కిషన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతల పరిస్థితి ముందు చూస్తే నుయ్యి వెనుక చూస్తే గొయ్యి అన్న చందంగా తయారైంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెర మీదికొచ్చిన కొన్ని సాంకేతిక అంశాలు ప్రస్తుతం రాష్ట్ర పార్టీ కమలదళాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలపడంతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సేనకు ముచ్చెమటలు పడుతున్నాయి.
కేంద్రంలో ఒకే పార్టీగా బిజెపి అధికారంలోకి వచ్చినప్పటికీ, తెలంగాణలో ఆ పార్టీ నేతలకు ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. లోక్సభలో ఏపీ పునర్‌వ్యవస్థీకరణ సవరణ బిల్లుకు ఆమోదం లభించడంతోనే కష్టాలు మొదలయ్యాయని చెప్పవచ్చు. ఈ బిల్లు ఆమోదించడం వల్ల తెలంగాణలో ఆ పార్టీ ఇమేజ్ దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. అటు అధిష్టానానికి వ్యతిరేకంగా పోరాడలేక ఇటు తెలంగాణ ప్రజలను సమాధానం చెప్పలేక వారు తిప్పలు పడుతున్నారు.
పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలుపుతూ రూపొందించిన సవరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందేలా బీజేపీ అధిష్టానం చేసింది. తమ పార్టీ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ కమలనాథులకు మింగుడుపడటం లేదు. మొన్నటి వరకు బిల్లును వ్యతిరేకిస్తూ ఈ పార్టీ నేతలు ఆందోళనలు చేశారు. ముంపు ప్రాంతాలను ఏపీలో కలపొద్దంటూ హస్తిన వెళ్లి వినతి ప్రతాలు అందజేశారు. ఇటీవల పోలవరం డిజైన్ మార్చాలంటూ ప్రధానికి లేఖ కూడా రాశారు. ఆ తర్వాత అధిష్టానం నుంచి ఎటువంటి ఆదేశాలు వచ్చాయో తెలియదుగానీ అనూహ్యరీతిలో వారు వెనక్కితగ్గారు. ఇటువంటి పరిస్థితుల్లో లోక్‌సభలో బిల్లు ఆమోదానికి పార్టీ అధిష్టానం అంతాతానై నిలిచింది. పట్టుబట్టి మరీ బిల్లు ఆమోదం పొందేలా చేసి పంతం నెగ్గించుకుంది.
ఈ కీలక పరిణామంతో ప్రస్తుతం తెలంగాణలో ఆ పార్టీ నేతలకు ముఖం చెల్లట్లేదు. ప్రజల ముందుకెళితే మన ప్రాంతాలను ఏపీలో కలుపుతుంటే ఏం చేస్తున్నారంటూ నిలదీస్తారని జంకుతున్నారు. అసలే విద్యుత్ విషయంలో పీపీఏల రద్దు, పోలవరం ఆర్డినెన్స్ , హైదరాబాద్ శాంతి భద్రతలపై గవర్నర్‌కు ప్రత్యేక అధికారాల విషయంలో ఏపీ సీఎం చంద్రబాబును నిలదీయడంలో విఫలమయ్యారంటూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో బిల్లు ఆమోదం పొందడంతో వారికేమీ పాలుపోవడం లేదు.