పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీసు సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులు ఖాకీ సినిమా తిలకించాలని ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ నిర్ణయించారు. నగరంలో ఓ సినిమా థియేటర్ ఉచిత ప్రదర్శన ఏర్పాటు చేయించారు. పోలీసుల్లో సత్ప్రవర్తన, ఉద్యోగం విలువ పెంచేందుకు ఎస్పీ రెండేళ్లుగా ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. అయితే క్షేత్రస్థాయి సిబ్బందిలో ఏమాత్రం పరివర్తన రాకపోగా ఎస్పీ తీసుకున్న చర్యలు నిష్ప్రయోజనంగా మారుతున్నాయి. ఇటీవల వివాదాస్పద ఖాకీల తీరే ఇందుకు నిదర్శనంగా మారుతోంది.
అనంతపురం సెంట్రల్: క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే పోలీసుశాఖలో కొంతమంది సిబ్బంది పెడదారి పడుతున్నారు. పోలీసులమనే ధీమాతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారు. తాజాగా అనంతపురంలోని ఓబుళదేవనగర్‌లో కదిరి సీసీఎస్ ఎస్‌ఐ దాదాపీర్, ఆయన కుమారుడు కలిసి వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకుడు రాజేష్‌పై కత్తితో దాడి చేయడమే ఇందుకు నిదర్శనం. ఎస్‌ఐ దాదాపీర్ ఇంట్లో రాజేష్ ఆరేళ్లుగా అద్దెకు ఉంటున్నాడు. నచ్చకపోతే గడువు ఇచ్చి ఖాళీ చేయాలని చెప్పాలి. అంతేకానీ ఎస్‌ఐనన్న ధీమాతో ఉన్నపళంగా ఇల్లు ఖాళీ చేయాలని, లేదంటే సామాన్లు బయటకు పడేస్తానని బెదిరించాడని బాధితుడు వాపోయాడు. ప్రశ్నించినందుకు ఏకంగా కత్తితో దాడి చేశారని, అదృష్టవశాత్తు తప్పించుకున్నానని తెలిపాడు. చట్టం తెలిసిన ఎస్‌ఐనే కత్తితో దాడి చేసే పరిస్థితికి రావడం గమనార్హం.
♦ ఇటీవల అనంతపురం వన్‌టౌన్‌లో ఏఎస్‌ఐగా పనిచేస్తూ ఎస్‌ఐగా పదోన్నతి పొందిన సాయినాథ్‌ప్రసాద్ తన భార్యపై విచక్షణా రహితంగా దాడి చేశారు. అర్దరాత్రి తీవ్రస్థాయిలో గొడవ జరుగుతుండడంతో స్థానికులు సీఎం పేషీకి ఫిర్యాదు చేశారు. వెంటనే డయల్ 100 ద్వారా జిల్లా పోలీసులను అప్రమత్తం చేయడంతో అర్ధరాత్రి టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసినప్పటికీ ఉద్యోగానికి ఇబ్బంది వస్తుందన్న ఉద్దేశంతో కుటుంబ సభ్యులు రాజీ అయ్యారు. భార్య తలకు కుట్లు పడేలా దాడి చేయడంపై పోలీసు వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
♦ నగరంలో ఓ పోలీస్‌స్టేషన్‌లో పనిచేసే హెడ్‌కానిస్టేబుల్ పంచాయితీల్లో ఆరితేరిపోయాడు. రూ.కోట్లు వెచ్చించి బహుళ అంతస్తుల భవనం నిర్మిస్తున్నాడు. అవినీతి సొమ్ముతోనే ఇదంతా సాధ్యమనే అభిప్రాయం పోలీసు వర్గాల నుంచే వ్యక్తమవుతోంది.
♦ నాల్గవ పట్టణ పోలీసుస్టేషన్‌లో పనిచేసే కానిస్టేబుల్ నారాయణస్వామి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని సింధూర బార్‌లో మద్యం తాగి బీభత్సం చేశాడు. దీనిపై బాధితులు ఫిర్యాదు చేయడంతో కానిస్టేబుల్‌ను ఎస్పీ సస్పెండ్ చేశారు.
♦ అంతకు ముందు వన్‌టౌన్ సీఐ విజయభాస్కర్‌గౌడ్ హౌసింగ్‌బోర్డులోని ఓ మద్యం షాపులో మందుబాబులు రోడ్డుకు అడ్డంగా వాహనాలు పార్కింగ్ చేశారనే కారణంతో బూటుకాళ్లతో తన్నడం వివాదాస్పదమైంది.
♦ ఇలాంటి ఘర్షణలతో పాటు పోలీసుస్టేషన్‌లోలలో సివిల్ పంచాయితీలు చేస్తున్న పోలీసు సిబ్బంది సంఖ్య నానాటికీ అధికమవుతోంది. పంచాయితీలు బెడిసికొట్టి చిన్నా చితక బయటకు వస్తున్నా లోలోపల సెటిల్‌మెంట్స్ అవుతున్న వాటి సంఖ్య గణనీయంగా ఉంది. అలంకార ప్రాయానికి మాత్రమే ‘సివిల్ పంచాయితీలు చేయబడవు’ అని బోర్డులు వేశారని, చేసేవన్నీ దుప్పటి పంచాయితీలేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసు సిబ్బంది చేతిలో నష్టపోయిన వారు ఫిర్యాదులు చేస్తున్నా అవి ఎఫ్‌ఐఆర్ రూపం దాల్చడం లేదు. ఒకటే శాఖ కావడంతో వెనుకేసుకొస్తున్నారనే విమర్శలున్నాయి.
♦ తాజాగా ఎస్‌ఐ దాదాపీర్ విషయంలో ఇదే జరిగింది. తనపై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడని, ఆరు కుట్లు పడ్డాయని బాధితుడు రాజేష్ ఫిర్యాదు చేశాడు. అయితే దీనిపై పెట్టీ కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పార్టీ కండువాలు వేసుకొని పనిచేస్తున్న పోలీసు అధికారులు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా తాడిపత్రి, రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాలోన్ని కొంతమంది పోలీసులు అధికారులు అధికారపార్టీ నేతల చెప్పుచేతల్లో పనిచేస్తున్నారు. వారు ఆడమన్నట్లు ఆడుతూ ఏకపక్షంగా విధులు నిర్వహిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఖాకీ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment