దాడి చేసింది ఉన్మాది కాదు... చైన్ స్నాచర్!
తిరుమల నడక దారిలో వెళ్తున్న భక్తులపై దాడి చేసింది ఉన్మాది కాదని చైన్ స్నాచర్గా అనుమానిస్తున్నట్లు టీటీడీ విజిలెన్స్ అధికారి హన్మంతు వెల్లడించారు. బంగారం, నగదు కోసమే ఆ దాడి చేసి ఉంటాడని తాము భావిస్తున్నామని తెలిపారు. దాడి నేపథ్యంలో పాత నేరస్థుల వివరాలు పరిశీలిస్తున్నామని చెప్పారు. అయితే ఉన్మాది దాడిలో గాయపడిన ఘటనలో దంపతులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని రుయా ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. అన్ని వైద్య పరీక్షలు నిర్వహించామని... అయితే 72 గంటల పాటు ఇద్దరూ అబ్జర్వేషన్లో ఉంచాలని తెలిపారు. అప్పడే ఆ దంపతుల ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత వస్తుందని వైద్యులు సాక్షి మీడియాకు వెల్లడించారు. భక్తులపై దాడి ఘటన దురదృష్ణకరమని టీటీడీ ఈవో ఎం.జి.గోపాల్ వెల్లడించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు తీవ్ర తరం చేసినట్లు తిరుపతి అర్భన్ ఎస్పీ రాజశేఖరబాబు వెల్లడించారు.
తిరుమలలో శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు తంజావూర్కు చెందిన గోవిందరాజస్వామి దంపతులు కాలినడక ఈ రోజు తెల్లవారుజామున కొండపైకి బయలుదేరారు. ఆ దంపతులు అక్కగార్ల గుడి సమీపంలోకి రాగానే 25 ఏళ్ల యువకుడు వారిపై అకస్మాత్తుగా కత్తితో దాడి చేశాడు. గోవిందరాజస్వామి భార్యపై కత్తితో దూసుకువచ్చాడు. ఆ క్రమంలో ఉన్మాదిని ఆమె భర్త గోవిందరాజస్వామి అడ్డుకోబోయాడు. దాంతో ఆగ్రహించిన ఉన్మాది గోవిందరాజస్వామి గొంతు కోశాడు. ఆ తర్వాత అతడి భార్యపై దాడి చేశాడు.ఆ ఘటనలో దంపతులు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఉన్మాది అక్కడి నుంచి పరారైయ్యాడు. భక్తులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు.