
బాబు.. అప్పటి వరకు పదవి వదులుకోవాలి
సీపీఐ నేత నారాయణ
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టు నోటీసులిచ్చిన నేపథ్యంలో నిర్దోషిగా తేలేవరకు పదవికి రాజీనామా చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ సూచించారు. అప్పటి వరకు తన పదవిని తన కుమారుడికి అప్పగించవచ్చన్నారు. ప్రముఖ నాయకులు, పదవుల్లో ఉన్న వారిపై ఆరోపణలు వచ్చినపుడు ఆ కేసులను న్యాయవ్యవస్థ వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
మంగళవారం హైదరాబాద్‌లో చాడ వెంకటరెడ్డి, అజీజ్ పాషా, పల్లా వెంకటరెడ్డిలతో కలసి విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర విభజనతో ఏపీకి ప్రత్యేక హోదా పదేళ్లు ఇవ్వాలని డిమాండ్ చేసి కేంద్ర మంత్రి వెంకయ్య మాట తప్పలేదా అని ప్రశ్నించారు. కమ్యూస్టులుగా తాము మాట తప్పితే ఉరేసుకునేందుకు సిద్ధమని, అందుకు వెంకయ్య సిద్ధమా అని నిలదీశారు. కాగా, ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ సాయిబాబాపై విధించిన జీవిత ఖైదుపై వెంటనే పునరాలోచించాలని నారాయణ ఒక ప్రకటనలో కోరారు. వికలాంగుడిగా ఉన్న వ్యక్తి దేశాన్ని సర్వనాశనం చేయగలరా, బీజేపీ ప్రభుత్వాన్ని కూలదోయగలరా అని ప్రశ్నించారు. బహిరంగంగా తలలకు వెలగట్టే ప్రకటనలు చేస్తున్న వారి అంచులకైనా పోగలరా అని నిలదీశారు.