విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, చిత్రంలో ఆదోని, మంత్రాలయం ఎమ్మెల్యేలు సాయిప్రసాద్ రెడ్డి, బాలనాగిరెడ్డి
ఆదోని/ఎమ్మిగనూరుటౌన్: కరోనా వైరస్(కోవిడ్–19)ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. దేశంలోనే అత్యధిక కరోనా పరీక్షలు కర్నూలులో జరుగుతున్నాయని స్పష్టం చేశారు. గురువారం.. ఆదోని, ఎమ్మిగనూరు పట్టణాల్లోని అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ‘కరోనా’ అదుపులోనే ఉందన్నారు. ప్రజా ఆరోగ్యానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. ప్రస్తుతం రోజూ రాష్ట్రంలో 20,000 వరకు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తూ..మరణాల సంఖ్యను ప్రభుత్వం గణనీయంగా తగ్గించిందన్నారు.
కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోకుండా పక్క రాష్ట్రంలో కూర్చొని టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాలు చేయడం సిగ్గుచేటన్నారు. దుకాణాల యజమానులు ప్లాస్టిక్ మాని, పేపరు కవర్లు వాడాలని సూచించారు. ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. వలస కూలీలకు బనవాసి క్వారంటెన్‌లో అన్ని వసతులు సమకూర్చాలని, వారికి కరోనా పరీక్షలు చేయాలని అధికారులను సూచించారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ వీరపాండియన్, ఆదోని ఎమ్మెల్యే వై సాయిప్రసాద్‌రెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ నేత ఎర్రకోట జగన్‌మోహన్‌రెడ్డి, ఆర్డీఓ బాలగణేశయ్య, మున్సిపల్ కమిషనర్లు సుబ్బారావు, రఘునాథ్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment