దోపిడీతోనే షురూ.. | Cotton, farmers relied on the market supply traders | Sakshi
Sakshi News home page

దోపిడీతోనే షురూ..

Published Thu, Oct 24 2013 3:36 AM | Last Updated on Fri, Sep 1 2017 11:54 PM

Cotton, farmers relied on the market supply traders

జమ్మికుంట, న్యూస్‌లైన్ : అనుకున్నట్లే అయింది. సీజన్ మార్కెట్ దోపిడీతోనే షురూ అయింది. పత్తిని, మార్కెట్‌ను నమ్ముకున్న రైతులను వ్యాపారులు నిండా ముంచారు. తొలిరోజే జమ్మికుంట మార్కెట్లో పత్తి రైతులను చిత్తు చేశారు. తేమ పేరుతో ధర తగ్గించి రైతులను అడ్డగోలుగా దోచుకున్నారు.
 
 కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి వివిధ గ్రామాల రైతులు ఉదయం తొమ్మిది గంటలకే 12 వేల బస్తాల పత్తి తీసుకువచ్చారు. 10 గంటల ప్రాంతంలో కొందరు వ్యాపారులు మార్కెట్‌కు వచ్చారు. నాణ్యత ప్రకారం నాలుగు రకాల ధరలు నిర్ణయించారు. నాణ్యత పత్తికి క్వింటాల్‌కు రూ.4,500 నిర్ణయించి, మిగతా పత్తికి రూ.3,500 నుంచి రూ.4,300 వరకు ఏబీసీడీ గ్రేడ్‌లుగా నిర్ణయించారు. 10 గంటలకే ధరలు పూర్తయి తూకాలు మొదలుకావాలని మంగళవారం జరిగిన మార్కెట్ సమావేశంలో నిర్ణయించుకోగా మధ్యాహ్నం ఒంటి గంటకు కూడా తూకాలు మొదలు కాలేదు.
 
 అసలు ఏం జరుగుతుందో అర్థం కాక రైతుల్లో అయోమయం నెలకొంది. వారు ఆందోళనకు సిద్ధమవుతుండగా టౌన్ సీఐ దాసరి భూమయ్య మార్కెట్‌కు చేరుకున్నారు. రైతులు ఆయనకు మొరపెట్టుకోగా వ్యాపారులకు ఫోన్ చేసి మార్కెట్‌కు రప్పించారు. రైతులను ఇబ్బంది పెట్టొద్దని, కొనుగోలు చేయాలని సూచించారు. అదే సమయంలో ఆర్డీవో చంద్రశేఖర్ మార్కెట్‌కు చేరుకునిచైర్మన్ చాంబర్‌లో వ్యాపారులతో రహస్యంగా చర్చలు జరిపారు. కొనుగోళ్లు జరిపించాలని సూచించారు. మొదట నిస్సహాయత వ్యక్తం చేసిన వ్యాపారులు తర్వాత ఒప్పుకుని కొనుగోలు ప్రారంభించారు.
 
 దోపిడీ జరిగిందిలా..
 తేమ పరికరాలు లేకుండా వ్యాపారులు చేతులతోనే పత్తి చూసి గ్రేడింగ్ నిర్ణయించారు. 12 వేల బస్తాల్లో 45 బస్తాలకు కూడా రూ.4,500 ధర చెల్లించలేదని రైతులు ఆరోపించారు. అధికంగా క్వింటాల్‌కు రూ.3,400 నుంచి రూ.3,700 వరకే చెల్లించారని రైతులు వాపోయారు. మార్కెట్‌ను నమ్ముకుని వస్తే నిండా ముంచారని, క్వింటాల్ పత్తికి రూ.800 నుంచి రూ.1500 వరకు నష్టపోయామని కన్నీటి పర్యంతమయ్యారు.
 
 వర్షం తెచ్చిన నష్టం
 ఓ వైపు వ్యాపారులు, అధికారుల చర్చలు సాగుతుండగానే మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో ఒక్కసారిగా వర్షం అందుకుంది. అధికారులు టార్పాలిన్లు అందించకపోవడంతో ఓపెన్‌యార్డులో ఉన్న 2వేల బస్తాలు తడిసి ముద్దయ్యాయి. అసలే ధర తక్కువ పెడుతున్నారనుకుం టే తడిసిన బస్తాలకు తూకంలో కిలో, రెండు కిలోల వరకు కోత పెట్టారని రైతులు వాపోయారు. అటు ధరల్లో ఇటు తూకంలో తమనే ముంచుతున్నారని ఆవేదన చెందారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement