ఆర్థిక, సామాజికాంశాలపై సమాంతర పోరు
వామపక్ష సంఘటనను బలోపేతం చేయడమే దేశం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కారమని సీపీఎం అభిప్రాయపడింది. ఎన్నికల సమయంలోనే ఎత్తులు, పొత్తులు ఉంటాయని, ప్రభుత్వంపై పోరుకు తమతో కలసివచ్చేవారందరినీ కలుపుకుపోతామని స్పష్టంచేసింది. నాలుగు రోజులుగా విశాఖలో జరుగుతున్న పార్టీ 21వ జాతీయ మహాసభల్లో భాగంగా శుక్రవారం కూడా ఏడు తీర్మానాలను ఆమోదించింది.
విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: సామాజిక అణచివేత, ఆర్థికాంశాలపై ఏకకాలంలో సమాంతర పోరాటం చేయాలని సీపీఎం నిర్ణయించింది. ఎత్తులు, పొత్తులన్నీ ఎన్నికల సమయంలోనేనని తేల్చింది. పార్లమెంట్ లోపలైనా, వెలుపలైనా సమస్యలపై కాంగ్రెస్‌తో పని చేస్తామని స్పష్టం చేసింది. తమంట తాము ఎదుగుతూ వామపక్ష సంఘటనను బలోపేతం చేయడమే దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారమని అభిప్రాయపడింది. నాలుగు రోజులుగా ఇక్కడ జరుగుతున్న పార్టీ 21వ జాతీయ మహాసభ శుక్రవారం కూడా రాజకీయ ముసాయిదా తీర్మానాన్ని చర్చించింది. ఈ సందర్భంగా పార్టీ పాలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి ఏపీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ నరసింగరావుతో కలసి మీడియాతో మాట్లాడారు. మహాసభ ఆమోదించిన ఏడు తీర్మానాలను విడుదల చేశారు.
మిగతా తీర్మానాలివే
శాస్త్ర, సాంకేతిక, సాంస్కృతిక రంగాల్లో కాషాయీకరణ పెరిగిపోయిందని, దీన్ని నిలువరించాలని తీర్మానించింది. దేశంలో నూటికి 30 శాతంగా ఉన్న యువతీ యువకులకు ఉపాధి చూపాలని లేదా లేదా నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేసింది. సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉంచడానికి బదులు ఆంక్షలు విధించడాన్ని వ్యతిరేకించాలని తీర్మానించింది. ఇంటర్నెట్ అందుబాటుపై పరిమితుల్ని ఆక్షేపించింది. పార్టీ సంస్థాగత కార్యకలాపాల నివేదికను శనివారం చర్చిస్తుంది. 124 పేజీలకు పైగా ఉన్న నివేదికలో పార్టీ గతంలో చేసిన కార్యకలాపాలు, సంస్థాగత వ్యవహారాలున్నాయి. వీటిల్లో కొన్నింటిని మాత్రమే చర్చించి, మిగతావాటిపై త్వరలో ప్రత్యేక ప్లీనరీ నిర్విహ స్తారు.
పొత్తులపై ఏమన్నారంటే..
సొంత బలం లేకనే పొత్తులు పెట్టుకున్నాం. దెబ్బతిన్నాం. అందుకే దిద్దుబాట పట్టాం. ఇకపై వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల ఐక్యతకే మా ప్రాధాన్యం. పొత్తులు ఎత్తులనేవి ఎన్నికల సమయంలోనే. అప్పటి దాకా ఏదైనా సమస్యపై పార్లమెంటు లోపల లేదా బయట చేసే పోరాటాలలో కాంగ్రెస్‌తో సహా చాలామంది కలసి వస్తే కలుపుకుపోతాం. పశ్చిమ బెంగాల్ సహా ఎక్కడా కాంగ్రెస్‌తో పొత్తులుండవు.
మీడియాకు సీతారాం చురక
‘మీడియాలోనూ ఉద్యోగ భద్రత కొరవడింది. కాంట్రాక్ట్ వ్యవస్థ వచ్చింది. మీరు కూడా కాంట్రాక్ట్ జర్నలిస్టుల సంఘాన్ని ఏర్పాటు చేసుకోండి. మేము నాయకత్వం వహిస్తాం. వేతనాల కోసం చేసే పోరాటానికి మద్ధతిస్తాం’ అంటూ చురకలంటించారు.
మేము బలపడాలి
పార్టీ సొంతంగా ఎదగడమే లక్ష్యం. ఆర్థిక, సరళీకృత విధానాలు, మతోన్మాద చర్యల ను కలగలిపి మోదీ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇది దేశలౌకిక వ్యవస్థకు ముప్పు. దీన్ని ప్రతిఘటించాలి. ఇకపై ఆర్థిక పోరాటాలతోపాటు సామాజిక అణచివేతపై ఉద్యమాలను ఏకకాలంలో నడిపిస్తాం.
మేక్ ఇన్ ఇండియా కాదు..
మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మేక్ ఇన్ ఇండియా (ఇండియాలో తయారీ) కాస్తా మేక్ ఫర్ ఇండియా (భారత్ కోసం తయారు చేయండి) తయారైంది. స్వదేశీ విధానానికి బదులు తమ దేశంలో వ్యాపారానికి రండన్నట్టుగా మారింది.