బినామీ పేర్లతో పనుల పందేరం
► టెండర్లు లేకుండా రూ.74.31లక్షలు ఖర్చు
► అక్రమార్కులపై చర్యలు తీసుకోకుండా.. కొనసాగింపు
► పట్టనట్టు వ్యవహరిస్తున్న యూనివర్సిటీ ఉన్నతాధికారులు
జేఎన్‌టీయూ : జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న సివిల్ ఇంజినీరింగ్ పనుల్లో అక్రమాలకు పాల్పడుతున్నారు. అభివృద్ధి మాటున లక్షలాది రూపాయలు దారి మళ్లిస్తున్నారు. బినామీ పేర్లతో టెండర్లు కట్టబెట్టి పనులు చేయిస్తున్నారు. నిబంధనలన్నీ పక్కనబెట్టి అయినవారికి పనులు అప్పగించేస్తున్నారు. అయినా తమకేమీ పట్టనట్టు వర్సిటీ ఉన్నతాధికారులు ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ధారాళంగా ఖర్చు పెట్టినా..
క్యాంపస్ కళాశాలలో రూ.50 వేలు పైబడి చేసే ఏ అభివృద్ధి పనికైనా తప్పనిసరిగా టెండర్లు పిలవాలి. వీటిని కూడా వర్సిటీలోని డిక్స్ (డెరైక్టర్ ఆఫ్ ఇండస్ట్రియల్ కన్సల్టెన్సీ సర్వీసెస్) పర్యవేక్షణలో జరగాల్సి ఉంది. జేఎన్‌టీయూ క్యాంపస్ కళాశాలలోని ఇద్దరి టెక్నికల్ అసిస్టెంట్లకు డీఈ (సివిల్), ఏఈ (ఎలక్ట్రికల్) పోస్టులను అదనంగా కేటాయించారు. అంటే టెక్నికల్ అసిస్టెంట్లు గాను, డిప్యూటీ ఇంజినీర్, ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గాను ఏకకాలంలో వ్యవహరించే వెసులుబాటు కల్పించారు. అయినప్పటికీ డిక్స్ పర్యవేక్షణలో విధులు నిర్వహించాలి. కానీ ఇవేవీ పట్టనట్టు జేఎన్‌టీయూ క్యాంపస్ కళాశాల ప్రిన్సిపల్, సివిల్ డిప్యూటీ ఇంజినీర్ ఇష్టారాజ్యంగా అభివృద్ధిపనులు చేసుకొని బిల్లులు మంజూరు చేసుకున్నారు. ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి పనులు, పరికరాల కొనుగోళ్లకు సంబంధించి రూ.74.31 లక్షల బిల్లులు మంజూరు అయ్యాయి.
మీనమేషాలు లెక్కిస్తున్న ఉన్నతాధికారులు
జేఎన్‌టీయూ క్యాంపస్ కళాశాలలో అక్రమ మార్గాలలో పనులు చేస్తున్నట్లు తెలిసినప్పటికీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకుండా వారినే కొనసాగిస్తుండడంపై ఆరోపణలు వస్తున్నాయి. ఒక డిప్యూటీ ఇంజినీరు (టెక్నికల్ అసిస్టెంట్ అదనపు బాధ్యతలు ) లక్షలాది రూపాయలు నిబంధనలకు విరుద్ధంగా డ్రా చేస్తుంటే ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తుండడంపై వర్సిటీలో చర్చనీయాంశమైంది.