ప్రత్యేక హోదా పోరాటం హోరాహోరీ స్థాయికి చేరింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సీపీఐ తలపెట్టిన బంద్ విజయవంతమైంది. ఈ బంద్‌కు వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్, సీపీఎం మద్దతు పలికాయి. వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. విద్యాసంస్థలు తెరుచుకోలేదు. ప్రభుత్వ కార్యాయాలూ వెలవెలబోయాయి. కార్యకలాపాలు స్తంభించాయి. ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం వరకు తిరగలేదు.
అమలాపురం : బంద్‌కు పలు ప్రజాసంఘాలు, ఉద్యోగ, విద్యార్థి జేఏసీలు, బార్ అసోసియేషన్లు కూడా మద్దతు పలికాయి. బస్సులు తిరగకపోవడంతో బస్టాండ్లు బోసిపోయాయి. పలు పార్టీల నాయకులు వీధుల్లో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు.
కలెక్టరేట్ వద్ద ధర్నా, పలువురి అరెస్టు
జిల్లా కేంద్రం కాకినాడలో సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. ఉదయం నుంచి బస్సులు నిలిపివేశారు. కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు కేంద్రమాజీ మంత్రి ఎం.ఎం.పల్లంరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జి, మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు కారెం శివాజీతోపాటు పలు పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై బీజేపీ మాట తప్పడం ఆ పార్టీ దివాళాకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేష్టలుడిగి చూస్తున్నారని, ప్రత్యేకహోదా రావడం బాబుకు ఇష్టం లేదని ధ్వజమెత్తారు. అనంతరం కలెక్టరేట్‌లోకి చొచ్చుకు వెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు అడ్డుకుని మధు, శివాజీతోపాటు పలువురిని అరెస్టు చేశారు. కాకినాడ టౌన్ స్టేషన్‌లో రైలురోకో చేసి సర్కారు ఎక్స్‌ప్రెస్‌ను అడ్డుకున్నారు. కాకినాడ లారీ ఓనర్ల అసోసియేషన్ బంద్‌కు మద్దతునిచ్చింది. రాజమండ్రిలోనూ బంద్ జయప్రదమైంది. దేవీచౌక్ సెంటరు నుంచి ఆందోళనకారులు నగర వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బంద్‌కు మద్దతునిచ్చారు.
అమలాపురంలో ధర్నా.. బస్సుల అడ్డగింత
అమలాపురంలోనూ బంద్ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద తెలుగుదేశం, మిత్రపక్షమైన బీజేపీ మినహా మిగిలిన అన్నిరాజకీయ పక్షాలూ ధర్నా నిర్వహించి రాకపోకలు అడ్డుకున్నాయి. సీపీఐ నాయకులతోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, జేఏసీ నాయకులు బంద్‌లో పాల్గొన్నారు. తెల్లవారు జాము నుంచి మధ్యాహ్నం వరకు బస్సులు నిలిపివేశారు. బస్సులు తిప్పేందుకు యత్నించగా వైఎస్సార్‌సీపీ నాయకులు అడ్డుకున్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా బీసీసెల్ అధ్యక్షుడు మట్టపర్తి మురళీకృష్ణ, యూత్ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు గనిశెట్టి రమణ్‌లాల్, సుంకర సుధ, జేఏసీ నాయకులు బండారు రామ్మోహనరావు, కె.సత్తిబాబు పాల్గొన్నారు. బస్సులను అడ్డుకున్న సమయంలో పోలీసులకు, జేఏసీ నాయకులకు మధ్య వాగ్వివాదం జరిగింది.
పట్టణ సీఐ వై.ఆర్.కె.శ్రీనివాస్ పార్టీ నాయకులను అదుపులోకి తీసుకుని తరువాత వదిలేశారు. పిఠాపురం మున్సిపాలిటీ వైఎస్సార్‌సీపీ ఫ్లోర్‌లీడర్ గండేపల్లి బాబి ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. మండపేటలో పీసీసీ కార్యదర్శి కామన ప్రభాకరరావు ఆధ్వర్యంలో బంద్ జరిగింది. ఏజెన్సీలో రంపచోడవరంలో మాత్రమే బంద్ ప్రభావం ఉదయం పూట కొంత వరకు కనిపించింది. ఉభయ కమ్యూనిస్టు పార్టీలతోపాటు వైఎస్సార్‌సీపీ బంద్‌కు మద్దతుగా ఆందోళనలు నిర్వహించాయి. అయితే మధ్యాహ్నం నుంచి బస్సులు తిరిగాయి. మిగిలిన మండలాల్లో బంద్ ప్రభావం అంతంత మాత్రమే. రంపచోడవరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు.
ఆర్టీసీకి రూ.30 లక్షల నష్టం
రాజమండ్రి సిటీ : బంద్ సందర్భంగా జిల్లాలో ఆర్టీసీకి మంగళవారం రూ.30 లక్షల నష్టం వాటిల్లిందని డిప్యూటీ సీటీఎం ఆర్‌వీఎస్ నాగేశ్వరరావు తెలిపారు. 70 శాతం బస్సులు మాత్రమే నడపగలిగామని వివరించారు.
హోదాహోరీ
Published Wed, Aug 12 2015 1:56 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement
Advertisement