సాక్షి, కర్నూలు: కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఎత్తిపోతల పథకాల్లో నీరు పారడం లేదు. మరోవైపు అవినీతి మాత్రం ఏరులై పారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అన్ని ఎత్తిపోతల పథకాల్లో చేపట్టిన పనులు నాసిరకంగా ఉండటంతో నిర్ణీత లక్ష్యం మేరకు రైతులకు నీళ్లు పారడం లేదు. కాంట్రాక్టర్ల జేబుల్లోకి మాత్రం నిధులు కోట్లలో నిండుకున్నాయి. నాసిరకంగా పనులు ఉన్నాయా? లేదా అనే విషయాన్ని క్వాలిటీ కంట్రోలు (నాణ్యత పరీక్ష) చేయకుండానే బిల్లులు చెల్లించేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాగునీటి అభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఐడీసీ) అధికారులు చేష్టలూడిగి చూస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో ఎత్తిపోతల పథకాల కోసం పదేళ్ల కాలంలో దాదాపు రూ. 500 కోట్లు ఖర్చు చేశారు. ఈ పనులతో ప్రజలకు ఒరిగింది లేకపోయినా కాంట్రాక్టర్లు మాత్రం బాగుపడ్డారు.
కోవెలకుంట్ల మండలం కలుగొట్ల ఎత్తిపోతల పథకాన్ని రూ. 6.71 కోట్లతో నిర్మించారు. అప్పట్లో నిధులు వెనక్కి మళ్లిపోతాయన్న సాకుతో కమిటీ వారికి రిజిస్ట్రేషన్ చేయకుండానే ఐడీసీ అధికారులు ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించి పనులు మొదలు పెట్టారు.
అయితే పొలం యజమాని ఎం. వీరారెడ్డి అనుమతి లేకుండా నిర్మించిన పథకం నిరుపయోగంగా మిగిలిపోయింది. ఈ పథకాన్ని వినియోగంలోకి తీసుకురావాలని ఐడీసీ అధికారులకు కమిటీ సభ్యులు లేఖలు రాసినా ఫలితం లేకుండా పోయింది. అయితే పైపులైన్ పనులు నాసిరకంగా ఉండడంతో అక్కడక్కడ లీకేజీలు కూడా ఏర్పడ్డాయి.
కోవెలకుంట్ల మండలం వల్లంపాడు ఎత్తిపోతల పథకం 500 ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా రూ. 3.50 కోట్లతో సుజల కంపెనీ ఈ పనులను చేపట్టింది. పంట కాల్వలు నిర్మాణం జరగలేదు. పైప్‌లైన్ పనులూ పూర్తికాలేదు. పనులు అసంపూర్తిగా ఉండగానే ప్రాజెక్టు 2014 ఆగస్టు ఒకటి నాటికి పూర్తయినట్లు రైతు సంఘంతో ఐడీసీ అధికారులు ఒప్పంద పత్రం రాయించారు. అయితే 160 ఎకరాలకు కూడా నీరందడం లేదు.
గూడూరులో 4,300 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే లక్ష్యంతో రూ. 19 కోట్లతో నిర్మించిన మునగాల ఎత్తిపోతల పథకం ద్వారా కనీసం 2,500 ఎకరాలకూ నీరందని పరిస్థితి. ఇక్కడ ఒకే మోటారుతో నీరు పంపింగ్ చేస్తున్నారు. రెండు మోటార్లు నడిస్తే పైపులైన్లు పగిలిపోతున్నాయి. సిమెంటు పనులు నాసికరంగా ఉన్నాయి. అయినా కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు చెల్లించారు.
గురురాఘవేంద్ర ప్రాజెక్టులో భాగంగా జలయజ్ఞం కింద రూ 176 కోట్లతో 12 ఎత్తిపోతల పథకాలు చేపట్టారు. ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలో చిలకలడోణ, పూలచింత, సూగూరు, మాధవరం, దుద్ది, సోగనూరు, బసలదొడ్డి, మూగలదొడ్డి ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. 2005లో పనులు మొదలు పెట్టి నేటికీ పూర్తి చేయలేదు. కొన్ని రిజర్వాయర్లలో చేసిన పనులు నాసిరకం కావడంతో రాతికట్టడం, కట్టలు పగుళ్లిచ్చాయి. వీటి కోసం ఇప్పటివరకు వరకు రూ. 126 కోట్ల మేరకు ఖర్చు చేశారు.
చింతలడోణ ఎత్తిపోతల పథకానికి రూ. 9 కోట్ల వరకు వెచ్చించారు. ఒక ఎకరానికి నీరు అందించలేదు. చేసిన పనులు నాసిరకం కావడంతో సిమెంట్ కాల్వలు శిథిలావస్థకు చేరాయి. సూగూరుది ఇదే పరిస్థితి.
పూలచింత ఎత్తిపోతల పథకానికి రూ. 15 కోట్లు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. సోగనూరు ఎత్తిపోతల కాల్వ నిర్మాణంలో ఆలస్యమైంది. రాతి కట్టలతో నిర్మించాల్సిన కాల్వ లైనింగ్ పనులు పూర్తి కాలేదు.
లీకేజీలతో అరకొరగా సాగునీరు..
కలుగొట్ల ఎత్తిపోతల పథాకానికి 750 ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. రూ. 8 కోట్లతో దీనిని 2012లో పూర్తి చేశారు. ఇప్పటి వరకు 400 ఎకరాలకు మించి నీరు అందడం లేదు. పైపులైను లీకేజీలు, పంట కాల్వలు లేని కారణంగా ఈ పథకం ద్వారా పూర్తిస్థాయిలో సాగునీరు అందటం లేదు.
- శ్రీనివాసరెడ్డి, రైతు, కలుగొట్ల
రెండేళ్ల వరకు కాంట్రాక్టర్‌దే బాధ్యత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ(ఏపీఎస్‌ఐడీసీ) కింద 75 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. ఇందులో 11 పథకాలు పనిచేయడం లేదు. మిగిలిన అన్ని పథకాల్లోనూ 70 నుంచి 80 శాతం మేర ఆయకట్టుకు నీరు అందుతోంది. నాసిరకం పనులకు ఆస్కా రం ఉండదు. ఎందుకంటే పనులు చేపట్టిన కాంట్రాక్ట రు రెండేళ్ల వరకు నిర్వహణ చూసుకోవాల్సి ఉంటుంది.
- రెడ్డి శంకర్, కార్యనిర్వాహకఇంజినీరు(ఈఈ), ఏపీఎస్‌ఐడీసీ.
ఎత్తిపోతలే..!
Published Mon, Feb 23 2015 2:52 AM | Last Updated on Sat, Sep 2 2017 9:44 PM
Advertisement