేఎస్
మగబిడ్డ పుట్టాడు కదా... ఆ మాత్రం ఇవ్వలేవా..?
‘‘మగ బిడ్డ పుట్టాడు కదా...? ప్రసవమైనప్పుడు ఏమీ ఇవ్వలేదు. కనీసం బిడ్డను శుభ్రం చేసిన దానికి, యూరిన్ పైప్ వేసినందుకైనా డబ్బులివ్వు’’ అని అడుగుతున్నారని కూడేరు మండలం కలగళ్ల గ్రామానికి చెందిన బాలింత ఆదిలక్ష్మి వాపోయింది. ఆమె జూన్ 25న ప్రసవం కాగా..డబ్బుకోసం సిబ్బంది తీవ్రంగా ఇబ్బంది పెట్టారని కన్నీటిపర్యంతమయ్యింది. డబ్బులివ్వకుంటే అందరి ముందే దూషిస్తున్నారని, పరువు పోతుందని భావించి డబ్బులిస్తున్నామని చెబుతోంది. కూలి పనులు చేసుకునే తమ లాంటి పేదోళ్లతో ఇలా డబ్బులు తీసుకోవడమేంటని ఆవేదన వ్యక్తం చేస్తోంది.
చర్యలు తీసుకుంటాం
ఆస్పత్రిలో వైద్య సేవలన్నీ ఉచితం. ఇక్కడ సిబ్బందికి చిల్లిగవ్వ ఇవ్వాల్సిన పనిలేదు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసినట్లయితే నా దృష్టికి తీసుకురావచ్చు. తప్పకుండా చర్యలు తీసుకుంటాం. త్వరలోనే గైనిక్, లేబర్ తదితర విభాగాల వైద్యులు, సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి ఇలాంటి వాటికి ఫుల్‌స్టాప్ పెడతాం.
– డాక్టర్ బాబూలాల్, ఆస్పత్రి సూపరింటెండెంట్
Comments
Please login to add a commentAdd a comment