‘దేశం’ దాష్టీకం
సాక్షి, గుంటూరు: అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ టీడీపీ నేతల దౌర్జన్యాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అనేక నియోజకవర్గాల్లో రేషన్ దుకాణాలను బలవంతంగా లాక్కున్నా అదేమని అడిగే అధికారే లేకుండా పోయారు. అనేక గ్రామాల్లో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతూ తిరిగి వారిపైనే ఎదురు కేసులు పెట్టిస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.
తాజాగా స్థానిక సంస్థల చైర్మన్ అభ్యర్థుల ఎన్నికకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. జిల్లాపరిషత్ చైర్మన్ గిరీతోపాటు, అత్యధిక మున్సిపాలిటీలను టీడీపీ కైవసం చేసుకుంది. దీంతో వీరి కన్ను ఎంపీపీ స్థానాలపై పడింది.
జిల్లాలోని అత్యధిక మండల పరిషత్ అధ్యక్ష స్థానాలను దక్కించు కోవాలనే అధికార మదంతో ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిస్తూ రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులను తమవైపుకు తిప్పుకునేందుకుకుట్రలు పన్నుతున్నారు.
వైఎస్సార్ సీపీ అత్యధిక ఎంపీటీసీలను గెలుచుకుని ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకున్న మండలాల్లో ఎవరూ టీడీపీ వైపు చూడకపోవడంతో ఏం చేయాలో తెలియక డబ్బు ఎర చూపుతూ ప్రలోభాలకు దిగుతున్నారు.
డబ్బుకూ లొంగకపోవడంతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. అదేమని అడిగితే ఎంపీటీసీల కుటుంబ సభ్యులపై కూడా దాడులకు దిగుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.
తమవైపు వస్తే రండి లేదంటే ఎన్నికలకు దూరంగా ఉండండంటూ హెచ్చరికలు చేస్తున్నారు.
జిల్లాలో ముగ్గురు వైఎస్సార్ సీపీ
ఎంపీటీసీ సభ్యుల కిడ్నాప్..
డబ్బు ఎర చూపినా, బెదిరించినా లొంగకపోవడంతో రెచ్చిపోయిన టీడీపీ నేతలు జిల్లాలో ముగ్గురు వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యులను కిడ్నాప్ చేశారు. రాత్రికి రాత్రి ఇళ్లల్లోకి చొరబడి తమ వారిని ఎత్తుకెళ్ళారని వైఎస్సార్ సీపీ నాయకులతో కలసి ఆ ఎంపీటీసీ సభ్యుల బంధువులు మంగళవారం హైదరాబాద్‌లో అడిషనల్ డీజీపీకి ఫిర్యాదు చేశారు.
కిడ్నాప్‌కు గురైన ముగ్గురు సభ్యుల్లో ఒకరు సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం పెదనెమిలిపురి-2 ఎంపీటీసీ సభ్యురాలు వేముల అంజలీదేవి కాగా, మరొకరు చిలకలూరిపేట మండలం యడవల్లి ఎంపీటీసీ సభ్యుడు గుంటుపల్లి శ్రీనివాసరావు, మురికిపూడి-2 ఎంపీటీసీ సభ్యుడు జమ్మలమడక శివరామకృష్ణ.
తన భర్త ద్విచక్ర వాహనంపై వస్తుండగా కొట్టి కిడ్నాప్ చేశారంటూ శ్రీనివాసరావు భార్య మల్లేశ్వరి చిలకలూరిపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కిడ్నాప్‌కు గురైన వారిలో ఒకరు శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు నియోజకవర్గానికి చెందిన వారుకాగా, మరొకరు రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నియోజకవర్గానికి చెందిన వారు కావడం శోచనీయం.