రెడ్, ఆరెంజ్ జోన్లలో లాక్‌డౌన్ అమలు విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిని జిల్లాలో పక్కగా అమలు చేస్తాం. రెడ్‌జోన్లలో యథావిధిగా ఆంక్షలు అమలవుతాయి. ఆరెంజ్, గ్రీన్ జోన్లలో ప్రభుత్వం కొంత సడలింపు ఇచ్చింది. ఆ ప్రకారం జిల్లాలో అమలు చేస్తాం.
– గంధం చంద్రుడు, కలెక్టర్
సాక్షి, అనంతపురం : కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా జిల్లాలో అమలవుతున్న లాక్‌డౌన్‌లో సోమవారం నుంచి కొద్ది మార్పులు ఉంటాయి. కాకపోతే జోన్ల వారీగా సడలింపులు అమలవుతాయి. ఈ సడలింపు కూడా కొంత వరకే ఉంటుంది. కరోనా వైరస్ వ్యాప్తి ఆధారంగా జిల్లాను మూడు జోన్లుగా విభజించారు. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాలను రెడ్‌జోన్లుగా నిర్ధారించారు. రెడ్‌జోన్‌గా నిర్ధారించిన ప్రాంతంలో 14 రోజులుగా ఒక కేసు నమోదు కాని వాటిని ఆరెంజ్‌జోన్లుగా, 28 రోజుల్లో ఒక్క కేసు నమోదు కాని వాటిని గ్రీన్‌జోన్లుగా మార్చారు. అదే విధంగా ఇప్పటికీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాని ప్రాంతాలను గ్రీన్‌జోన్లుగా గుర్తించారు. జోన్ల వారీగా సోమవారం నుంచి ఏయే కార్యక్రమాలు చేపట్టవచ్చు అనే దానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు జిల్లా యంత్రాంగం అమలు చేయనుంది.
రెడ్‌జోన్‌లో ఆంక్షలు..
రెడ్‌జోన్‌గా గుర్తించిన ప్రాంతాల్లో లాక్‌డౌన్ యథావిధిగా అమలులో ఉంటుంది. ఇప్పటి వరకు ఎలాంటి ఆంక్షలు అమలవుతున్నాయో అవి కొనసాగుతాయి. ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటారు.
ఆరెంజ్ జోన్‌లో ఇలా...
ఆరెంజ్ జోన్లలో కొంత మేర సడలింపులు ఇచ్చినప్పటికీ ఆంక్షలు కొనసాగుతాయి. బస్సుల ప్రయాణం నిషేధం ఉంటుంది. డ్రైవర్, ఇద్దరు ప్రయణికులతో క్యాబ్‌లను అనుమతిస్తారు. మద్యం విక్రయాలకు అనుమతిస్తారు. సెలూన్ (క్షౌరశాలలు) తెరుచుకునేందుకు అనుమతిస్తారు. వైద్య అత్యవసర పనులు, వ్యవసాయం, దాని అనుబంధ పనులు అనుమతిస్తారు.
జిల్లాలో జోన్లు ఇలా..
కరోనా పాజిటివ్ కేసుల ఆధారంగా అనంతపురం అర్బన్, హిందూపురం అర్బన్, రూరల్ ప్రాంతాలను రెడ్‌జోన్ జాబితాలో చేర్చారు. గుంతకల్లు, రాప్తాడు, శెట్టూరు, కళ్యాణదుర్గం, గుత్తి , తాడిపత్రి ప్రాంతాలను ఆరెంజ్‌జోన్ జాబితాలో చేర్చారు. రెడ్, ఆరెంజ్ జోన్‌లో లేని ప్రాంతాలన్నీ గ్రీన్‌జోన్ జాబితాలో ఉంటాయి.
గ్రీన్‌జోన్‌లో ఇలా...
వ్యవసాయం, పరిశ్రమలు, వ్యవసాయ కూలీలు, కారి్మకులు పనులు చేసుకునేందుకు వీలుంది. మద్యం విక్రయాలు జరుపుకోవచ్చు. ఉపాధి పనులు చేసుకోవచ్చు. వైద్య అత్యవసర పనుల్లో భాగంగా సొంత వాహనాల్లో వెళ్లేందుకు అనుమతిస్తారు. అయితే ఇక్కడ కొన్ని నిబంధనలు ఉన్నాయి. గ్రీన్‌జోన్‌లోని పరిశ్రమలు, ఇతరాత్ర పనులకు కారి్మకులు, కూలీలు గ్రీన్‌జోన్‌లోని వారే వెళ్లాలి. రెడ్, ఆరెంజ్ జోన్‌లోని వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపయోగించుకోకూడదు.
నేటి నుంచి మద్యం అమ్మకాలు
అనంతపురం : లాక్‌డౌన్‌తో 43 రోజులు మూతపడిన మద్యం దుకాణాలు సోమవారం తెరుచుకోనున్నాయి. జిల్లాలోని కంటైన్మెంట్ జోన్లు మినహా మిగితా అన్ని ప్రాంతాల్లో మద్యం విక్రయించేలా ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జిల్లాలోని అనంతపురం, హిందూపురం, శెట్టూరు, కళ్యాణదుర్గం, గుంతకల్లు, గుత్తి, కొత్త చెరువు, తదితర ప్రాంతాల్లో 25 వరకు కంటైన్మెంట్ జోన్లున్నాయి. ఈ ప్రాంతాలు మినహా మిగితా చోట ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి. జిల్లాలో 198 మద్యం దుకాణాలుండగా దాదాపుగా 170 మద్యం దుకాణాలు తెరవనున్నారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 వరకు విక్రయాలు జరుగనున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న ధరలపై 25 శాతం అదనంగా వసూలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అంతేకాకుండా కరోనా నేపథ్యంలో వలంటీర్ల ద్వారా భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటామని జిల్లా ఉన్నతాధికారులు తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులతో ఆదివారం రాత్రికే చాలాచోట్ల మద్యం దుకాణాల ఎదుట భౌతిక దూరం పాటించేలా పెయింట్‌లో మార్కింగ్ వేశారు.
Comments
Please login to add a commentAdd a comment