అన్నయ్యా.. చనిపోతున్నా.. | couple attempt suicide in krishna district, husband dies | Sakshi
Sakshi News home page

అన్నయ్యా.. చనిపోతున్నా..

Published Wed, Jan 29 2014 10:46 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

అన్నయ్యా.. చనిపోతున్నా.. - Sakshi

అన్నయ్యా.. చనిపోతున్నా..

  జీవితాన్ని ఒకటిగా చేసుకున్నారు...


 ఒడుదొడుకులు వచ్చినా ఒరిగిపోబోమంటూ సాఫీగా జీవన గమనానికి దిక్సూచిగా నిలిచారు. అంతలోనే అప్పుల బాధ వెంటాడింది... కల్లోల హృదయాలకు కాస్త ఓదార్పు కూడా కరువైందేమో దంపతులిద్దరూ మృత్యువులోనూ మమేకమవుదాం అనుకున్నారు. నిద్రమాత్రలు మింగి శాశ్వత నిద్రలోకి జారుకుందామనుకున్నారు. చివరిలో బతకాలన్న ఆశ చిగురించిందో... మమకారం పంచిన అన్న అనునయం గుర్తుకొచ్చిందో వేకువజామున... అపస్మారక స్థితిలో విజయవాడలో ఉన్న అన్నయ్యకు ఫోన్ చేసి చనిపోతున్నట్టు అతి కష్టంగా చెప్పింది. వారు వచ్చి కాపాడేలోగానే భర్త మృతి చెందాడు... ఆమె మృత్యువుతో పోరాడుతోంది.


  మరో ఘటనలో అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తే కొరివిగా మారాడు. వేధింపులు తట్టుకోలేక కిరోసిన్‌ను శరీరంపై పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందా ఇల్లాలు. ఆమె ప్రాణం కూడా ఆస్పత్రిలో విలవిల్లాడుతోంది. మంటలు ఆర్పబోయిన భర్త కూడా ఆస్పత్రి పాలయ్యాడు.
 
 గుడివాడ :  అప్పుల బాధ భరించలేక దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గుడివాడలో మంగళవారం జరిగింది. భర్త మృతిచెందగా భార్య పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం స్థానిక రత్నమాల వీధిలో నివాసముంటున్న కొత్త ప్రసాదరావుకు చంద్రశేఖర్, ప్రేమ్‌చంద్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు ప్రేమ్‌చంద్‌కు 2000లో విజయవాడకు చెందిన మాధవితో వివాహమైంది. ఆ తర్వాత తండ్రి ప్రసాదరావు తనకున్న ఆస్తిని ఇద్దరు కుమారులకు పంచేశారు. వారికి ఉన్నది ఒకే భవనం కాగా, పైన పెద్ద కుమారుడు చంద్రశేఖర్‌తో తల్లిదండ్రులు నివసిస్తున్నారు. కింద చిన్న కుమారుడు ప్రేమ్‌చంద్ ఉంటున్నారు.
 
 రూ.10 లక్షల అప్పుతో వ్యాపారం...
 ప్రేమ్‌చంద్ వివాహానంతరం వడ్డీ వ్యాపారుల నుంచి రూ.10 లక్షలు రూ.5 చొప్పున వడ్డీకి అప్పుగా తీసుకుని కుసుమహరనాథ మందిరం సమీపంలో ‘గంగేశ ఎలక్ట్రానిక్స్’ అనే షాపు ఏర్పాటు చేసుకున్నాడు. నష్టాలు వస్తుండటంతో నాలుగేళ్ల క్రితం స్థానిక ఏలూరు రోడ్డులో అదే పేరుతో మరో షాపు ఏర్పాటు చేశాడు. వ్యాపార అవసరాల రీత్యా మరికొన్ని అప్పులు కూడా చేశాడు. ఇక్కడ కూడా వ్యాపారం మందకొడిగా సాగడంతో మనస్థాపానికి గురయ్యాడు. భార్య వద్ద నిత్యం అప్పుల విషయాన్ని ప్రస్తావించేవాడు. వాటిని ఎలా తీర్చాలో తెలియడం లేదంటూ కంటతడి పెట్టుకునేవాడు. అప్పులన్నీ కలిపి కోటిరూపాయలు పైనే ఉండటంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. వాటి వసూలు కోసం నిత్యం బాకీదారులు షాపు వద్దకు, ఇంటికి వచ్చి ఒత్తిడి చేస్తున్నారు. దిక్కుతోచని స్థితిలో మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
 
 అన్నయ్యా మా ఆయన చనిపోయాడు.. నేనూ చచ్చిపోతున్నా..


 దంపతులిద్దరూ తెల్లవారుజామున నిద్రమాత్రలు మింగగా ప్రేమ్‌చంద్ అక్కడికక్కడే మృతిచెందాడు. 4.30 సమయంలో భార్య మాధవి అపస్మారక స్థితిలో ఉండి విజయవాడలోని తన అన్నయ్య కందుకూరి హరిప్రసాద్‌కు ఫోన్‌చేసి ‘అన్నయ్యా నేనూ మీ బావగారూ ఆత్మహత్యకు పాల్పడ్డాం.. మా ఆయన చనిపోయారు.. నేనూ ఎక్కువ సేపు బతకను’ అని తెలిపింది. దీంతో ఆందోళనకు గురైన హరిప్రసాద్ ప్రేమ్‌చంద్ తండ్రి ప్రసాదరావుకు ఫోన్‌లో విషయం తెలిపాడు.

వెంటనే పైన ఉంటున్న తండ్రి ప్రసాదరావు, అన్న చంద్రశేఖర్ కిందకి వచ్చి తలుపులు కొట్టారు. ఎంతసేపటికి తలుపులు తీయకపోవడంతో వెనుక తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే ప్రేమ్‌చంద్ మృతిచెందగా, మాధవి నురగలు కక్కుతూ కనిపించింది. వెంటనే ఆమెను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై అసహజ మరణం కింద వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రేమ్‌చంద్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
 
 కుటుంబ కలహాలు.. పిల్లలు లేరనే బాధ..
 ప్రేమ్‌చంద్ అప్పుల విషయంలో ఇంట్లో ఎప్పుడూ గొడవలు కూడా జరిగేవని స్థానికులు చెబుతున్నారు. దీంతోపాటు పెళ్లయి 14 ఏళ్లు అయినా పిల్లలు కలగకపోవడంపై దంపతులిద్దరూ మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. తన చెల్లి, బావలకు అప్పులున్న సంగతి తెలియదని, ఏరోజూ ఆ విషయాన్నే వారు ప్రస్తావించలేదని మాధవి అన్నయ్య కందుకూరి హరిప్రసాద్ వాపోయారు. చెల్లెలి ఫోన్ సమాచారంతో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న ఆయన విగతజీవిగా ఉన్న ప్రేమ్‌చంద్‌ను చూసిన కుప్పకూలిపోయారు. బావా నాకు చెప్తే నీ అప్పు నేను తీర్చేవాడ్ని కదా... అంటూ భోరుమన్నారు.
 
 భర్త వేధింపులు తాళలేక...
 జమ్మవరం (వీరులపాడు/ కంచికచర్ల రూరల్) : భర్త తప్పతాగి రోజూ వేధిస్తున్నాడని మనస్తాపం చెందిన భార్య ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న ఘటన వీరులపాడు మండలం జమ్మవరంలో మంగళవారం జరిగింది. మహిళ శరీరం ఎక్కువభాగం కాలిపోగా, మంటలను ఆర్పే ప్రయత్నంలో భర్తకూ తీవ్ర గాయాలయ్యాయి. సేకరించిన వివరాల ప్రకారం వీరులపాడు మండలం జమ్మవరానికి చెందిన మంగలపూడి గ్రేస్‌కుమారి భర్త వెంకటరత్నం వ్యవసాయ కూలీ. వారికి ఇద్దరు కుమారులు.

భర్త రోజూ తాగి వచ్చి వేధిస్తుండటంతో మనస్తాపం చెందిన గ్రేస్‌కుమారి మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఒక్కసారిగా ఒంటినిండా మంటలు వ్యాపించటంతో ఆ బాధ తాళలేక కేకలు వేసింది. సమీపంలో ఉన్న భర్త ఇంట్లోకి వెళ్లిచూడగా అప్పటికే కుమారి శరీరం ఎక్కువ భాగం కాలిపోయింది. మంటలను ఆర్పే ప్రయత్నంలో వెంకటరత్నం కూడా తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న కంచికచర్ల 108 సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని వారిద్దరినీ నందిగామ ఏరియా ఆస్పత్రికి, అక్కడినుంచి విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement