
సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం: కష్టాన్ని నమ్ముకుని బతికే బడుగు జీవులకు వరుస కష్టాలు మీదపడితే.. ఆ బరువు భరించేవాడికే తెలుస్తుంది.. గోరుచుట్టుపై రోకటిపోటులా.. పూటగడవడమే కష్టమనుకున్న సమయంలో కరోనా మహమ్మారి కన్నీళ్లపాలు చేసింది.కండబలం ఉన్నంత వరకూ కష్టించి పనిచేసే మనస్తత్వం అతనిది. నాలుగు రాళ్లు వెనకేశాడు.. కూతుళ్ల పెళ్లిళ్లు చేసి, బరువు బాధ్యతలు తీర్చుకున్నాననుకున్నాడు. అంతలోనే దురద్రుష్టం అతన్ని వెంటాడింది.
కొవ్వూరునగర్‌కు చెందిన మహబూబ్ నాలుగేళ్ల క్రితం పప్పులబట్టీలో పని చేస్తుండగా అనుకోని ప్రమాదం అతని రెండు చేతులను కబళించింది. అప్పుడప్పుడు భార్య తెచ్చే రోజువారి కూలితో నెట్టుకొస్తున్న జీవితాన్ని కాస్తా కరోనా రోడ్డున పడేసింది. లాక్‌డౌన్‌తో పనిలేక, పస్తులుండలేక ఇదిగో ఇలా రోడ్డుపైకొచ్చి దీనంగా నిలవాల్సిన పరిస్థితి వచ్చింది. చేతులు లేకున్నా.. దారి వెంట వెళ్లే వారందరినీ దయచూపండని వేడుకుంటున్న దృశ్యాలు ఆ కుటుంబం ఆకలి కేకలకు అద్దం పట్టాయి.