అజ్ఞాతంలోకి బుకీలు
చెన్నూరు: క్రికెట్ బుకీల వద్ద మామూళ్లు తీసుకుంటూ, వారి కారులోనే దర్జాగా షికారు చేస్తూ ఉచిత సేవలు పొందుతున్న చెన్నూరు పోలీసులపై ఆ శాఖ ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. సాక్షి దినపత్రికలో మంగళవారం ప్రచురితమైన ‘బుకీల కారు..ఖాకీల షికారు అనే కథనంపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు విచారణ మొదలు పెట్టారు. ఎవరా బుకీ..కారు ఎవరు ఉపయోగించారు. ఎక్కడెక్కడికి తీసుకెళ్లారు. స్టేషన్‌లో బుకీలతోఎవరికి ఎక్కువ సంబంధాలున్నాయనే విషయంపై వివరాలు సేకరిస్తున్నారు. అలాగే కొందరు పోలీసులు స్టేషన్‌లో గంటల తరబడి బాధితులతో పాటు, నిందితులను ఉంచి పంచాయితీలు చేసి ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ విషయాలపై ఉన్నతాధికారులు స్టేషన్‌లో స్టేట్‌మెంట్ రాయించుకొని వదిలి పెట్టిన బాధితులను విచారిస్తే స్టేషన్‌లో ఎవరెవరు ఎంత వసూలు చేస్తున్నారో స్పష్టమవుతుందని ప్రజలు చర్చించుకొంటున్నారు. మట్కా నిర్వాహకులతో పాటు, జూదరులను పట్టుకుంటే వారి వద్ద ఉన్నదే కాకుండా ఇంటి నుంచి మరింత మొత్తం తెప్పించుకొని కొంత కేసులో పెట్టి వాటాలు పంచుకున్నట్లు ఆరోపణలున్నాయి.
స్టేషన్‌లో అన్నీ తామై వ్యవహరిస్తున్న ఇద్దరు పోలీసులపై పలుమార్లు ఫిర్యాదులొచ్చినా చర్యలు తీసుకోక పోవడంతో వారు నే రస్తులతో సత్సంబంధాలు నెరుపుతున్నారు. కాగా సాక్షిలో కథనం ప్రచురితం కావడంతో పలువురు బుకీలు ఒక్కసారిగా అజ్ఞాతంలోకి వెళ్లారు. నేరస్తులతో, చోటా నాయకులతో సంబంధాలున్న పోలీసులు వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పోలీసు ఉన్నతాధికారులకు రాజకీయ నాయకులతో చెప్పించుకొనేందుకు నేరస్తులనే ఆశ్రయిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఓ పోలీసు ఉన్నతాధికారి ఫోన్‌లో మాట్లాడుతూ సాక్షిలో వచ్చిన కథనంపై విచారణ జరుపుతున్నామని చెప్పారు.
ఖాకీల షికారుపై ఆరా
Published Wed, Mar 4 2015 1:38 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement