► సీపీఎం మహాసభలు నేటితో సమాప్తం
► బహిరంగ సభతో పూర్తి
► ప్రతి రోజూ వివిధ రాష్ట్రాల ప్రతినిధుల వాడీవేడీ చర్చలు
► కేంద్ర ప్రభుత్వ విధానాలపై మండిపాటు
సాక్షి, విశాఖపట్నం : కామ్రేడ్ల ప్రతిష్టాత్మక మహాసభలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. సీపీఎం అఖిల భారత మహాసభలు శనివారంతో ఐదు రోజులు పూర్తి చేసుకున్నాయి. ఆరవ రోజు ఆదివారం మధ్యాహ్నంతో మహాసభలు ముగుస్తున్నాయి. అనంతరం భారీ బహిరంగ సభ ఆర్‌కె బీచ్‌లో నిర్వహించనున్నారు. తొలి రోజు నుంచీ వివిధ అంశాలపై అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ బలహీనపడటంపై ఆత్మ విమర్శ చేసుకున్నారు. ప్రతి రోజూ పలు తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించారు.
నిరాడంబరంగా వ్యవహరించి ముఖ్యనేతలు తమ ప్రత్యేకతను చాటుకుంటే, క్రమశిక్షణగా ప్రవర్తించి కార్యకర్తలు తమ నిబద్ధతను ప్రదర్శించారు.పోర్టు కళావాణి ఆడిటోరియంలో జాతీయ మహాసభల నిర్వహణకు రూపొందించిన కళారూపాలు ఈ సభలకు వన్నె తెచ్చాయి. భగభగమండే కాగడాను పిడికిలి బిగించి పట్టుకున్న రెండు చేతులు స్వాగతం పలుకుతున్నట్లు ముఖద్వారం వద్ద ఏర్పాటు చేయడంతో పాటు దారికి ఇరువైపులా ఉన్న చెట్లకు ఎర్ర తోరణాలు కట్టి ఆకర్షణీయంగా తయారు చేశారు.
తామెందుకు ప్రజలకు దూరమవుతున్నామనే అంశంపై ఆత్మవిమర్శ చేసుకున్నారు. గత వైభవ స్మృతులను తలుచుకుంటూ, వర్తమాన పరిస్థితులకు కారణమైన తప్పిదాలను సమీక్షించుకుంటూ, భవిష్యత్‌కు బాటలు వేసేలా చర్చలు కొనసాగించారు. 1990వ దశకంలో ప్రారంభమైన నూతన ఆర్ధిక పారిశ్రామిక విధానాల పర్యవసానాలు దేశంలోని 80 శాతం ప్రజానీకాన్ని అవస్థల పాలు చేసినప్పుడు దానిపై పోరాడే క్రమంలో సీపీఎం ఆయా రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలతో జతకట్టిన విధానంపై చర్చించారు. అయితే ఆ పార్టీలు రానురాను బూర్జువా పక్షాలతో మమేకమడంతో సీపీఎం ఏ విధంగా రాజకీయంగా వెనకబడిందన్న అంశాలపై సమీక్ష జరిపారు.
మహాసభల్లో ఆమోదించిన పలు తీర్మానాలు
రైతులు, పేదలు, వృత్తిదారులకు నష్టం చేకూర్చి కార్పొరేట్‌లకు లాభం కలిగేలా మోడీ ప్రభుత్వం భూసేకరణ-సహాయ, పునరావాస చట్టం 2013కు సవరణ చేస్తోందని, దానిని వ్యతిరేఖిస్తున్నాం.
అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా షెడ్యూల్ కులాల సమస్యలపై చర్చించేందుకు పార్లమెంటు సమావేశాలు ప్రత్యేకంగా నిర్వహించాలి.
- కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం విద్యా హక్కుపై జరుపుతున్న దాడికి వ్యతిరేకం.
- కార్మిక చట్టాలను యజమానులకు అనుకూలంగా మార్పు చేయాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలను నిరసిస్తున్నాం.
- బెంగాల్ ప్రజలపై తృణమూల్ కాంగ్రెస్ చేస్తున్న దాడులకు ఖండన
- మైనార్టీల అభివృద్ధి కార్యక్రమాలపై చేసిన సిఫార్సులను అమలుకు డిమాండ్
- ప్రైవేటు రంగంలో ఎస్‌సి, ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేయాలి. సబ్‌ప్లాన్‌లకు నిధులు కేటాయిస్తూ ప్రత్యేక చట్టం చేయాలి.
- ఉద్యోగ, నిరుద్యోగ భృతి ఉండాలని, పనిహక్కును ప్రాధమిక హక్కుగా పరిగణించాలి.
- వికలాంగుల హక్కుల బిల్లును వెంటనే ఆమోదించాలి.