‘ఏ అర్హత ఉందని లోకేశ్‌కు మంత్రి పదవి’
అనంతపురం: అనంతపురం ఆర్ట్స్ కళాశాల మైదానంలో సామాజిక హక్కుల వేదిక ముగింపు సభలో సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏ అర్హత ఉందని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌కు మంత్రి పదవి ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ... మైనార్టీలు, గిరిజనులకు మంత్రి పదవులు ఇచ్చేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు ఎందుకు మనసు రావడం లేదన్నారు. పార్టీ ఫిరాయింపుదారులకే పెద్దపీట వేస్తారా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఏపీ రైతులు భిక్షాటన చేస్తున్నా బాబు ఎందుకు స్పందించడం లేదో తెలియడం లేదన్నారు. టీడీపీ నేతల వద్ద వందల కోట్ల అవినీతి డబ్బు ఉందని ఆయన ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీల నిధులను సీఎం చంద్రబాబు పక్కదారి పట్టిస్తున్నారని చెప్పారు. ఈ సమావేశంలో సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ, కేరళ వ్యవసాయ మంత్రి సునీల్ కుమార్, సినీగేయ రచయిత వందేమాతరం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.