ఏలూరు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనపై సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు బృందాకారత్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీపీఎం జిల్లా సదస్సులో పాల్గొన్న ఆమె సోమవారమిక్కడ మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన భూ సేకరణ చట్టం బ్రిటిష్ కాలం నాటి చట్టం కంటే దారుణంగా ఉందని అన్నారు. బీజేపీతో పొత్తు చారిత్రాత్మక తప్పిదమన్న చంద్రబాబు ఏ విధంగా పొత్తు పెట్టుకున్నారని బృందాకారత్ ప్రశ్నించారు. చంద్రబాబుది రెండు మాటలు, ద్వంద్వ వైఖరని ఆమె ధ్వజమెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం బీజేపీ మాట తప్పడమే అన్నారు. రాజధాని పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు సేకరించటం దారుణమన్నారు.