‘‘మీకు నిత్యావసరాలు అందుతున్నాయా? పాలు, కూరగాయలు ఇంటికే వస్తున్నాయా?’’ అని నేరుగా రెడ్‌జోన్ ప్రాంతాల్లో ఉన్న ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి డోర్ తట్టి మరీ పిలిచి వాకబు చేశారు. తన దృష్టికి వచ్చిన ఇబ్బందులను వెంటనే అధికారులకు చెప్పి పరిష్కరించారు!
పాజిటివ్ కేసుల చికిత్స విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైద్య సిబ్బందితో నేరుగా భేటీ కావడంతో పాటు ‘‘మీకున్న ఇబ్బందులు ఏమిటి? అండంగా ఉంటాం.. మీకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలూ తీసుకుంటాం’’ అనే ధైర్యం నింపారు!!ఆయన ఎవరో కాదు జిల్లాకు కోవిడ్ –19 నియంత్రణకు ప్రత్యేక అధికారిగా వచ్చిన కె.విజయానంద్.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ)గా ఉన్న కె.విజయానంద్ ప్రత్యేకంగా కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకుని.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో కోవిడ్–19 ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తున్నారు. వచ్చిన వెంటనే రెడ్‌జోన్లలో కలియతిరగడంతో పాటు ఆసుపత్రిలోని వైద్య సిబ్బందితో సమావేశమవడం, క్వారంటైన్ కేంద్రాలను పరిశీలించడం వంటి పనులన్నీ చేస్తూ ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగంలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. జిల్లా ప్రస్తుతం భద్రంగా ఉందని.. ఇదే విధంగా నియంత్రణ చర్యలు కొనసాగిస్తే ఆరెంజ్ జోన్ నుంచి క్రమంగా గ్రీన్ జోన్‌లోకి వస్తుందనే ధీమాను వ్యక్తం చేశారు. ఇప్పటివరకు జిల్లాలో ఏకంగా 17 వేలకుపైగా టెస్టులు (ర్యాపిడ్ టెస్టులతో కలిపి) చేశామని.. కొత్తగా వస్తున్న మెజారిటీ కేసులన్నీ ఇప్పటికే అనుమానితులుగా గుర్తించి క్వారంటైన్ సెంటర్లో ఉన్నవారివేనన్నారు. ఒకటి, రెండు కూడా కంటైన్మెంట్ జోన్లలో ఉన్నవారేనని పేర్కొన్నారు. తద్వారా ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌ను గుర్తించడం వంటి ఇబ్బంది లేకుండా పోయిందన్నారు. జిల్లా యంత్రాంగం అంతా కలసికట్టుగా పనిచేస్తోందని కితాబునిచ్చారు. ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పిన మరికొన్ని విశేషాలు ఆయన మాటల్లోనే...!
క్రమంగా సాధారణ స్థితికి..
కోవిడ్–19 నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో ఇళ్లకే జిల్లావాసులు పరిమితం కావాల్సి వచ్చింది. లాక్‌డౌన్‌కు జిల్లా ప్రజలు బాగా సహకరిస్తున్నారు. వారి సహకారంతోనే జిల్లాలో ఎక్కువ కేసులు కాకుండా అరికట్టగలిగాం. మన జిల్లా ఆరెంజ్ జోన్‌లో ఉంది. అయితే, జిల్లాలో ప్రధానంగా అనంతపురం, హిందూపురంలోనే కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. జిల్లాలో కేసులు నమోదైన ప్రాంతాల్లో 43 క్లస్టర్లను ఏర్పాటు చేశాం. వీటిలో హిందూపురంలో 16, అనంతపురంలో 18, ఇతర ప్రాంతాల్లో 9 క్లస్టర్లు మొత్తం 43 క్లస్టర్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ క్లస్టర్లు ఉన్న కంటైన్మెంట్ జోన్లు అనంతపురం పట్టణం, హిందూపురం మినహా మిగిలిన ప్రాంతాల్లో బుధవారం నుంచే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. వ్యవసాయంతో పాటు ఇతర కార్యక్రమాలను కొనసాగించేందుకు అనుమతి కూడా ఇచ్చాం. ఉదయం 4 నుంచి రాత్రి 7 గంటల వరకు పనులు చేసుకునేందుకు అవకాశం ఉంది. రాత్రి సమయాల్లో మాత్రం బయటకు వచ్చేందుకు అనుమతి లేదు. అత్యవసరమైతే తప్ప అనుమతించే అవకాశం లేదు. ఆటోలు తిప్పేందుకు ఇంకా అనుమతి ఇవ్వలేదు.
గ్రామాల్లో క్వారంటైన్ బెడ్ల ఏర్పాటు
ఇతర రాష్ట్రాల నుంచి వలస కార్మికులు వస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ భారీగా క్వారంటైన్ కేంద్రాలను పెంచాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ప్రతీ గ్రామ సచివాలయంలో 10 క్వారంటైన్ బెడ్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇక క్వారంటైన్ సెంటర్లకు సరఫరా చేసే భోజనాన్ని ఎంతో శుభ్రమైన వాతావరణంలో చేయడంతో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
జిల్లాలో హిందూపురం ప్రాంతం నుంచే కొత్త కేసులు వస్తున్నాయి. అందువల్ల దీనిపై ప్రత్యేక దృష్టి సారించాం. అక్కడే ప్రత్యేకంగా కోవిడ్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఇందుకు అనుగుణంగా హిందూపురం ఆసుపత్రిని కోవిడ్ ఆసుపత్రిగా మారుస్తున్నాం. ఇందుకోసం ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న వివిధ చికిత్స తీసుకుంటున్న పెషేంట్లను ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తున్నాం. ఆ తర్వాత హిందూపురం ఆసుపత్రిలోనే కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి చికిత్స అందిస్తాం. తద్వారా అక్కడి నుంచి పాజిటివ్ వచ్చిన వారికి ఇతర ప్రాంతాలకు తరలించాల్సిన ఇబ్బంది లేకుండా పోతుంది. ఇప్పటికే హిందూపురంలో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ అమలవుతోంది. ఇంటికే నిత్యావసర సరుకులను సరఫరా చేస్తున్నాం. ప్రత్యేకంగా జాయింట్ కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్లు అక్కడే ఉండి విధులు నిర్వర్తిస్తున్నారు. నాలుగైదు రోజుల్లో ఇక్కడ కూడా పరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తున్నాం.
కలిసికట్టుగా జిల్లా యంత్రాంగం
జిల్లా యంత్రాంగం అంతా కలసికట్టుగా పనిచేస్తోంది. అందరూ సమన్వయంతో ముందుకు పోతున్నారు. ప్రధానంగా కలెక్టర్, ఎస్పీ, జేసీ, కమిషనర్ అందరూ ఒక ప్రణాళికాబద్ధంగా ప్రజల్లో ధైర్యం నింపుతున్నారు. అన్ని ప్రభుత్వశాఖల సిబ్బంది ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నారు. వైద్య, మునిసిపల్, పోలీస్, రెవెన్యూ సిబ్బంది సేవలు వెలకట్టలేనివి. ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment